ETV Bharat / business

హోమ్​ లోన్​ తీసుకుంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

author img

By

Published : Jul 14, 2023, 11:30 AM IST

Precautions For Home loan : సొంతిల్లు.. చాలామంది ఆర్థిక లక్ష్యాల్లో ఇది చాలా ముఖ్యమైనది. కేవలం పెట్టుబడి, పొదుపు చేసుకున్న సొమ్ముతోనే ఇల్లు కొనడం అందరికీ సాధ్యమయ్యే పనికాదు. అందుకోసమే ఎంతోమంది తమ సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు గృహ రుణాన్ని తీసుకుంటారు. మీరూ త్వరలోనే ఒక సొంతింటి వారు కావాలని ఆశిస్తున్నారా? ఇంటి రుణం తీసుకునే ఆలోచనతో ఉన్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి.

precautions while taking home loan
precautions while taking home loan

Precautions For Home loan : ప్రస్తుతం మార్కెట్లో ఇళ్ల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. వడ్డీ రేట్లు కూడా స్థిరీకరణ దశలో ఉన్నాయి. గృహరుణం దీర్ఘకాలిక ఒప్పందం. కేవలం మిగులు మొత్తం చేతిలో కనిపిస్తుంది కాబట్టి.. రుణం తీసుకొని, ఇల్లు కొనొచ్చు అనుకుంటే సరిపోదు. ఇందుకోసం పరిశీలించాల్సిన ఇతర అంశాలు చాలా ఉంటాయి. అందులో కీలకమైనవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎంత పొదుపు చేస్తారు?
అప్పు అర్హత నిర్ణయించడంలో మీ ఆదాయం ఎంత అనేది ప్రధానం. ఇందులోనూ ఖర్చులు పోను ఎంత మిగులుతోంది అన్నదానిని ప్రధానంగా లెక్కిస్తారు. సాధారణంగా రుణదాతలకు సంబంధించిన ఆరు నెలల బ్యాంకు ఖాతా వివరాలను చెక్ చేస్తారు. మీ ఆదాయం, ఖర్చులు, మిగులు తదితర అంశాలను పూర్తిగా తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. మీకు వచ్చిన ఆదాయంలో కనీసం 30 శాతం వరకూ మిగులు కనిపిస్తే, ఆర్థిక క్రమశిక్షణ ఉన్న వ్యక్తిగా బ్యాంకులు గుర్తిస్తాయి. ఒకవేళ మీరున్న పరిస్థితుల్లో మీ దగ్గర 30-40 శాతం మిగులు లేకపోతే.. ఇంటి కొనుగోలు నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడమే మంచిది. పొదుపు ఎక్కువగా ఉన్న సమయంలోనే అప్పు తీసుకునే ప్రయత్నం చేయండి.

చేతిలో ఎంత డబ్బుంది?
ఇల్లు కొనాలంటే.. ముందుగా వినియోగదారుడు తన చేతి నుంచి కొంత మొత్తాన్ని చెల్లించాలి. బ్యాంకింగ్‌ పరిభాషలో చెప్పాలంటే దీన్ని డౌన్‌పేమెంట్‌గా పిలుస్తారు. ఆస్తి విలువలో సాధారణంగా 10-20 శాతం వరకూ దీనిని చెల్లించాలి. ఆ తర్వాత మిగతా మొత్తాన్ని అర్హతను బట్టి, బ్యాంకులు రుణం అందిస్తాయి. బ్యాంకులను బట్టి, డౌన్‌పేమెంట్‌ శాతం మారుతుంది. ఉదాహరణకు మీరు రూ.30 లక్షల ఇల్లు కొనాలని అనుకుందాం. డౌన్‌పేమెంట్‌ కనీసం 20శాతం అనుకుంటే.. మీరు రూ.6 లక్షలు సొంతంగా కట్టాలి. ఈ మొత్తం ఎంత ఎక్కువగా చెల్లిస్తే అంత మంచిది. దీనివల్ల రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు. దీంతోపాటు స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ లాంటి ఇతర ఖర్చులనూ లెక్కలోకి తీసుకోవాలి. అన్ని విధాలా మీరు సిద్ధం అనుకున్న సమయంలో రుణం కోసం దరఖాస్తు చేయండి.

