ETV Bharat / business

'ఎన్‌ఎస్‌ఈ కేసు'లో దర్యాప్తు ముమ్మరం.. బ్రోకర్లపై సీబీఐ దాడులు

author img

By

Published : May 21, 2022, 3:55 PM IST

NSE co-location scam
ఎన్‌ఎస్‌ఈ కోలొకేషన్‌ స్కామ్​ దర్యాప్తు ముమ్మరం

NSE co-location scam: జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజీలో కో-లొకేషన్​ వ్యవహారానికి సంబంధించి దేశవ్యాప్తంగా 12 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ. ఈ కేసులో సంబంధమున్న బ్రోకర్లపై దాడులు చేపట్టింది. ఇప్పటికే ఈ కేసులో ఎన్​ఎస్​ఈ మాజీ ఎండీ చిత్రా రామకృష్ణ, ఆనంద్​ సుబ్రమణియన్​లను అరెస్ట్​ చేసి విచారిస్తోంది.

NSE co-location scam: నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలో (ఎన్‌ఎస్‌ఈ) కో-లొకేషన్‌ వ్యవహారానికి సంబంధించిన కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసుతో సంబంధమున్న బ్రోకర్లపై దాడులకు దిగింది. దిల్లీ, నోయిడా, ముంబయి, గాంధీనగర్‌, గురుగ్రామ్‌, కోల్‌కతాలోని 12 ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.

ఇదే కేసు వ్యవహారంలో సీబీఐ ఇటీవల ఎన్‌ఎస్‌ఈ మాజీ ఎండీ చిత్రా రామకృష్ణ, మాజీ గ్రూపు ఆపరేటింగ్‌ అధికారి (జీఓఓ) ఆనంద్‌ సుబ్రమణియన్‌ను అరెస్టు చేసి ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. 2010 నుంచి 2015 మధ్య చిత్రా రామకృష్ణ ఎన్‌ఎన్‌ఈ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో సీబీఐ చర్యలు చేపట్టింది.

ఎన్‌ఎస్‌ఈ కోలోకేషన్‌ కుంభకోణాన్ని ఓ ప్రజావేగు 2015 జనవరిలో సెబీ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్‌ఎస్‌ఈలోని కొందరు అధికారులతో కుమ్మకై కొంత మంది బ్రోకర్లు స్టాక్‌ మార్కెట్‌ యాక్సెస్‌ను ఇతర బ్రోకర్ల కంటే ముందుగా పొంది, అక్రమంగా భారీ లాభాలు ఆర్జించారంటూ సెబీకి లేఖ రాశారు. ఈ వివరాలను ఆధారంగా చేసుకుని, సెబీ టెక్నికల్‌ అడ్వయిజరీ కమిటీ దర్యాప్తు నిర్వహించింది. ఎన్‌ఎస్‌ఈ సర్వర్ల కో-లొకేషన్‌ వ్యవస్థలో దుర్వినియోగం జరిగినట్లుగా అప్పుడే గుర్తించారు. ఆ తర్వాత 2016 సెప్టెంబరులో ఈ ఆరోపణలపై దర్యాప్తు, ఫోరెన్సిక్‌ ఆడిట్‌కు ఎన్‌ఎస్‌ఈ బోర్డును సెబీ ఆదేశించింది. ఈ పరిణామాలకు సంబంధించిన కేసులోనే చిత్రా రామకృష్ణ, ఆనంద్‌ సుబ్రమణియన్‌లను సీబీఐ విచారించడంతో పాటు దేశం విడిచి పారిపోకుండా లుక్‌ అవుట్‌ నోటీసులు జారీచేసింది. అనంతరం వారిని అరెస్టు చేసి విచారిస్తోంది.

ఎన్ఎస్‌ఈలో ఆనంద్‌ సుబ్రమణియన్‌ నియామకం కూడా వివాదస్పదంగా మారిన విషయం తెలిసిందే. 2013లో చిత్ర.. ఆనంద్‌ను తన అడ్వైజర్‌గా నియమించుకున్నారు. ఆ తర్వాత గ్రూప్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా పదోన్నతి కల్పించారు. అయితే ఓ హిమాలయ యోగి ప్రభావంతోనే ఈ నియమాకం జరిగిందని, ఎన్‌ఎస్‌ఈలోని కీలక విషయాలను చిత్ర ఆ యోగితో పంచుకున్నారని సెబీ నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో ఆ యోగి ఎవరన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే ఆనంద్‌ సుబ్రమణియనే యోగి పేరుతో చిత్రను ప్రభావితం చేశారని సీబీఐ పేర్కొన్నట్టు సమాచారం.

ఇదీ చూడండి: చిత్ర కురులు మెచ్చిన 'హిమాలయన్​ యోగి' అతడే.. తెలిసిపోయిందిగా!

ఎన్​ఎస్​ఈ 'చిత్ర'కు బిగుస్తున్న ఉచ్చు.. సీబీఐ లుక్​ఔట్​ నోటీసులు

స్టాక్​ మార్కెట్​కు సారథి.. కానీ 'అదృశ్య' యోగి చేతిలో కీలుబొమ్మ.. ఇది ఓ 'చిత్ర' కథ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.