ETV Bharat / business

సులభతర వాణిజ్యం ర్యాంకింగ్స్​లో తెలుగు రాష్ట్రాలు టాప్!

author img

By

Published : Jun 30, 2022, 12:13 PM IST

Updated : Jul 1, 2022, 6:35 AM IST

telugu states
సులభతర వాణిజ్యం

12:07 June 30

టాప్​-7లో తెలుగు రాష్ట్రాలు

కేంద్ర పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం నిర్దేశించిన వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక అమలులో ఏడు రాష్ట్రాలు 90%కి పైగా మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచాయి. వాటిలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా గుజరాత్‌, హరియాణా, కర్ణాటక, పంజాబ్‌, తమిళనాడు ఉన్నాయి. ఇదివరకు వరల్డ్‌ బ్యాంక్‌ చేయూతతో సులభతర వాణిజ్యం పేరుతో ర్యాంకులు ప్రకటిస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక అమలు పేరుతో రాష్ట్రాల పనితీరును మదింపుచేసి ‘బిజినెస్‌ రీఫామ్స్‌ యాక్షన్‌ ప్లాన్‌ 2020’ పేరుతో నివేదిక రూపొందించింది. దాని ప్రతిని గురువారం ఇక్కడ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌, వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌లు విడుదల చేశారు. ఐదు మినహా మిగిలిన 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పనితీరును వెల్లడించారు.

అక్షర క్రమంలో పేర్లు
ఈసారి ర్యాంకులవారీగా కాకుండా టాప్‌ అచీవర్స్‌ (90%కి పైగా), అచీవర్స్‌ (80-90%), యాస్పైరర్స్‌ (50-80%), ఎమర్జింగ్‌ బిజినెస్‌ ఎకోసిస్టమ్స్‌ (50% లోపు) పేరుతో గ్రూపులవారీగా లెక్కించారు. రాష్ట్రాల పేర్లను అక్షరక్రమంలో ప్రకటించారు తప్పితే అవి సాధించిన స్కోర్‌ ఆధారంగా కాదు. 15 విభాగాలకు సంబంధించి 301 సంస్కరణల ఆధారంగా ఈసారి రాష్ట్రాల పనితీరును లెక్కగట్టారు. ఇందులో 118 కొత్త సంస్కరణలున్నాయి. తొలిసారి టెలికాం, సినిమా షూటింగ్‌, టూరిజం, అగ్నిమాపకదళ నిరభ్యంతర పత్రాల జారీ, వైద్య ఆరోగ్యరంగానికి సంబంధించిన సంస్కరణలను ప్రవేశపెట్టారు. ప్రభుత్వ సేవలు అందించేందుకు సింగిల్‌ విండో విధానం అమలు, నేషనల్‌ సింగిల్‌ విండో విధానంతో అనుసంధానం కావడం, కంప్యూటరైజ్డ్‌ సెంట్రల్‌ ర్యాండం ఇన్‌స్పెక్షన్‌ సిస్టం, నిర్మాణ అనుమతుల కోసం సమీకృత దరఖాస్తు ప్రక్రియ అమలు, నీరు, విద్యుత్తు, గ్యాస్‌ కనెక్షన్‌ లాంటి వాటి జారీ ప్రక్రియను సులభతరం చేయడం, పెట్టుబడులకు అనువుగా ప్లగ్‌ అండ్‌ ప్లే విధానం అమలు వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని రాష్ట్రాల పనితీరును లెక్కించారు.

2020లో అన్ని రాష్ట్రాలూ, కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి మొత్తంగా 7,496 సంస్కరణలు అమలు చేయడం వల్ల దేశంలో వాణిజ్య నిర్వహణ మరింత సులభతరం అయిందని కేంద్ర వాణిజ్యశాఖ పేర్కొంది. 2019లో ఈ సంఖ్య 4,301కే పరిమితమైనట్లు తెలిపింది. ఈ సందర్భంగా డీపీఐఐటీ కార్యదర్శి అనురాగ్‌ జైన్‌ మాట్లాడుతూ సంస్కరణల అమలులో రాష్ట్రాలు సాధించిన మార్కుల మధ్య అత్యంత స్వల్పమైన తేడా ఉందని, అందువల్ల వాటిని ర్యాంకులవారీగా విభజించడం విజ్ఞత కాదని భావించి విభాగాలవారీగా విభజించినట్లు పేర్కొన్నారు. వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ మాట్లాడుతూ ఇదివరకు కేవలం సాక్ష్యాధారాల ఆధారంగా మాత్రమే రాష్ట్రాల పనితీరును లెక్కించేవారమని, ఇప్పుడు 100% ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా ఆ పని చేశామని ప్రకటించారు. ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ మాట్లాడుతూ భారత్‌లో 1991 నుంచి సంస్కరణలు ప్రారంభమయ్యాయని, అయితే అప్పటికీ ఇప్పటికీ వాటి అమలులో మార్పు వచ్చిందన్నారు. ఇప్పుడు వ్యవస్థను మెరుగుపరిచి, జీవన ప్రమాణాలను మార్చేందుకు సంస్కరణలను అమలుచేస్తున్నట్లు చెప్పారు.

వివిధ గ్రూపుల్లో నిలిచిన రాష్ట్రాలు (అక్షర క్రమంలో)

టాప్‌ అచీవర్స్‌ (7): ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, హరియాణా, కర్ణాటక, పంజాబ్‌, తమిళనాడు, తెలంగాణ
అచీవర్స్‌ (6): హిమాచల్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరాఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌
యాస్పైరర్స్‌ (7): అస్సాం, ఛత్తీస్‌గఢ్‌, గోవా, ఝార్ఖండ్‌, కేరళ, రాజస్థాన్‌, పశ్చిమబెంగాల్‌
ఎమర్జింగ్‌ బిజినెస్‌ ఎకోసిస్టం (11): అండమాన్‌ నికోబార్‌, బిహార్‌, చండీగఢ్‌, దమణ్‌ దీవ్‌, దాద్రానగర్‌ హవేలీ, దిల్లీ, జమ్మూ కశ్మీర్‌, మణిపుర్‌, మేఘాలయ, నాగాలాండ్‌, పుదుచ్చేరి, త్రిపుర.

  • యూజర్‌ డేటా తగినంత లేనందువల్ల సిక్కిం, మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్‌, లక్షద్వీప్‌, లద్దాఖ్‌ల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకోలేదు.
.

ఇదీ చూడండి : ముడి చమురు విక్రయంలో ఆ సంస్థలకు స్వేచ్ఛ!

Last Updated :Jul 1, 2022, 6:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.