ETV Bharat / business

కుప్పకూలిన స్టాక్​మార్కెట్లు.. సెన్సెక్స్​ 1400 మైనస్​.. మరి ఎల్​ఐసీ సంగతేంటి?

author img

By

Published : May 19, 2022, 9:25 AM IST

Updated : May 19, 2022, 3:46 PM IST

stock market news
కుప్పకూలిన స్టాక్​ మార్కెట్లు

15:35 May 19

మార్కెట్లపై బేర్​ పంజా.. సెన్సెక్స్​ 1400 మైనస్​

ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెంపు భయాలు దేశీయ స్టాక్​ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, కీలక రంగాల షేర్లు నష్టాల్లోకి జారుకోవటం వల్ల సూచీలు కుప్పకూలాయి. సెన్సెక్స్​ ఏకంగా 1400 పాయింట్లకుపైగా పతనమైంది. నిఫ్టీ కూడా 400 పాయింట్లకుపైగా కోల్పోయి.. 15,900 దిగువకు చేరింది.

  • బొంబాయి స్టాక్​ ఎక్చ్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 1416 పాయింట్ల నష్టంతో 52,792 వద్ద ముగిసింది
  • జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 431 పాయింట్లు పతనమై 15,809 వద్ద స్థిరపడింది.

లాభనష్టాల్లోనివి..
ప్రతికూల పరిస్థితుల్లోనే ఐటీసీ, డాక్టర్​ రెడ్డీస్​ ల్యాబ్స్​, పవర్​ గ్రిడ్​ షేర్లు లాభాలు ఆర్జించాయి. మరోవైపు.. విప్రో, హెచ్​సీఎల్​ టెక్​, ఇన్ఫోసిస్​, టీసీఎస్​, టెక్​ మహీంద్రా షేర్లు దాదాపు 5 శాతానికిపైగా నష్టాలను మూటగట్టుకున్నాయి. ఇటీవలే భారీ అంచనాలతో మార్కెట్లోకి లిస్ట్​ అయిన లైఫ్​ ఇన్సూరెన్స్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా(ఎల్​ఐసీ) షేరు.. గురువారం 4 శాతానికిపైగా(36.15) పతనమై.. 840.20కి చేరింది. ఎన్​ఎస్​ఈలో ఎల్​ఐసీ షేరు మే 17న.. ఇష్యూ ధర రూ.949తో పోలిస్తే 8.11 శాతం రాయితీతో రూ.872 వద్ద లిస్టయ్యింది. ఒడుదొడుకుల అనంతరం.. నష్టాలు నమోదుచేసింది.

మార్కెట్ల పతనానికి కారణాలేంటి?
బలహీనంగా ప్రపంచ మార్కెట్లు: గత రెండేళ్లలో ఎన్నడూ లేనంత పతనాన్ని నిన్న అమెరికా మార్కెట్లు చవిచూడటం భారత్‌ సూచీల కుంగుబాటుకు ఆజ్యం పోసింది. అమెరికా మార్కెట్లలో కూడా మాంద్యం భయాలు నెలకొన్నాయి. అక్కడ ద్రవ్య పరపతి విధానాన్ని మరింత కఠినతరం చేయనున్నారనే ప్రచారం.. వాల్‌స్ట్రీట్‌లో గుబులు రేపుతోంది. నిన్నటి ట్రేడింగ్‌లో డోజోన్స్‌ 3.2 శాతం పడిపోగా.. ఎస్‌అండ్‌పీ 500 సూచీ 3.6శాతం విలువ కోల్పోయింది. నాస్‌డాక్‌ కాపోజిట్‌ 4.3శాతం పతనమైంది. అమెరికా రిటైల్‌ దిగ్గజం టార్గెట్‌ షేర్లు 25శాతం పతనమయ్యాయి. 1987 అక్టోబర్‌ తర్వాత ఈ స్థాయిలో దాని షేర్లు ఎన్నడూ పడిపోలేదు.

40 ఏళ్లలో ఎన్నడూ లేని ధరలు: అమెరికాలో వినిమయ వస్తువుల ధరలు 8.2శాతం పెరిగాయి. గత 40 ఏళ్లలో ఈ స్థాయిలో అక్కడ ఏనాడూ ధరలు పెరగలేదు. దీంతో ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపును నమ్ముకొంది. ఫెడ్‌ చీఫ్‌ జెరోమ్‌ పావెల్‌ కూడా వడ్డీరేట్ల పెంపు కొనసాగుతుందని వెల్లడించారు. జూన్‌14-15 తేదీల్లో ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ భేటీ కానుంది. అమెరికాలో నిరుద్యోగం రేటు ఏప్రిల్‌ నెలలో 3.6శాతంగా నిలిచింది. కొవిడ్‌ వ్యాప్తికి ముందున్న 3.5శాతం కంటే ఇది కొంచెం ఎక్కువ. నిరుద్యోగుల సంఖ్య 10లక్షలను దాటేసింది.

వడ్డీరేట్లపై ఆర్‌బీఐ దృష్టి: ప్రపంచ సెంట్రల్‌ బ్యాంకుల వలే ఆర్‌బీఐ కూడా వడ్డీ రేట్లపెంపుపై దృష్టి సారించింది. మే4వ తేదీన ఆర్‌బీఐ భేటీలో ద్రవ్యోల్బణం కట్టడికి వడ్డీరేట్ల పెంపును ఆయుధంగా వాడటంపై చర్చ జరిగింది. దీంతో భవిష్యత్తులోనూ వడ్డీ రేట్లు పెరుగుతాయని భావిస్తున్నారు.

భగభగలాడుతున్న చమురు ధరలు: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఏడు వారాల్లో అత్యధికంగా బ్రెంట్‌ క్రూడ్‌ పీపా ధర 110 డాలర్లకు చేరింది. చాలా దేశాలు రష్యా చమురుపై నిషేధం విధించడం వల్ల ఏర్పడిన కొరత కూడా ఈ ధరల పెరుగుదలకు ఆజ్యం పోసింది. దీనికి తోడు చైనాలో 11శాతం తక్కువగా క్రూడ్‌ ప్రాసెస్‌ చేయడం సరఫరాలపై ఒత్తిడి పెంచుతోంది.

09:21 May 19

మార్కెట్లపై బేర్​ పంజా.. సెన్సెక్స్​ 1400, నిఫ్టీ 430 మైనస్​

స్టాక్​ మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్​ 1,105 పాయింట్లు కుప్పకూలి 53,102కి పడిపోయింది. నిఫ్టీ 314 పాయింట్లు క్షీణించి 15,926 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఐటీసీ, ఐచర్​ మోటార్స్​ ​ షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. హిండాల్కో టెక్​ మహీంద్రా, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్​సర్వ్ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి.

Last Updated :May 19, 2022, 3:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.