ETV Bharat / city

ప్రాజెక్టులకు పోటెత్తుతోన్న వరద... గేట్లెత్తి దిగువకు నీటి విడుదల

author img

By

Published : Jul 10, 2022, 11:08 AM IST

Updated : Jul 10, 2022, 11:36 AM IST

Flood to Irrigation projects: ఎడతెరిపి లేని వానలతో రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లోకి వరద పోటెత్తుతోంది. గోదావరి జలాశయాలకు ఎగువ నుంచి ప్రవాహం పరుగులు తీస్తోంది. శ్రీరాంసాగర్‌కు భారీగా వరద కొనసాగుతోంది. చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులు నిండుకుండలా మారడంతో... గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. రానున్న ఐదారురోజులు గోదావరికి భారీగా వరద రానుందని వాతావరణశాఖ అదికారులు అంచనా వేస్తున్నారు.

Flood to Irrigation projects
Flood to Irrigation projects

ప్రాజెక్టులకు పోటెత్తుతోన్న వరద... గేట్లెత్తి దిగువకు నీటి విడుదల

Flood to Irrigation projects: రాష్ట్రంతో పాటు ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. జోరువానలకు నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరామ్‌సాగర్‌కు వరద పోటెత్తుతోంది. 2లక్షల 25వేల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. శుక్రవారం 25వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా... ఇవాళా దాదాపుగా 2లక్షల50వేలకు పెరిగింది. ఎస్సారెస్పీ పూర్తిస్థాయి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 43 టీఎంసీలు నీటినిల్వ ఉంది.

ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి శనివారం సాయంత్రం ఒక్కసారిగా ప్రవాహం పెరిగింది. ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండటంతో... 20 గేట్లు ఎత్తి లక్షకుపైగా క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 20 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 15టీఎంసీలకు పైగా నీటి నిల్వ ఉంది. కడెం నారాయణ రెడ్డి జలాశయం నిండుకుండలా మారింది. భారీగా వరదప్రవాహంతో... 9 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. కడెం పూర్తిస్థాయి నీటిమట్టం 7టీఎంసీలు కాగా... ప్రస్తుతం 6టీఎంసీలకు పైగా నిల్వ ఉంది.

గోదావరితో పాటు ప్రాణహిత ప్రవాహ ఉద్ధృతితో... కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలకు వరద పోటెత్తుతోంది. లక్ష్మీ-మేడిగడ్డ బ్యారేజీకి దాదాపుగా 4లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీంతో 57 గేట్లు ఎత్తి 4లక్షలకు పైగా క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. పార్వతి, సరస్వతి బ్యారేజీలకు కూడా ఎగువ నుంచి భారీగా ప్రవాహం వచ్చి చేరుతోంది. రానున్న అయిదారు రోజుల్లో గోదావరికి భారీ వరదలు వచ్చే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు నుంచి పోలవరం ప్రాజెక్టు వరకు నదిలో లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉండే అవకాశాలు ఉన్నట్లు ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన ఒక నివేదిక పేర్కొంది.

చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ఎగువ నుంచి 10 వేల 300 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. మూడు గేట్లు ఎత్తి 13 వేల 400 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. జుక్కల్ మండలంలోని కౌలాస్ నాలా జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకోవటంతో రెండు గేట్లు ఎత్తి వెయ్యి 96 క్యూసెక్కుల నీటిని మంజీరాలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి సామర్థ్యం 458 మీటర్లకుగాను... ప్రస్తుతం 457.60 మీటర్ల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.

నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరుగుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 13 వందల 92 అడుగులు, నిల్వ సామర్థ్యం 5.474 టీఎంసీలుగా ఉంది. నాగిరెడ్డిపేట్ మండలం పోచారం ప్రాజెక్టు అలుగు పారుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 6వేల 690క్యూసెక్కుల ప్రవాహం ఉండగా.. అంతే మొత్తంలో దిగువకు వెళ్లిపోతోంది. 14వందల 64 అడుగుల పూర్తి నీటి మట్టంతో 1.8 టీఎంసీల పూర్తి నీటి నిల్వతో ప్రాజెక్టు ఉంది. భద్రాద్రి జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు ఎగువన చత్తీస్‌గఢ్‌, ఒరిస్సా నుంచి వరద పోటెత్తుతోంది. 16 గేట్లను ఎత్తి దిగువకు 17 వేల 460 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహంతో భద్రాచలం వద్ద నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. స్నానఘట్టాల వరకు నీరు చేరింది.

ఇవీ చదవండి:

Last Updated :Jul 10, 2022, 11:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.