ETV Bharat / business

అంతర్జాతీయంగా పెట్రో ధరలు తగ్గినా మనకు మాత్రం ఊరట లేనట్టే

author img

By

Published : Aug 18, 2022, 5:52 PM IST

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర 6 నెలల కనిష్ఠానికి దిగివచ్చింది. ఐతే ఇప్పుడప్పుడే ఆ ప్రయోజనం దేశీయ వినియోగదారులకు అందేలా లేదు. ఇన్నాళ్లూ నష్టాలు భరించి పెట్రోల్‌, డీజిల్‌ను విక్రయిస్తూ వచ్చిన దేశీయ చమురు సంస్థలు ఆ నష్టాలను పూడ్చుకోనున్నాయి. అందుకు మరికొన్ని రోజులు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా కొనసాగే అవకాశం ఉంది.

petrol price decrease in india
అంతర్జాతీయంగా పెట్రో ధరలు తగ్గినా మనకు మాత్రం ఊరట కష్టమే

Petrol price decrease in India : అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర 6 నెలల కనిష్ఠస్థాయికి చేరింది. మార్చి నెలలో బ్యారెల్‌ ముడిచమురు ధర 140 డాలర్లకు ఎగబాకగా ఇప్పుడు 94.91 డాలర్లకు దిగివచ్చింది. ఇలా రేట్లు తగ్గడం భారత్‌కు ఊరటనిచ్చే అంశం. ఎందుకంటే మన దేశం 85 శాతం ముడిచమురును దిగుమతి చేసుకుంటోంది. ఐతే అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర తగ్గినా దేశీయంగా వాటి ధర ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు. గత కొంతకాలంగా నష్టాలను భరిస్తూ దేశీయ చమురు సంస్థలు పెట్రోల్‌, డీజిల్‌ను అమ్ముతుండటమే అందుకు కారణం. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర తగ్గడం వల్ల పెట్రోల్‌పై నష్టాలు పూర్తిగా తగ్గాయని, ఐతే డీజిల్‌ను మాత్రం ఇంకా నష్టాన్ని భరించే అమ్మాల్సి వస్తోందని చమురు సంస్థలు తెలిపాయి.

సాధారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరల ఆధారంగా దేశీయ చమురు సంస్థలు పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో రోజువారీ మార్పులు చేస్తూ విక్రయించేవి. పెరిగిన ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు గత నాలుగున్నర నెలలుగా కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా కొనసాగాయి. ఒక దశలో చమురు సంస్థలు లీటర్‌ డీజిల్‌పై 20 నుంచి 25 రూపాయల నష్టంతో, పెట్రోల్‌పై 14 నుంచి 18 రూపాయల నష్టంతో అమ్మాల్సి వచ్చింది. ప్రస్తుతం చమురు ధరలు దిగి రాగా ఈ నష్టాలు తగ్గాయి. ప్రస్తుతం పెట్రోల్‌పై ఎలాంటి నష్టం రావడం లేదని ఐతే లీటర్‌ డీజిల్‌పై మాత్రం ఇంకా 4 నుంచి 5 రూపాయల నష్టంతోనే అమ్మాల్సి వస్తోందని దేశీయ చమురు సంస్థలు చెబుతున్నాయి. అందుకే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గినా ఇప్పుడప్పుడే ఆ తగ్గింపు దేశంలో వినియోగదారులకు బదిలీ కాదు. ఎందుకంటే ఈ ఐదు నెలల్లో వచ్చిన నష్టాలను చమురు సంస్థలు పూడ్చుకోనున్నాయి.

గత ఏడాది ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికలకు ముందు రికార్డు స్థాయిలో 137 రోజుల పాటు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా కొనసాగాయి. ఆ తర్వాత కేవలం 15 రోజుల్లోనే లీటర్‌ పెట్రోల్‌ ధర 10 రూపాయలపైన పెరిగింది. మళ్లీ ఈ ఏడాది ఏప్రిల్‌ 7వ తేదీ నుంచి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర 96 రూపాయల 72 పైసలుగా, లీటర్‌ డీజిల్‌ ధర 89 రూపాయల 62 పైసలుగా ఉంది. అప్పట్లో కేంద్రం ఎక్సైజ్‌ సుంకం తగ్గించడం వల్ల ఇది సాధ్యమైంది. ఐతే ధరలు స్థిరంగా కొనసాగించడం వల్ల మూడు దేశీయ చమురు సంస్థలకు ఒక్క జూన్‌ త్రైమాసికంలోనే 18వేల 480 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది. 2010 జూన్‌లో పెట్రోల్‌పైనా, 2014 నవంబర్‌లో డీజిల్‌పైనా ప్రభుత్వం నియంత్రణ ఎత్తివేసింది. అప్పటి నుంచి ప్రభుత్వం చమురు సంస్థలకు ఎలాంటి రాయితీ ఇవ్వడం లేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.