ETV Bharat / city

Corruption in Adilabad: అంతుబట్టని రహస్యం.. తెరవెనుక అదృశ్యశక్తి ఎవరు?

author img

By

Published : Oct 9, 2021, 3:02 PM IST

Corruption in Adilabad
Corruption in Adilabad

ఆదిలాబాద్​ జిల్లా ఇచ్చోడ కేంద్రంగా గతేడాది కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకంలో అవకతవకలతోపాటు తాజాగా వ్యవసాయశాఖలో అక్రమాలు బయటపడ్డాయి. అయిన ఇప్పటి వరకు బాధ్యలపై ఎలాంటి చర్యలు లేవు. తెరవెనుక అదృశ్యశక్తి ఎవరనేది అంతుబట్టని రహస్యంగా మారింది.

ప్రభుత్వ పథకాలు పక్కదారి పట్టకుండా చూడాల్సిన బాధ్యత అధికారులతోపాటు ప్రజాప్రతినిధులపై ఉంది. ఎక్కడ తప్పు జరిగినా దాన్ని సరిదిద్దాలి. ఇచ్చోడ కేంద్రంగా గతేడాది కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకంలో అవకతవకలతోపాటు తాజాగా వ్యవసాయశాఖలో బయటపడిన అక్రమాల బాధ్యులపై ఎలాంటి చర్యల్లేవు. దుర్వినియోగమైన ప్రభుత్వ నిధులను తిరిగి రాబట్టే ప్రయత్నంలో ప్రగతి కనిపించడం లేదు. తెరవెనుక అదృశ్యశక్తి ఎవరనేది అంతుబట్టని రహస్యంగా మారింది.

కల్యాణలక్ష్మిలో రూ. 87 లక్షల అవినీతి

ఇచ్చోడ మీ సేవా కేంద్రంగా కల్యాణలక్ష్మి పథకంలో రూ.87 లక్షల అవినీతి జరిగినట్లు తేలింది. గతేడాది సెప్టెంబరు 6న సిరికొండ మండలం పొన్న గ్రామానికి చెందిన జ్ఞానేశ్వర్‌ హత్య జరిగింది. పోలీసులు హత్య కేసును ఛేదిస్తే కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకం వ్యవహారం బయటపడింది. మొత్తం 87.10 లక్షలు దుర్వినియోగం చేసినట్లు పోలీసు, రెవెన్యూ అధికారులు జరిపిన విచారణలో తేలింది. తహసీల్దార్లు, ఆర్డీవోల తరువాత శాసనసభ్యులు సమగ్రంగా పరిశీలన తరువాతనే లబ్ధిదారులకు చెక్కులు అందివ్వడమనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన నిబంధన. అయినా ఒక్కొక్కరి పేరిట నాలుగైదుసార్లు నిధులు తీసుకోవడం సంచలనం సృష్టించింది. గుడిహత్నూర్‌ పోలీసు స్టేషన్‌లో కేసు సైతం నమోదైంది. ఇప్పటి వరకు నిధులను రాబట్టిందీలేదు. విచారణ సైతం మధ్యలోనే నీరుగారుస్తున్న వారెవరనేది తేలాల్సి ఉంది.

శనగల పంపిణీలో చేతివాటం

నేషనల్‌ ఫుడ్‌ సెక్యూరిటీ మిషన్‌(ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం- జాతీయ ఆహార భద్రత పథకం) కింద ఇచ్చోడ వ్యవసాయ డివిజన్‌కు 2018-19 రబీ కాలంలో రైతులకు పంపిణీ చేయాల్సిన శనగల్లో అవినీతి జరిగినట్లు వెల్లడైంది. ఇచ్చోడ వ్యవసాయ డివిజన్‌కు 1,025 కిట్ల శనగలు(ఒక్కో కిట్లో 16 కిలోలు) అంటే 164 క్వింటాళ్లను కేటాయించింది. వీటిని గ్రామసభల ద్వారా రైతులకు ఉచితంగా పంపిణీ చేయాల్సి ఉంది. వీటిని అందజేయకుండా పక్కదారి పట్టించి డబ్బులు సొమ్ము చేసుకున్నారు. రూ.13.12 లక్షలు దుర్వినియోమైనట్లు రుజువైంది. రైతులకు పంపిణీ చేసిన జాబితా కూడా తమ కార్యాలయంలో అందుబాటులో లేదని స్వయంగా ఇప్పటి ఇచ్చోడ ఏడీఏ రాంకిషన్‌ వెల్లడించారంటే అవినీతి జరిగినట్లు తేలిపోయింది. దీనిపై సమగ్ర విచారణ జరిపించడంలో జిల్లా వ్యవసాయశాఖ సాహసం చేయకపోవడానికి అసలైన కారుకులెవరనేది చర్చనీయాంశంగా మారింది.

బోథ్‌లో రోడ్ల పేరిట 47.12 లక్షలు..

బోథ్‌ పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి నుంచి భగత్‌సింగ్‌ చౌక్‌వరకు, తిరిగి భగత్‌సింగ్‌ చౌక్‌ నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు రెండుసార్లు బిల్లు చేసి రూ.17.98 లక్షలు డ్రా చేసుకోగా, ఇదే పట్టణంలోని దుర్గామాత మందిరం నుంచి భగత్‌సింగ్‌ చౌక్‌ వరకు తిరిగి భగత్‌సింగ్‌ చౌక్‌ నుంచి దుర్గామాత మందిరం వరకు నాలుగుసార్లు ఎంబీ రాసి రూ.29.14 లక్షలు డ్రా చేశారు. రెండు రోడ్లకు కలిపి ఆరుసార్లు ఎంబీ రాసిన పంచాయతీరాజ్‌ ఇంజినీర్లు రూ.47.12 లక్షల డ్రా చేయడానికి ఆమోదం తెలపడం ఇంజినీరింగ్‌ శాఖలో కలకలం సృష్టించింది. టెండర్లు లేకుండా ఇంజినీర్లు వ్యూహాత్మకంగా బిట్లుబిట్లుగా మార్చి పనులు చేయడం విస్మయానికి గురిచేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.