ETV Bharat / business

'దేశ ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచేందుకు వివో కుట్ర!'

author img

By

Published : Jul 26, 2022, 3:36 PM IST

ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ వివో మనీలాండరింగ్ వ్యవహారాన్ని.. దేశ ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచే కుట్రగా అభివర్ణించింది ఎన్​ఫోర్స్​మెంట్ డైరక్టరేట్. ఆ సంస్థకు చెందిన బ్యాంకు ఖాతాలను స్తంభింప చేయడాన్ని సమర్థించుకుంటూ దిల్లీ హైకోర్టులో ఈడీ ఈ మేరకు అఫిడవిట్‌ దాఖలు చేసింది.

vivo ed news
'దేశ ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచేందుకు వివో కుట్ర!'

చైనా మొబైల్‌ తయారీ కంపెనీ వివో బ్యాంకు ఖాతాలు స్తంభింప చేయడాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సమర్థించుకొంది. తాము సీజ్‌ చేసిన ఆ ఖాతాలు మనీలాండరింగ్‌లో భాగంగా ఉన్నాయని పేర్కొంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచే కుట్రగా పేర్కొంది. కంపెనీ ఖాతాలు సీజ్‌ చేయడంపై వివో ఇండియా దాఖలు చేసిన పిటిషన్‌పై దిల్లీ హైకోర్టులో ఈడీ ఈ మేరకు అఫిడవిట్‌ దాఖలు చేసింది. మనీలాండరింగ్‌ ద్వారా అతిపెద్ద ఆర్థిక నేరానికి వివో పాల్పడిందని దానిలో ఈడీ పేర్కొంది.

జులై 5న దేశవ్యాప్తంగా ఉన్న వివో, దాని అనుబంధ సంస్థల్లో ఈడీ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. వివో టర్నోవర్‌లో సగానికి పైగా నిధులను (రూ.62,476 కోట్లు) ఆ కంపెనీ చైనాకు తరలించిందని ఈడీ పేర్కొంది. మనీలాండరింగ్‌కు పాల్పడిందన్న ఆరోపణలపై కంపెనీకి చెందిన బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసింది. దీనిపై వివో ఇండియా ఇటీవల దిల్లీ హైకోర్టును ఆశ్రయిచింది. దీనిపై స్పందించిన కోర్టు.. రూ.950 కోట్ల బ్యాంక్‌ గ్యారెంటీలను సమర్పించి ఈడీ సీజ్‌ చేసిన ఖాతాలను వినియోగించుకోవచ్చని సూచించింది. వివో పిటిషన్‌పై ఈడీ స్పందనను కోర్టు కోరగా.. తాజాగా ఈడీ అఫిడవిట్‌ దాఖలు చేసింది.

మనీలాండరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖాతాలనే తాము స్తంభింపజేసినట్లు ఈడీ తన అఫిడవిట్‌లో పేర్కొంది. ఇది కేవలం ఆర్థిక నేరం కాదని.. దేశ ఆర్థిక వ్యవస్థ అస్థిరపరిచే కుట్రగా ఈడీ అభివర్ణించింది. దీనివల్ల దేశ సమగ్రత, సార్వభౌమత్వానికి ప్రమాదం పొంచి ఉందని అఫిడవిట్‌లో తెలిపింది. సోదాలు నిర్వహించడానికి, ఖాతాలను జప్తు చేయడానికి ముందస్తు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని ఈడీ పేర్కొంది. ఈ విషయంలో తాము చట్ట ప్రకారమే వ్యవహరించినట్లు ఈడీ పేర్కింది. వివో ఇండియా, దాని 22 అనుబంధ సంస్థల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందని కోర్టుకు ఈడీ తెలిపింది. ముఖ్యంగా మెజారిటీ నిధులు చైనాకు తరలిపోవడం అనుమానాస్పందంగా ఉందని, దానిపై దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొంది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను జులై 28కి కోర్టు వాయిదా వేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.