ETV Bharat / city

BIO COVERS: మొక్కజొన్న గంజితో బయో సంచులు.. ఎక్కడో తెలుసా!

author img

By

Published : Jun 8, 2022, 6:48 PM IST

BIO COVERS: ప్లాస్టిక్‌.. అందరికీ బాగా సుపరిచితమైంది. ఎంతలా అంటే నిత్యం మనం ప్లాస్టిక్‌ వాడకుండా ఉండలేని పరిస్థితి. అంతలా పెనవేసుకుని పోయాం. ఎందుకంటే ఎక్కడికెళ్లిన ప్లాస్టిక్ కవర్‌లేనిదే పని జరగని పరిస్థితి. మరి అలాంటి ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించాలని ప్రభుత్వాలు ఎన్నో సార్లు ఉత్తర్వులు జారీ చేసిన అవి కాగితాలకు మాత్రమే పరిమితమయ్యాయి. కానీ, అటువంటి పర్యావరణ హిత కవర్లను తయారు చేస్తూ ప్లాస్టిక్‌ను అరికడతామంటున్నారు.. ఏపీలోని ఒంగోలుకు చెందిన ఆ సోదరులు.

BIO COVERS
మొక్కజొన్న గంజితో బయో సంచులు

మొక్కజొన్న గంజితో బయో సంచులు

BIO COVERS: ప్లాస్టిక్...! ఈ భూతం భూమిలో కరగడానికి వందల సంవత్సరాలు పడుతుంది. ప్రమాదరకమైన ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని తగ్గించాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ప్లాస్టిక్‌ కవర్లు వాడకూడదు అని ప్రభుత్వాలు చెబుతున్నాయే తప్ప.. వాటికి ప్రత్యామ్నాయాలు మాత్రం చూపడం లేదు. దీనిని గమనించిన ఓ యువకుడు వివిధ దేశాల్లోని ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాల పరిస్థితులపై పరిశోధనలు చేశారు. అలా.. తనదైన ఆలోచనలతో మొక్కజొన్న విత్తనాల ద్వారా తయారయ్యే కవర్లు రూపొందిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కొణిజేడుకు చెందిన మహేంద్ర.. అమెరికాలోని ప్రముఖ ఔషధ కంపెనీలో డేటా ఆర్కిటెక్‌గా పనిచేస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న ప్లాస్టిక్‌ వినియోగాన్ని ఎలాగైనా తగ్గించాలని మహేంద్ర భావించారు. ఐతే.. ప్లాస్టిక్‌ వాడొద్దు అనడం కంటే.. దాని స్థానంలో పర్యావరణ హితమైన వస్తువును ప్రజల చేతికిస్తేనే ప్లాస్టిక్‌ మహమ్మారిని దూరం పెట్టవచ్చని మహేంద్ర భావించారు. అలా.. విస్తృత అధ్యయనాల అనంతరం.. కొణిజేడులో పర్యావరణహిత కవర్ల పరిశ్రమ స్థాపించారు.

ఈ కంపెనీలో.. మొక్కజొన్న గంజితో బయో సంచులు తయారు చేస్తారు. దీని గురించి తెలుసుకునేందుకు.. మహేంద్ర, అతడి సోదరుడు జర్మనీ, చైనా, వియత్నాం వంటి దేశాలకు వెళ్లి బయో పేపర్‌ ఉత్పత్తిని పరిశీలించారు. ఆ తరువాత.. జర్మనీ నుంచి ముడిసరుకైన మొక్కజొన్న గుళికలు తెప్పించి.. కావాల్సిన నాణ్యత, పరిమాణంతో కవర్లు తయారు చేయడం ప్రారంభించారు. ఇవి చూడటానికి ప్లాస్టిక్ కవర్లలా కనిపించినా, పర్యావరణానికి ఎలాంటి ముప్పు కలిగించవు. తేలిగ్గా ఉండే ఈ కవర్లు.. భూమిలో ఐదారు నెలల్లో కలిసిపోతాయంటున్నారు.. మహేంద్ర.

ఈ ప్లాస్టిక్‌ కవర్లను జంతువులు తిన్నా కానీ, వాటికి ఎటువంటి ప్రమాదం జరగదని ప్లాంట్‌ నిర్వహకులు చెబుతున్నారు. వీటి తయారీకి మెుక్కజొన్న వినియోగిస్తుండటం వల్ల.. జంతువులకు ఎలాంటి హాని కలుగదు అంటున్నారు మహేంద్ర. బయో కవర్ల పరిశ్రమని 2020లో స్థాపించారు. ఐతే.. కొవిడ్‌ కారణంగా తొలినాళ్లలో ఆర్డర్లు రాకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనంతరం.. ఈ ప్లాస్టిక్‌ తయారీ గురించి తెలుసుకుని చాలా మంది ఆర్డర్లు ఇస్తున్నారని నిర్వహకులు చెబుతున్నారు.

ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా.. పర్యావరణాన్ని కాపాడే ఉద్దేశంతో రాబోయే రోజుల్లో ప్లాస్టిక్‌ రహిత ప్లేట్లు, స్పూన్లు, పార్సిల్‌ కవర్లు తయారు చేయనున్నట్లు ఈ సోదరులు చెబుతున్నారు. ఇలా.. స్థానికంగా ఎంతో మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు. రానున్న రోజుల్లో బయో కవర్ల ఉత్పత్తి మరింత పెంచుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

తీరనున్న పాతికేళ్ల 'చెత్త' సమస్య.. ఆ దిశగా వడివడిగా అడుగులు..!

జాతీయ కార్యవర్గ సమావేశాలు.. సోషల్ మీడియా ప్రతినిధులతో కమలనాథుల భేటీ

అల్​ఖైదా హెచ్చరికలపై అప్రమత్తం.. కీలక ప్రాంతాలపై నిఘా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.