వాయిదాలు చెల్లించగలరా?
ప్రస్తుతం మార్కెట్లో గృహ రుణం వడ్డీ రేట్లు 8.5% నుంచి 8.75 శాతం వరకు ఉన్నాయి. రూ.25 లక్షల రుణాన్ని 20 ఏళ్ల వ్యవధికి తీసుకుంటే.. రూ.22,000 వరకు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఏదో ఒక నెల మాత్రమే ఈ మొత్తాన్ని చెల్లించడం కాదు. దాదాపు 240 నెలలు, వడ్డీ రేట్లు పెరిగితే అంతకు మించి క్రమం తప్పకుండా ఈఎంఐ చెల్లిస్తూ ఉండాలి. కాబట్టి, నెలవారీ ఆదాయం, ఖర్చులు ఎలా ఉన్నా వాయిదాల చెల్లింపు ఆగకుండా కట్టాలి. మీ ఖర్చులు, జీవన ప్రమాణాలకు ఇబ్బంది లేకుండా వాయిదాలను చెల్లిస్తామన్న నమ్మకం కలిగినపుడే ముందడుగు వేయాలి. కనీసం 3-5 ఏళ్ల వరకు ఆర్థిక విషయాల్లో కొంత రాజీ పడక తప్పదనే విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.

ఆదాయం పెరుగుతుందా?
రుణానికి దరఖాస్తు చేసుకోబోయే ముందు గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం.. మీ ఆదాయం త్వరలోనే పెరుగుతుందా అన్నది. ఒకవేళ అలాంటి అవకాశం ఉంటే, వాయిదాలు చెల్లించేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదే సమయంలో మీ వద్ద పెరిగిన మిగులు మొత్తంలో కొంత గృహరుణ అసలుకు చెల్లించండి. ఇలా క్రమం తప్పకుండా జమ చేయడం వల్ల వ్యవధి తగ్గడమే కాకుండా వడ్డీ భారమూ అధికంగా పడదు.

ఉమ్మడిగా తీసుకుంటారా?
Home Loan Tax Benefit : జీవిత భాగస్వామితో కలిసి ఉమ్మడిగా రుణం తీసుకుంటే కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. ఇలా చేస్తే రుణం అధికంగా వస్తుంది. అదే సమయంలో ఈఎంఐ భారం ఇద్దరూ పంచుకోవచ్చు. సెక్షన్‌ 80సీ, సెక్షన్‌ 24 నిబంధనల ప్రకారం ఇద్దరూ గృహరుణం అసలు, వడ్డీపై మినహాయింపును క్లెయిం చేసుకునే అవకాశం ఉంది. మిగులు మొత్తం ఎక్కువగా ఉంటే అప్పుడప్పుడు కొంత మొత్తం చెల్లిస్తూ తొందరగా రుణం తీర్చే అవకాశం ఉంటుంది.

క్రెడిట్‌ స్కోరు బాగుందా?
Home loan Credit Score Minimum : కొత్తగా రుణం తీసుకోవాలనుకునే వారు ముందుగా తమ క్రెడిట్‌ స్కోరును సొంతంగా చెక్ చేసుకోవాలి. 700 పాయింట్లకు మించి ఉన్నప్పుడు మాత్రమే రుణదాతలు కొంత సానుకూలంగా ఉంటారు. తక్కువ క్రెడిట్‌ స్కోరుంటే రుణ దరఖాస్తును తిరస్కరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అధిక స్కోరున్న సమయంలో వడ్డీ రేటులోనూ కొంత రాయితీ లభిస్తుంది. కాబట్టి, స్కోరును పరిశీలించి, ఏమైనా తేడాలుంటే సరిచేసుకోండి.

ఇంటి రుణం తీసుకునేటప్పుడు ఆర్థికంగా ఎంత స్థిరంగా ఉన్నారన్న విషయం ఎప్పటికప్పుడు చూసుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక క్రమశిక్షణతో ఉన్నప్పుడే ఇబ్బందులు లేకుండా చూసుకోగలుగుతాం. చిన్న పొరపాటు చేసినా, మీ ఇతర లక్ష్యాలను చేరుకోవడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మీ ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకోవాలి. వృథా వ్యయాలను నియంత్రించుకోవాలి. వీలైనంత తొందరగా అప్పు తీర్చాలన్న లక్ష్యం విధించుకోవాలి.
--అధిల్‌ శెట్టి, సీఈఓ, బ్యాంక్‌బజార్‌

ఇవీ చదవండి : 40 ఏళ్లలోపే 'సొంతింటి' కలను నెరవేర్చుకోవడమెలా?

హోమ్ లోన్ ఇప్పుడే తీసుకోవాలా? వడ్డీ రేట్లు తగ్గుతాయా? అలా చేస్తే నష్టమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.