ETV Bharat / business

NPSలో చేరితే దిల్​ఖుష్​ రిటైర్మెంట్.. ట్యాక్స్ బెనిఫిట్స్.. సూపర్ రిటర్న్స్!

author img

By

Published : Jun 23, 2023, 1:07 PM IST

Updated : Jun 23, 2023, 1:23 PM IST

NPS Scheme : ఉద్యోగ విరమణ తరువాత జీవితం సుఖమయంగా ఉండాలంటే.. సంపాదించే సమయంలోనే వీలైనంత త్వరగా పెట్టుబడులు పెట్టడం మంచిది. భవిష్యత్​లో ద్రవ్యోల్బణం కంటే ఎక్కువగా, మంచి ఆదాయాన్ని ఇచ్చే పథకాలు చాలానే ఉన్నాయి. వాటిలో జాతీయ పింఛన్​ పథకం (ఎన్​పీఎస్​) ఒకటి. మరి ఈ పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందామా?

NPS Scheme eligibility and benefits
national pension scheme

NPS Scheme : ప్రతి ఒక్కరికీ ఆశలు ఉంటాయి. ముఖ్యంగా ఇళ్లు కట్టుకోవాలని, పెళ్లి చేసుకోవాలని, పిల్లలను బాగా చదివించుకోవాలని, ప్రశాంతంగా జీవించాలని ఆశపడుతూ ఉంటారు. సంపాదించే వయస్సులో వీటి కోసం వీలైనంతగా ఖర్చు చేస్తూ ఉంటారు. కానీ పదవీ విరమణ తరువాత, కష్టపడి పనిచేయలేని సమయంలో.. ప్రశాంతంగా జీవించడానికి అవసరమైన పదవీ విరమణ ప్రణాళికను మాత్రం విస్మరిస్తూ ఉంటారు.

విశ్రాంత జీవితం సుఖంగా, ప్రశాంతంగా సాగాలంటే కచ్చితంగా క్రమం తప్పకుండా పింఛన్​ వచ్చే ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది. ఇందు కోసం జాతీయ పింఛన్​ పథకం (ఎన్​పీఎస్​) ఎంతో తోడ్పడుతుంది. వాస్తవానికి చాలా మంది పదవీ విరమణ గురించి పెద్దగా ఆలోచించరు. ఇంకా దానికి చాలా కాలం ఉందిలే అని అనుకుంటూ ఉంటారు. కానీ సంపాదించే సమయంలోనే .. పదవీ విరమణ ప్రణాళికలు వేసుకోవడం మంచిది. ఇందు కోసం ప్రస్తుతం ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్​), పబ్లిక్ ప్రావిడెంట్​ ఫండ్​ (పీపీఎఫ్​), జీవిత బీమా పాలసీలు, మ్యూచువల్​ ఫండ్స్​, ఎన్​పీఎస్​ ఇలా ఎన్నో పథకాలు అందుబాటులో ఉన్నాయి. వాస్తవానికి ప్రతి పథకం అందించే ప్రయోజనాలు భిన్నంగా ఉంటాయి. వీటిలో మీకు నచ్చినది ఎంచుకోవచ్చు. కానీ భవిష్యత్​ ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకొని, అందుకు తగ్గట్లుగా పింఛన్​ వచ్చేలా నిధిని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.

