ETV Bharat / business

భారత్​లో 'టాటా ఐఫోన్'లు తయారీ.. విస్ట్రాన్‌ యూనిట్‌ కొనుగోలు చేసేందుకు సిద్ధం!

author img

By

Published : Jan 11, 2023, 6:29 AM IST

tata group iphone
tata group iphone

యాపిల్‌ ఐఫోన్‌ను దేశీయంగా టాటాలు తయారు చేసేందుకు అవసరమైన ప్రక్రియ మరింత వేగవంతమైంది. తైవాన్‌ సంస్థ విస్ట్రాన్‌, బెంగళూరులో నిర్వహిస్తున్న ఐఫోన్‌ తయారీ కేంద్రాన్ని స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది టాటా గ్రూప్‌.

యాపిల్‌ ఐఫోన్‌ను దేశీయంగా టాటాలు తయారు చేసేందుకు అవసరమైన ప్రక్రియ మరింత వేగవంతమైంది. తైవాన్‌ సంస్థ విస్ట్రాన్‌, బెంగళూరులో నిర్వహిస్తున్న ఐఫోన్‌ తయారీ కేంద్రాన్ని స్వాధీనం చేసుకునే దిశగా టాటా గ్రూప్‌ అడుగులు వేస్తోంది. దేశీయంగా ఐఫోన్లు ఇప్పటికే తయారవుతున్నా, తైవాన్‌ సంస్థలైన ఫాక్స్‌కాన్‌, విస్ట్రాన్‌, పెగాట్రాన్‌లు నేతృత్వం వహిస్తున్నాయి. దేశీయ దిగ్గజమైన టాటా గ్రూప్‌ తొలిసారిగా ఐఫోన్‌ తయారీ చేపట్టేందుకు విస్ట్రాన్‌ యూనిట్‌ను కొనుగోలు చేయనుంది. ఈ తయారీ కేంద్రంలో మెజార్టీ వాటా దక్కించుకునేందుకు టాటా గ్రూప్‌ ప్రయత్నిస్తోందని, మార్చి 31 నాటికి ఈ ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఈ ఒప్పందం ఖరారైతే ఐఫోన్ల తయారీని టాటా ఎలక్ట్రానిక్స్‌ చేపడుతుంది. ఇందువల్ల ప్రభుత్వ ప్రోత్సాహకాలనూ టాటా గ్రూప్‌ వినియోగించుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్‌ తయారీలో చైనాకు పోటీ ఇవ్వాలన్న మన ప్రభుత్వ ప్రణాళికలకు, టాటా గ్రూప్‌ ప్రయత్నాలు దన్నుగా నిలవనున్నాయి.
కంపెనీ ఆదాయాన్ని పెంచుకోవడం కోసం, సర్వర్ల తయారీ వంటి ఇతర విభాగాలకూ విస్తరించే యోచనలో ఉన్న విస్ట్రాన్‌, బెంగళూరుకు 50 కిలోమీటర్ల ఉన్న ఐఫోన్‌ తయారీ కేంద్రాన్ని విక్రయించాలని భావిస్తోందని సమాచారం. ఈ యూనిట్‌లో ఐఫోన్‌ తయారీ లైన్లు 8 ఉన్నాయి. 10,000 మంది సిబ్బంది కూడా టాటా గ్రూప్‌ కిందకు వెళ్లే వీలుంది.

ఐఫోన్‌ విడిభాగాల్లో కొన్నింటిని ఇప్పటికే హోసూర్‌ ప్లాంటులో టాటా గ్రూప్‌ తయారు చేస్తోంది. ఇటీవలే అక్కడ భారీగా నియామకాలు చేపట్టింది. వందల ఎకరాల్లో విస్తరించిన ఆ ప్లాంట్‌లోనే ఐఫోన్‌ తయారీ లైన్లనూ జత చేయాలని టాటా గ్రూప్‌ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా యాపిల్‌ స్టోర్లనూ ప్రారంభించనున్నట్లు టాటా గ్రూప్‌ ఇప్పటికే ప్రకటించింది. ఈ త్రైమాసికంలోనే ముంబయిలో తొలి స్టోర్‌ తెరవనున్నట్లు తెలిపింది. యాపిల్‌తో సంబంధాలను టాటా మరింత పటిష్ఠం చేసుకుంటోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.