AP PRC issue: ఫిబ్రవరి 3 న 'చలో విజయవాడ'.. ఏపీ పీఆర్సీ సాధన సమితి పిలుపు

author img

By

Published : Jan 27, 2022, 7:55 PM IST

AP PRC Struggle committee

AP PRC Struggle committee: ఏపీలో పీఆర్సీ వివాదం కొనసాగుతూనే ఉంది. కొత్త పీఆర్సీ జీవోల వల్ల ఉద్యోగులకు తీవ్ర నష్టం కలుగుతుందని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై సచివాలంలో స్టీరింగ్​ కమిటీ సమావేశం అనంతరం ఏపీ పీఆర్సీ సాధన సమితి పలు వ్యాఖ్యలు చేసింది. చర్చలకు కొత్త సంఘాలు కూడా రావాలని ప్రభుత్వం ఆహ్వానించడంపై నేతలు మండిపడ్డారు. ఇంకా ఎన్ని సంఘాలను చీలుస్తారని ఆరోపించారు. ఈ మేరకు ఫిబ్రవరి 3 న 'చలో విజయవాడ'కు పీఆర్సీ సాధన సమితి పిలుపునిచ్చింది.

AP PRC Struggle committee: ఫిబ్రవరి 3న 'చలో విజయవాడ'కు లక్షలమంది తరలిరావాలని ఏపీ పీఆర్సీ సాధన సమితి పిలుపునిచ్చింది. సచివాలయంలో స్టీరింగ్ కమిటీ సమావేశం అనంతరం సంఘ నేతలు మీడియాతో మాట్లాడారు. ఈ నెలకు పాతజీతం ఇవ్వాలని కోరామని సమితి నేత బండి శ్రీనివాస్‌ వెల్లడించారు. అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక బయటపెట్టడంతో పాటు.. పీఆర్సీ జీవోలు రద్దు చేయాలని కోరామని గుర్తు చేశారు. తమ చిన్న కోరికలు తీర్చలేని కమిటీ.. డిమాండ్లు తీరుస్తుందా? అని ప్రశ్నించారు. తాము ప్రస్తావించిన 3 డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తే చర్చలకు సిద్ధమని స్పష్టం చేశారు.

ఎన్ని సంఘాలను చీలుస్తారు..?

పీఆర్సీ జీవోల వల్ల ఉద్యోగులకు తీవ్ర నష్టం కలుగుతుందని అమరావతి జేఏసీ ఉద్యోగుల అధ్యక్షుడు బొప్పరాజు అన్నారు. చర్చలకు వెళ్లాలంటే తమ 3 కోరికలు నెరవేర్చాలని అడిగామని.. కానీ మా లేఖకు ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు స్పందన లేదని చెప్పారు. ప్రజలు, ఉద్యోగులకు ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

"ఉద్యోగ సంఘాల నేతలే చర్చలకు రావడం లేదని ప్రచారం చేస్తున్నారు. సజ్జల చుట్టూ మేం అనేకసార్లు తిరిగాం. 40 పాయింట్లపై సజ్జల గంటన్నరసేపు వివరంగా చర్చించారు. మాకు జరిగిన ప్రతి అన్యాయానికి సజ్జల సాక్ష్యం కాదా.? చర్చలకు కొత్త సంఘాలు కూడా రావాలని ఆహ్వానిస్తారా? ఇంకా ఎన్ని సంఘాలను చీలుస్తారు? మీ వద్దకు వచ్చిన 9 మంది ఉద్యోగ సంఘాల నేతలు కాదా.?. లిఖితపూర్వక లేఖలకు సమాధానం ఇవ్వాలని కోరుతున్నాం. మా లేఖలకు ప్రభుత్వం జవాబిస్తేనే చర్చలకు వెళ్తాం." - బొప్పరాజు, అమరావతి జేఏసీ ఉద్యోగుల అధ్యక్షుడు

ట్రెజరీ ఉద్యోగులు కూడా తమలో భాగమేనని బొప్పరాజు అన్నారు. తమ కార్యాచరణలో భాగంగానే ట్రెజరీ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ట్రెజరీ సిబ్బందిపై చర్యలు తీసుకుంటే తమను రెచ్చగొట్టినట్లే అని హెచ్చరించారు. జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతుందని బొప్పరాజు ఆరోపించారు. సప్లిమెంటరీ బిల్లులు రూ. 18 కోట్లు వెంటనే ఇవ్వాలని బొప్పరాజు డిమాండ్ చేశారు.