వీలైనంత త్వరగా పెట్టుబడులు పెట్టాలి!
దీర్ఘకాల పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఉదాహరణకు మీరు ఏడాదికి రూ.50,000 చొప్పున కనీసం 15 ఏళ్ల పాటు మదుపు చేశారనుకుందాం. అప్పుడు కనీసం 8 శాతం సగటు రాబడితో దాదాపు రూ.15 లక్షల వరకు మీకు నిధి ఏర్పడుతుంది. ఒక వేళ మీరు 5 సంవత్సరాలు ముందుగానే పొదుపు చేయడం మొదలు పెట్టారనుకోండి. అప్పుడు లభించే నిధి రూ.40 లక్షల వరకు పెరిగిపోతుంది. అంటే ఇక్కడ కాంపౌండింగ్​ ఎఫెక్ట్​ పనిచేసింది అని అర్థం. అందుకే పెట్టుబడులు వీలైనంత తొందరగా ప్రారంభించాలి. దీర్ఘకాలం పాటు వాటిని అలాగే కొనసాగించాలి. అప్పుడే మీకు చక్రవడ్డీ లేదా కాంపౌండింగ్​ ఎఫెక్ట్​ వలన మంచి కార్పస్​ క్రియేట్​ అవుతుంది.

ఎక్కువ ఆదాయం వచ్చేలా
దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణానికి మించి ఆదాయం ఇచ్చే పథకాల్లో మదుపు చేయడం చాలా ముఖ్యం. మ్యూచువల్​ ఫండ్స్​, ఎన్​పీఎస్​ లాంటి ఈక్విటీ ఆధారిత పథకాల్లో దీర్ఘకాలిక పెట్టుబడులు పెడితే.. మీరు మంచి ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంటుంది.

ఉదాహరణకు 1995 నుంచి నిఫ్టీ 50 షేర్లలో మదుపు చేశారని అనుకుందాం. వాస్తవానికి అవి 1995 నుంచి ఇప్పటి వరకు ఎన్నో సార్లు ఏటా రెండు అంకెల రాబడిని అందించాయి. మధ్యమధ్యలో ఒడుదొడుకులు వచ్చినా.. దీర్ఘకాలం పెట్టుబడులు పెట్టినవారికి ఎలాంటి నష్టమూ రాలేదు. అందువల్ల ఈక్విటీల్లో మదుపు చేసేటప్పుడు .. లాంగ్​ టెర్మ్​ ఇన్వెస్ట్​మెంట్​ ప్రయోజనాలు గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

రుసుములు తక్కువగా..!
మార్కెట్​ ఆధారిత పథకాల్లో మదుపు చేసేటప్పుడు అనివార్యంగా కొన్ని రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. కనుక తక్కువ రుసుములు ఉంటే పథకాల్లో మదుపు చేయడం మంచిది. ఉదాహరణకు 25 ఏళ్ల కాలంలో మీ డబ్బు నిర్వహణ ఖర్చు ఏటా కనీసం 1 శాతం ఉన్నా.. అది మీ నిధిలో 10 నుంచి 15 శాతం వ్యత్యాసాన్ని చూపిస్తుంది. దీనిని మరింత సింపుల్​గా చెప్పాలంటే.. మీరు ఫండ్​ మేనేజ్​మెంట్​ ఖర్చులను తక్కువగా చెల్లిస్తే.. కనీసం 12 నుంచి 15 శాతం అధిక రాబడిని అదనంగా సంపాదించవచ్చు.

నైపుణ్యం అవసరం
స్టాక్​ మార్కెట్​లో అస్థిరత అనేది చాలా ఎక్కువ. అందువల్ల పెట్టుబడుల నిర్వహణకు చాల నైపుణ్యం అవసరమవుతుంది. ముఖ్యంగా విశ్రాంత జీవితానికి దగ్గరపడుతున్నప్పుడు.. కచ్చితంగా ఈక్విటీ పెట్టుబడులు తగ్గించడం ఎంతైనా మంచిది. దీర్ఘకాలంలో సంపద సృష్టించే క్రమంలో భావోద్వేగాలకు కచ్చితంగా అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.

పన్నుల భారం తక్కువగా ఉండాలి!
National Pension Scheme Tax BenefitS : పెట్టుబడులు పెట్టే ముందు ప్రతి ఒక్కరూ 'పన్ను ప్రయోజనాల' గురించి కూడా కచ్చితంగా తెలుసుకోవాలి. దీర్ఘకాల పెట్టుబడి, ఆదాయాలపై పన్నుల భారం పడకుండా చూసుకోవాలి. వాస్తవానికి ఆయా పథకాలను అనుసరించి, పన్ను ప్రయోజనాలు మారుతూ ఉంటాయి.

