ETV Bharat / city

'నెలకు ఒక్క లీడర్‌నైనా భాజపాలోకి తీసుకొస్తా..'

author img

By

Published : Jul 6, 2022, 3:31 PM IST

BJP Leader Konda Vishweshwar Reddy Comments on TRS and Congress
BJP Leader Konda Vishweshwar Reddy Comments on TRS and Congress

Konda Vishweshwar Reddy Comments: భాజపాలో చేరిన తర్వాత మొదటిసారిగా కొండా విశ్వేశ్వర్​రెడ్డి పార్టీ కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ క్రమంలోనే మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన కొండా.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

Konda Vishweshwar Reddy Comments: సీఎం కేసీఆర్‌ను అడ్డుకోవడం భాజపాకే సాధ్యమని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇతర పార్టీలకు తెరాసను ఢీకొట్టే సత్తాలేదన్నారు. కొండా విశ్వేశ్వర్​రెడ్డి మొదటిసారిగా నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ఈ నెల 3న నిర్వహించిన విజయసంకల్ప సభ వేదికగా భాజపాలో చేరిన కొండా.. తొలిసారిగా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి రావడంతో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. చేరికలపై ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీలో కొండాను సభ్యుడిగా నియమించారు. ఈ నేపథ్యంలో కొండాను బండి సంజయ్‌ సన్మానించారు.

ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వరరెడ్డి మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త పార్టీ పెట్టే అవకాశం లేదని కొండా పేర్కొన్నారు. తెరాసలో మూడే నడుస్తున్నాయని.. ఒకటి కాళ్లు మొక్కించుకోవడం... రెండోది డబ్బులు తీసుకోవడం.. మూడోది కేసులతో బెదిరించడమన్నారు. భాజపాలో చేరే విషయం కాంగ్రెస్‌ నేతలందరికి తెలుసన్నారు. రేవంత్‌ కంటే సీనియర్ నేతలకు కూడా తాను భాజపాలో చేరుతున్న విషయం తెలుసన్నారు. ఇన్ని రోజులు తాను తటస్థంగా ఉన్నా.. ఎవరూ పట్టించుకోలేదన్న కొండా... ఇప్పుడు భాజపాలో చేరే సరికి అందరూ అడుగుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు.

"నేను ఇన్ని రోజులు తటస్థంగా ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. భాజపాలో చేరే సరికి ఇప్పుడు అందరూ అడుగుతున్నారు. కాంగ్రెస్‌లోని సీనియర్‌ నేతలకు కూడా నేను భాజపాలో చేరుతున్న విషయం తెలుసు. భాజపాలో సరైన కమిటీలో నాకు అవకాశం కల్పించారు. నెలకి ఒక్క లీడర్‌ను అయినా పార్టీలోకి తీసుకొస్తా" - కొండా విశ్వేశ్వర్​రెడ్డి, భాజపా నేత

అనంతరం.. శేరిలింగంపల్లిలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో సుందరయ్య మెమోరియల్ ట్రస్ట్, మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ ఆధర్యంలో విద్యార్థులకు ఉచితంగా నోట్ బుక్స్ పంపిణీ చేసే కార్యక్రమంలో కొండా పాల్గొన్నారు. తెరాస ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని గాలికి వదిలేసి ప్రచారానికే పరిమితమైందని కొండా విశ్వశ్వర్ రెడ్డి విమర్శించారు. ప్రజలకు అవసరమైన విద్యావైద్య పథకాలను విస్మరించారని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలు ప్రారంభమై పది రోజులు గడుస్తున్నా.. విద్యార్థులకు పుస్తకాలు అదించలేదని అరోపించారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెరాస ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో ఎలాంటి మౌలిక వసతుల కల్పనకు నోచుకోలేదన్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.