ETV Bharat / city

ఇలా చేస్తే.. ఆన్‌లైన్‌ తరగతులతోనూ అద్భుత ఫలితాలు

author img

By

Published : Dec 29, 2020, 9:39 AM IST

ప్రతి విద్యార్థి జీవితంలో పది, పన్నెండో తరగతి పరీక్షలు ఎంతో కీలకం. చదివే విధానం మొదలుకుని మార్కులు సాధించే తీరు వరకు.. అన్నింటిలోనూ ప్రత్యేకత ఉంటుంది. సంక్రాంతి తర్వాత పాఠశాలలు పునః ప్రారంభించే విషయం పరిశీలిస్తున్నా.. విద్యాశాఖ తరఫున నుంచి స్పష్టత లేదు. ఇప్పటికే విద్యా సంవత్సరం సగానికిపైగా పూర్తయ్యింది.. మరి ఈ విపత్కర పరిస్థితుల్లో బోర్డు పరీక్షలు రాసే విద్యార్థులు ఏ విధంగా ముందుకు సాగాలి..? ఇంటి వాతావరణంలో ఏ విధంగా పరీక్షలకు సన్నద్ధమవ్వాలి.. తదితర అంశాలపై ‘ఈటీవీభారత్’ కథనం..

awareness on online classes to get good results
ఆన్‌లైన్‌ తరగతులతోనూ అద్భుత ఫలితాలు

గతంలో ఉపాధ్యాయుల పర్యవేక్షణ, స్టడీ అవర్స్‌, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ.. ఇలా పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేవారు. ఇప్పుడు పూర్తిగా పాఠ్యపుస్తకాలు, నోట్స్‌కే పరిమితం కావాలి. దీన్ని దృష్టిలో ఉంచుకుని సబ్జెక్టుల వారీగా సమయాన్ని విభజించుకుని ముఖ్యమైన సూత్రాలు, నియమాలు వంటివి సులువుగా గుర్తుంచుకునే విధానాలపై దృష్టిపెట్టాలి.నాలుగైదుసార్లు చదువుకుంటూ, మళ్లీమళ్లీ జ్ఞప్తికి తెచ్చుకుంటూ నెమరువేసుకోవాలి.

సానుకూల దృక్ఫథం

సవాళ్లను అవకాశాలుగా మలుచుకునే సత్తా ప్రతిఒక్కరిలో ఉండాలి. సానుకూల దృక్పథం ద్వారా ఇది సాధ్యపడుతుంది. ఒకేరోజులో అన్ని చదివేయొచ్చన్న ఆలోచన సరికాదు. ఫిబ్రవరి లేదా మార్చిలో చదువుకుందామని భావించి వదిలేస్తే, ఒకేసారి చదవాలంటే తీవ్ర ఒత్తిడికి గురయ్యే అవకాశముంది. రోజుకు రెండు లేదా మూడు సబ్జెక్టులు తీసుకుని అందులోని పాఠ్యాంశాలను క్షుణ్నంగా చదువుతూ పట్టు సాధించాలి. ప్రతి 15 రోజులకోసారి రివిజన్‌ చేస్తుండాలి.

నమూనా ప్రశ్నపత్రాలు ముఖ్యం

ఈసారి ప్రభుత్వం పరీక్షలను కుదించి ఆరు సబ్జెక్టులకు ఆరు పరీక్షలు మాత్రమే నిర్వహించాలని భావిస్తోంది. దీనికి తగ్గట్టుగా ప్రశ్నపత్రం సరళిని తెలుసుకోవాలి. గతంలో వచ్చిన ప్రశ్నలు తెలుసుకుని వాటిపై పట్టు సాధించాలి. ఎప్పటికప్పుడు పాఠం పూర్తయిన వెంటనే గతంలో ప్రశ్నపత్రాల్లో దానికి సంబంధించి ప్రశ్నలు ఏవైనా వచ్చాయో చూసి అధ్యయనం చేయాలి.

సలహాలు తీసుకోండి

ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితికి అనుగణంగా ఎవరికివారు జీవనశైలిని మార్చుకుని ముందుకు సాగుతున్నారు. చదువు పరంగానూ ఇదే సూత్రం వర్తిస్తుంది. ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లకు పరిష్కారం గుర్తించేందుకు కుటుంబసభ్యులు లేదా స్నేహితుల మద్దతు తీసుకోవడం మంచిది. ఎలాంటి సందేహాలున్నా.. వారి సలహాలు తీసుకునేందుకు వెనుకడుగు వేయరాదు.

సమయపాలన కీలకం..

ఇప్పుడు ఇంట్లోనే ఉండి పాఠాలు వినడం కారణంగా షెడ్యూల్‌ని తగిన విధంగా మార్చుకోవాలి. ప్రాధాన్య క్రమంలో షెడ్యూల్‌ని ఏర్పాటు చేసుకొని అమలు చేయాలి. పౌష్టికాహారం ఎంతో కీలకం. తాజా ఆకుకూరలు, పండ్లు, ఎండు ఫలాలు, పాల పదార్థాలు తీసుకోవాలి.

మానసికంగా దృఢంగా ఉండా

నిత్యం వ్యాయామం, యోగా, ధ్యానం చేయడం ద్వారా మానసికంగా ప్రశాంతంగా ఉండవచ్చు. తొలుత సాధన చేయడం ఇబ్బందిగా ఉన్నా, తర్వాత అలవాటు పడితే మెదడుకు ఎంతో హాయినిస్తుంది. ఆన్‌లైన్‌ తరగతులే కాకుండా పాఠశాలలు ప్రారంభించి నేరుగా బోధన చేయాలి.

- డాక్టర్‌ మోతుకూరి రాంచందర్‌, మనస్తత్వ విశ్లేషకులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.