రాష్ట్ర పీఆర్సీనా .. కేంద్ర పీఆర్సీనా - సూర్యనారాయణ

"మీరు అమలుచేసేది రాష్ట్ర పీఆర్‌సీనా.. కేంద్ర పీఆర్‌సీనా...? మంత్రుల కమిటీ తొలుత అయోమయం వీడాలి. ఉద్యోగులతో ప్రభుత్వం దోబూచులాట ఆడుతోంది. కేంద్రం 104 రకాల అలవెన్సులు ఇస్తోంది.. మీరూ ఇస్తారా. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలుసు. రికవరీ విధానం ఎందుకు పెట్టారో సమాధానం చెప్పాలి? పీఆర్సీ కమిటీ నివేదిక లేకుండా పే ఫిక్సేషన్ ఎలా చేస్తారు? మాకు మెచ్యూరిటీ లేదనే మాట ఉపసంహరించుకోవాలి. చర్చలు ఫలవంతం అయ్యేలా ప్రభుత్వం చొరవ చూపాలి" - సూర్యనారాయణ

లేఖలు అందజేత..

ఈ నెలకు పాత జీతమే ఇవ్వాలని పీఆర్సీ సాధన సమితి నేతలు కోరారు. ఈ మేరకు లేఖలు అందజేయాలని పిలుపునిచ్చారు. సాధన సమితి పిలుపు మేరకు ఉద్యోగులు.. తమ విజ్ఞప్తి లేఖలను డీడీవోలకు అందజేస్తున్నారు. ఈ మేరకు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి కూడా పంచాయతీరాజ్ శాఖ డీడీవోకు లేఖను అందజేశారు.

మరో ప్రత్యామ్నాయం ఏముంది..? సజ్జల కీలక వ్యాఖ్యలు!

Sajjala Ramakrishna Reddy on Employees Protest: అంతకుముందు మీడియాతో మాట్లాడిన ఏపీ ప్రభుత్వసలహాదారు సజ్జల.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పీఆర్సీపై ఉద్యోగుల అపోహలు తొలగించేందుకు మెట్టు దిగేందుకూ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎక్కడో కూర్చుని మాట్లాడితే సమస్యకు పరిష్కారం దొరకదని చెప్పారు. చర్చల కోసం మంత్రుల కమిటీ సచివాలయంలో సిద్ధంగా ఉందన్న ఆయన.. రేపు కూడా అందుబాటులో ఉంటామని వెల్లడించారు. పీఆర్సీ సాధన సమితి, ఇతర సంఘాలు వచ్చినా అందుబాటులోనే ఉంటామని పేర్కొన్నారు.

ఉద్యోగుల డిమాండ్లను సీఎం జగన్​తో చర్చించి పరిష్కరానికి ప్రయత్నిస్తామని సజ్జల తెలిపారు. ఉద్యోగుల ప్రతినిధులు వచ్చి చర్చిస్తేనే వారిపై ఒత్తిడి తగ్గుతుందన్నారు. ట్రెజరీ సిబ్బంది ప్రభుత్వ ఆదేశాన్ని ఉల్లంఘించటం క్రమశిక్షణారాహిత్యమని సజ్జల వ్యాఖ్యానించారు. ప్రభుత్వంతో చర్చించకుండా ఉద్యోగులకు మరో ప్రత్యామ్నాయం ఏముందన్నారు. దుందుడుకు వైఖరి, ఒంటెత్తు పోకడలతో వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: పట్టణ ఉపాధిహామీ పథకం ప్రవేశపెట్టాలి: కేటీఆర్​

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.