ETV Bharat / business

ఈ టిప్స్​తో ఆర్థిక సమస్యలు దూరం చేసుకోండి..

author img

By

Published : Jul 2, 2022, 11:58 AM IST

Financial Health Tips: 'ఆరోగ్యమే మహా భాగ్యం' అన్నది నానుడి. కానీ, ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండాలన్నా.. డబ్బు కావాల్సిందే. అందుకే, ఆర్థికారోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. ఒక వ్యక్తి ఆర్థికంగా ఇలా ఉండాలి అని నిర్ణయించే కచ్చితమైన సూత్రాలేమీ ఉండవు. కొన్ని నియమాలను పాటిస్తే.. ఇబ్బందులు ఎదురవ్వవు అని మాత్రం చెప్పొచ్చు. అవేమిటో తెలుసుకుందాం.

Tips Improve Your Financial Health
Tips Improve Your Financial Health

Financial Health: రూపాయి సంపాదించడానికి ఎంత కష్టపడతామో.. దాన్ని సరైన విధంగా వినియోగించడానికీ అంతే శ్రమించాలి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాలను సులువుగా సాధించేందుకు వీలవుతుంది. లేకపోతే.. ఖర్చులు పెరిగి, సంపాదన సరిపోక.. అప్పుల భారం మోయాల్సి వస్తుంది. ఇది దీర్ఘకాలంలో ఆర్థికంగానూ, ఆరోగ్యపరంగానూ ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.

సంపాదించిన మొత్తం అంతా ఖర్చు చేస్తే.. ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఈ ప్రశ్న ఎవరికి వారు వేసుకోవాల్సిందే. పొదుపు జీవితంలో ఊహించని ఖర్చుల నుంచి కాపాడుతుంది. తగిన మొత్తం చేతిలో ఉంటే.. ఆకస్మికంగా ఏదైనా అవసరం వస్తే.. మీ దీర్ఘకాలిక లక్ష్యాల కోసం కూడబెట్టిన మొత్తం నుంచి డబ్బును తీయక్కర్లేదు. వ్యక్తిగత రుణాలు, క్రెడిట్‌ కార్డులపై ఆధారపడాల్సిన అవసరమూ తప్పుతుంది. చాలామంది వ్యయాలను ఎలా నిర్వహించాలో తెలియకే ఆర్థికంగా చిక్కుల్లో పడుతుంటారు. సాధారణ నియమంగా మీ మూడు నెలల స్థూల వేతనం మీ పొదుపు ఖాతాలో ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ఉద్యోగాన్ని కోల్పోయినప్పుడు.. అత్యవసరంగా కారు లేదా ఇంటి మరమ్మతు చేయడానికి ఇది అవసరం పడొచ్చు. ఏదైనా ప్రమాదం, అనారోగ్యం వంటి సందర్భాల్లోనూ ఈ డబ్బు మీకు భరోసానిస్తుంది.

రుణాలతో జాగ్రత్త..
ఎలాంటి హామీ అవసరం లేని స్వల్పకాలిక రుణాలు మీ పొదుపు శక్తిని హరిస్తాయి. వీటికి చెల్లించే వడ్డీ అధికంగా ఉండటమే దీనికి కారణం. బ్యాంకులు క్రెడిట్‌ కార్డుల పరిమితిని పెంచడం, ముందుగా ఆమోదించిన రుణాలను అందించడం ద్వారా మీరు డబ్బును ఖర్చు చేసేలా ప్రోత్సహిస్తాయి. క్రెడిట్‌ కార్డులు, వ్యక్తిగత రుణాలను బాధ్యతాయుతంగా తీసుకోవాలి. లేకపోతే జీతంలో అధిక భాగం వీటి వాయిదాలు చెల్లించేందుకే వెళ్తుంది. మీ జీవన వ్యయాలు, పొదుపు కోసం డబ్బు మిగలదు. పైగా వాయిదాలను సకాలంలో చెల్లించకపోతే. అదనపు వడ్డీ, జరిమానాలకు దారితీస్తుంది. మీ క్రెడిట్‌ స్కోరూ దెబ్బతింటుంది. అందువల్ల హామీ లేని రుణాలను వీలైనంత తక్కువగా తీసుకునే ప్రయత్నం చేయాలి. ఆదాయానికి మంచి అప్పు ఉండటం ఎప్పుడూ మంచిది కాదు. మీ నెలవారీ ఆదాయంలో వాయిదాల చెల్లింపులు 20-35 శాతం లోపే ఉండేలా చూసుకోండి.

ప్రశాంతంగా సాగాలంటే..
పదవీ విరమణ చేసిన తర్వాత నెలవారీ ఖర్చులకు కొంత ఆదాయం ఉండాలి. మీరు ఉద్యోగంలో ఉన్నప్పుడు సంపాదించిన మొత్తంలో అది కనీసం 75 శాతం వరకూ ఉంటేనే మలి జీవితం ప్రశాంతంగా సాగుతుంది. ఆర్జించే సమయంలోనే ఇందుకు తగ్గ ఏర్పాటు చేసుకోవాలి. దీనికోసం వైవిధ్యమైన పెట్టుబడి పథకాల్లో మదుపు చేయాలి. లేకపోతే.. పదవీ విరమణ అనంతరం ఆర్థికంగా చిక్కులు తప్పకపోవచ్చు. ఏ పథకాల్లో మదుపు చేస్తారన్నది మీ వయసు, ఆర్థిక స్థితిగతులను బట్టి నిర్ణయించుకోవాలి. అవసరమైతే నిపుణుల సలహాలు స్వీకరించాలి. కూడబెట్టిన నిధి మీ జీవితాంతం వరకూ క్రమం తప్పకుండా ఆదాయాన్నిచ్చే మార్గాల్లో పెట్టుబడి పెట్టాలి. మలి వయసులో ఆరోగ్యాన్ని కాపాడుకున్నప్పుడే.. ఆర్థికంగా ఇబ్బందులు ఉండవని గుర్తుంచుకోవాలి.

ధీమాగా ఉంటేనే..
ఊహించని సంఘటనలు జరిగినప్పుడు కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించేది బీమా పాలసీలు. జీవిత, ఆరోగ్య, వాహన, గృహ, వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీలు తప్పనిసరిగా ఉండాల్సిందే. భారతీయుల్లో కేవలం 5శాతం మందే వివిధ జీవిత బీమా పాలసీల రక్షణలో ఉన్నారు. అందులోనూ ఆదాయానికి తగ్గ పూర్తి స్థాయి బీమా చేసుకున్న వారి సంఖ్య తక్కువే. ఒక వ్యక్తి తన వయసు, ఆర్థిక బాధ్యతలు, ఆదాయం, జీవిత లక్ష్యాలు మొదలైన అంశాల ఆధారంగా బీమా మొత్తాన్ని నిర్ణయించుకోవాలి. నిపుణుల సూచనల ప్రకారం వార్షికాదాయానికి 10 నుంచి 15 రెట్ల వరకూ బీమా కవరేజీని తీసుకోవడం మంచిది. ఉదాహరణకు ఒక వ్యక్తి వార్షికాదాయం రూ.5లక్షలు ఉంటే.. అతను కనీసం రూ.50లక్షల నుంచి రూ.75 లక్షల వరకూ బీమా పాలసీ తీసుకోవాలి. అప్పులు ఉన్నప్పుడు ఈ మొత్తం ఆ మేరకు పెంచుకోవాలి.

- అర్చిత్‌ గుప్తా, సీఈఓ, క్లియర్‌

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.