ETV Bharat / city

పురుగుల వెంట పడ్డాడు.. అవార్డులు దక్కించుకున్నాడు

author img

By

Published : Feb 26, 2022, 7:46 PM IST

Macro Wildlife Photography: పురుగులను ఫొటో తీయడమేంటని మిత్రులు నవ్వుకున్నారు. ఇంకా చెప్పాలంటే.. పురుగులా చూశారు! చక్కని ఉద్యోగం చూసుకొని జీవితంలో స్థిరపడమని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేశారు. ఎవ్వరి మాటా చెవికి ఎక్కించుకోలేదా యువకుడు. వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ ద్వారా గుర్తింపు సాధించాలన్న తన లక్ష్యాన్ని ఈ మాటలేవీ నీరుగార్చలేదు. అడవులు పట్టుకొని రోజుల తరబడి తిరిగాడు. గంటల తరబడి వేచి చూసి చిత్రాలు బంధించాడు. ఇప్పుడవే అతనికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. అంతేనా..? వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రఫీలో ఉత్తమ ఫొటోగ్రాఫర్‌ అవార్డు సైతం దక్కించుకున్నాడు! ఆ యువకుడే.. తిరుపతికి చెందిన ఈనేష్‌ సిద్ధార్థ.

వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రఫీ
వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రఫీ

వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ

Macro Wildlife Photography: చదువులు, ఉద్యోగాలే లక్ష్యంగా జీవిస్తున్న యువతలో చాలా మందికి.. తమతో పాటే ఈ భూమిపై జీవించే చాలా జీవుల గురించి తెలియదు. తూనీగలు, సీతాకోక చిలుకలు, సాలెపురుగుల వంటి క్రిమి, కీటకాలను వీడియోలు, ఫొటోల్లో చూడడమే తప్ప.. ప్రత్యేకంగా చూసిందే లేదు. తిరుపతికి చెందిన ఈ యువకుడు అలా కాదు... స్మూక్ష్మ క్రిమికీటకాల్ని సరికొత్త రూపంలో ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నాడు.

Macro Wildlife Photography
సిద్ధార్థ తీసిన ఫొటో

తిరుపతిలోనే ప్రాథమిక, ఉన్నత విద్య అభ్యసించిన ఈనేష్‌.. శ్రీ విద్యానికేతన్​లో బీఎస్సీ మైక్రోబయాలజీ చదివాడు. తర్వాత నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో లాబ్‌ టెక్నీషియన్‌గానూ పనిచేశాడు. ఈ సమయంలోనే స్పై క్రియేషన్స్‌ అనే ఓ సంస్థ నిర్వహించిన ఫొటోవాక్‌లో పాల్గొన్న సిద్ధార్థ్‌.. మాక్రో ఫొటోగ్రఫీ గురించి తెలుసుకున్నాడు. దానిపై తెలియకుండానే మక్కువ పెరిగిపోయింది.

" మాక్రో ఫొటోగ్రఫీకి పెద్ద నిర్వచనమే ఉంది. అయితే వాడుక భాషలో చెప్పాలంటే...దోమలు,ఈగలు వంటి కీటకాలు ఎలా ఉంటాయో చూపించడమే మాక్రో ఫొటోగ్రఫీ. ఒకసారి స్నేహితులు ఇచ్చిన లెన్స్​తో సీతాకోకచిలుక చిత్రం తీశాను. అది నాకు బాగా నచ్చింది. అప్పటి నుంచి దాదాపు 60కి పైగా కీటకాల చిత్రాలను ఇక్కడి దగ్గర ప్రాంతాల్లోనే చిత్రీకరించాను." - ఈనేష్‌ సిద్ధార్థ్‌, వైల్డ్‌లైఫ్‌ మాక్రో ఫొట్రోగ్రాఫర్‌‌

Photography on Insects :ఇష్టాన్ని వదులుకోని సిద్ధార్థ్‌.... రోజుల తరబడి అడవులు పట్టుకొని తిరుగుతూ గంటల తరబడి కీటకాల వెంటపడుతూ అరుదైన చిత్రాలను తన కెమెరాలో బంధించే ప్రయత్నం చేశాడు. పురుగులు, కీటకాల కోసం సిద్ధార్థ్‌ ప్రయత్నాలు చూసి... మిత్రులు, సహచరులు నవ్వుకొనే వాళ్లు, ప్రారంభంలో ఇంట్లో వాళ్లు సైతం ఏదైనా ఉద్యోగం చేసుకోమని చెబుతుండే వాళ్లు. ఇలా ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా... తనకిష్టమైన కళను కొనసాగించాడు.

