ETV Bharat / business

సిప్‌ చేస్తున్నారా?.. ఈ టాపప్​తో మరిన్ని లాభాలు మీ సొంతం!

author img

By

Published : Dec 5, 2022, 1:04 PM IST

ఒక ఆర్థిక లక్ష్యాన్ని సాధించేందుకు నిర్ణీత మొత్తాన్ని క్రమానుగతంగా మదుపు చేయాలి. దీనికి మ్యూచువల్‌ ఫండ్లలో ఉత్తమమైన మార్గంగా సిప్‌ (సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌)ను చెప్పుకోవచ్చు. చాలామంది ఒకసారి నిర్ణయించుకున్న మొత్తాన్నే దీర్ఘకాలం కొనసాగిస్తూ ఉంటారు. ఆదాయం పెరిగినా పెట్టుబడులను ఆ మేరకు పెంచుకోరు. దీనివల్ల భవిష్యత్తులో ఎదురయ్యే ఖర్చులను తట్టుకోవడం అన్ని వేళలా సాధ్యం  కాకపోవచ్చు. అందుకే, పెట్టుబడులను వీలును బట్టి, కొంత శాతం పెంచుకునే ప్రయత్నం చేయాలి. దీన్నే టాపప్‌ అని చెప్పొచ్చు.

sip top up details
sip top up details

'లగ్జరీ కారును కొనడం కన్నా.. ఫండ్లలో సిప్‌ చేసేందుకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని’ ఇటీవల ఒక ప్రముఖ కార్ల కంపెనీ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. 'సిప్‌' బలం అలాంటిది. దీర్ఘకాలంలో మంచి ప్రతిఫలాన్ని అందించే ఈ సిప్‌ను మరింత శక్తిమంతం చేయాలంటే.. దీన్ని క్రమం తప్పకుండా పెంచుతూ వెళ్లాలి అని నిపుణులు చెబుతున్నారు. అప్పుడే లగ్జరీ కారు, సొంతిల్లు.. విదేశీ విహారాలు.. ఏదైనా సరే ఇట్టే సాధించొచ్చు అంటున్నారు. 'విలువ తరిగే ఆస్తులను కొనుగోలు చేసేందుకు అప్పులు తీసుకునే బదులు.. చిన్న మొత్తాలతో క్రమంగా మదుపు చేసి, చక్రవడ్డీ ప్రభావంతో దాన్ని వృద్ధి చేసి, అప్పుడు అవసరమైనవి కొనాలి. పొదుపు చేసే మనస్తత్వం మనలో ఉంది' అని జరోధా సహ వ్యవస్థాపకుడు నితిన్‌ కామత్‌ తెలిపారు.

మీరు సిప్‌ ఖాతాను ప్రారంభించేటప్పుడే నిర్ణీత వ్యవధి తర్వాత ఎంత శాతం పెరగాలో చెప్పొచ్చు. లేదా మీరు పెట్టుబడిని పెంచుకోవాలనుకున్న ప్రతిసారీ కొత్త సిప్‌ ఖాతాను ప్రారంభించవచ్చు. ఇక్కడ గమనించాల్సింది.. మీ పెట్టుబడిని నిర్ణీత శాతం చొప్పున పెంచుకుంటూ వెళ్లడం. అది ఎలా అన్నది మీ ఇష్టమే.

ఉదాహరణకు ఒక వ్యక్తి ఈ నెల 10 నుంచి రూ.5,000 సిప్‌ ప్రారంభించాడనుకుందాం. ప్రతి ఆరు నెలలకోసారి 10శాతం, లేదా ఏడాదికోసారి 20 శాతం టాపప్‌ చేసుకునేలా ప్రణాళిక ఉండాలి. సంపాదన ప్రారంభించిన దగ్గర్నుంచి, పదవీ విరమణ వరకూ ఈ వ్యూహాన్ని పాటించాలి. ప్రతి లక్ష్యానికీ వేర్వేరుగా క్రమానుగత పెట్టుబడులు ఉండేలా చూసుకోవడం ఇంకా ఉత్తమం.

టాపప్‌ సిప్‌ వల్ల ద్రవ్యోల్బణాన్ని అధిగమించేలా రాబడులను ఆర్జించేందుకు అవకాశం ఉంటుంది. కొన్ని మ్యూచువల్‌ ఫండ్లు ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేసుకుంటూ టాపప్‌ చేసుకునే వెసులుబాటును కల్పిస్తున్నాయి. ఇలాంటి వాటినీ పరిశీలించవచ్చు. వేతనం పెరిగినప్పుడల్లా మీ ఖర్చులను పెంచుకోకుండా అందులో సగం శాతాన్ని పెట్టుబడులకు మళ్లించడం వల్ల మంచి ఫలితాలుంటాయి. భవిష్యత్తులో జీవనశైలి విషయంలో రాజీ పడకుండా ఇది ఆదుకుంటుంది.

ఇవీ చదవండి : పిల్లల భవితకు భరోసా.. ఉన్నత విద్య కోసం ప్లాన్ చేయండిలా..

మూడేళ్లకు ఒకసారే ప్రీమియం! లాంగ్​టెర్మ్​ హెల్త్ ఇన్సూరెన్స్​ పాలసీ గురించి తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.