Macro Wildlife Photography
సిద్ధార్థ తీసిన ఫొటో

రెండు సంవత్సరాలు శేషాచలం అటవీ ప్రాంతంలో తిరుగుతూ తూనీగలు, సీతాకోక చిలుకల అరుదైన ఫొటోల్ని తీశాడు.... సిద్ధార్థ్‌. పడగ విప్పిన ఆడుతున్న పాము, కంటిమీద పడిన నీటి బొట్టును తన కాలితో తుడుచుకొంటున్న తూనీగా ఇలా.. ఈ కుర్రాడు తీసిన చిత్రాలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. మధ్య తరగతి కుటుంబమైనా....వేల రూపాయల కెమెరాలు కొనుగోలు చేసే ఆర్థిక స్థితి లేకపోయినా పరిమిత వనరులతోనే వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రఫీలో మాక్రో విభాగంలో అద్భుత చిత్రాల్ని తన ఫొన్‌లోనే బంధిస్తున్నాడు ఈ యువకుడు.

Macro Wildlife Photography
సిద్ధార్థ తీసిన ఫొటో

" డబ్బు ఎప్పుడైనా సంపాదించవచ్చు. కానీ ముందు మంచి పేరు తెచ్చుకోవాలి. నేషనల్‌ జియోగ్రఫీ ఛానల్‌లో నా మైక్రో ఫొటోగ్రఫీ చిత్రాలు రావడమే నా ధ్యేయం. మొబైల్​తో ఫొటోలు తీసే మంచి వైల్డ్‌లైఫ్‌ మైక్రో ఫోట్రోగ్రాఫర్‌ పేరు తెచ్చుకోవడమే నా లక్ష్యం." - ఈనేష్‌ సిద్ధార్థ్‌, వైల్డ్‌లైఫ్‌ మాక్రో ఫొట్రోగ్రాఫర్‌‌.

Macro Photography with mobile : శేషాచలంతో పాటు తిరుపతి నగర శివారు ప్రాంతాల్లో తిరుగుతూ అరుదైన కీటకాల ఫొటోలు తీస్తున్న సిద్ధార్ధ్‌... డబ్బుల సంపాదనపై తనకు దృష్టి లేదని, ఏదైనా ఓ రంగంలో ప్రత్యేక గుర్తింపు సాధిస్తే.. అతి ఎల్లకాలం ఉంటుందని చెబుతున్నాడు. అందుకోసమే తాను మాక్రో ఫొటోగ్రఫీని ఎంచుకున్నట్లు చెబుతున్నాడు.

Macro Wildlife Photography
సిద్ధార్థ తీసిన ఫొటో

ఎన్నో కష్టనష్టాల కోర్చి.. సిద్ధార్థ్‌ తీసిన చిత్రాలు ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంటున్నాయి. ఇతడు తీసిన ఫొటోల్లో.. ఎర్ర రంగు తూనీగ చిత్రం ప్రత్యేకంగా నిలుస్తోంది. ఫొటో తీసేందుకు తాను ప్రయత్నిస్తున్నప్పుడు తూనీగ ఒక చోట నుంచి మరోచోటకి ఎగురుతుండడంతో దాదాపు 6 గంటల పాటు కష్టపడాల్సి వచ్చింది. ఆ కష్టానికి ప్రతిఫలంగా... ఈ ఎర్రని తూనీగా చిత్రానికి.. వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రఫీలో చిత్తూరు జిల్లా స్థాయిలో అవార్డు వరించింది.

" వర్షంలో, ఉదయం సమయాల్లో డ్రాగన్ ఫ్లైస్ చాలా హుషారుగా ఉంటాయి. వాటి చిత్రాల కోసం దాదాపు 4-6గంటల పాటు శ్రమించాను. ఆ సమయంలో ఒక ఎర్రని డ్రాగన్ ఫ్లై నా దగ్గరకు వచ్చి వాలింది. అది వాన చినుకును తుడుచుకుంటున్న వీడియో నాకు బాగా నచ్చింది అప్పుడు తీసిన ఫొటోకే నాకు జిల్లా స్థాయిలో అవార్డు లభించింది. " -ఈనేష్‌ సిద్ధార్థ్‌, వైల్డ్‌లైఫ్‌ మాక్రో ఫొట్రోగ్రాఫర్‌‌

ఫొటోగ్రఫీలో నైపుణ్యాలతో... డబ్బులు సంపాదించే వీలున్నా... మాక్రో వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రఫీలోనే పని చేస్తానంటున్నాడు... ఈ యువకుడు. నేషనల్‌ జియోగ్రఫీ ఛానల్‌లో ప్రసారమయ్యే స్థాయిలో అత్యుత్తమ చిత్రాలు తీయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నాడు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.