ఎన్​పీఎస్​, ఈపీఎఫ్​ లాంటి పథకాల్లో నిబంధనల మేరకు పన్ను ప్రయోజనాలు అన్ని దశల్లో అందుతుంటాయి. కనుక మిగతా పథకాలతో పోల్చి చూసినప్పుడు ఈ పథకాల్లో పన్నులు కాస్త తక్కువే అని చెప్పవచ్చు.

ఎన్​పీఎస్​లో ఎందుకు మదుపు చేయాలి?

Top Reasons on why to invest in NPS :

  • ఈక్విటీలు, కార్పొరేట్​ బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు మొదలైనవన్నీ ఎన్​పీఎస్​లో ఉంటాయి. వీటిలో మీ ఇష్టం వచ్చిన వాటిలో మదుపు చేయవచ్చు. మీ వయస్సు, నష్టాన్ని భరించే సామర్థ్యం ఆధారంగా యాక్టివ్​ లేదా ఆటో ఆప్షన్​లను ఎంచుకోవచ్చు.
  • వయస్సు పెరుగుతున్న కొద్దీ.. పెట్టుబడి పథకాల ఎంపిక మారుతూ ఉంటుంది. కనుక నష్టభయం కూడా పరిమితంగా ఉంటుంది.
  • ఇతర ఫండ్ల నిర్వహణ ఖర్చులతో పోల్చి చూస్తే.. ఎన్​పీఎస్​లో దాదాపు 1/5 వంతు తక్కువ నిర్వహణ వ్యయం అవుతుంది.
  • దీర్ఘకాల పెట్టుబడుల వల్ల వివిధ పథకాల సమ్మేళన ప్రయోజనం లభిస్తుంది.
  • జాతీయ పింఛను పథకం (ఎన్​పీఎస్​)లో పన్ను ప్రయోజనాలు రెండు రకాలుగా ఉంటాయి. కొన్ని సంస్థలు ఉద్యోగులకు కార్పొరేట్​ ఎన్​పీఎస్​ను అందిస్తాయి. అప్పుడు మీ మూల వేతనం (డీఏ)తో కలిపి 10 శాతం మేరకు కార్పొరేట్​ ఎన్​పీఎస్​లో పెట్టుబడి పెట్టడానికి వీలవుతుంది. ఈ పెట్టుబడికి సెక్షన్​ 80 సీసీడీ (2) కింద పన్ను ప్రయోజనం లభిస్తుంది. ఒక వేళ మీరు పాత పన్నుల విధానంలో కొనసాగుతూ ఉన్నట్లయితే.. సెక్షన్​ 80 సీసీడీ (1బీ) కింద రూ.50,000 వరకు ఇందులో మీరు పొదుపు చేయవచ్చు. సెక్షన్​ 80 సీ పరిమితి రూ.1,50,000కు ఇది అదనం. కనుక మీపై పన్ను భారం తగ్గేందుకు ఇది సహకరిస్తుంది.
  • జాతీయ పింఛన్​ పథకాన్ని పీఎఫ్​ఆర్​డీఏ పర్యవేక్షిస్తుంది. అదే విధంగా ఫండ్​ మేనేజర్లు కూడా మార్గదర్శకాలకు లోబడి మాత్రమే.. ఎన్​పీఎస్​ నిధులను నిర్వహించాల్సి ఉంటుంది. కనుక పెట్టుబడిదారులకు నష్టభయం పెద్దగా ఉండదు. అందుకే పదవీ విరమణ సమయంలో, విశ్రాంత జీవితంలో సుఖమయంగా జీవించడం కోసం.. ఎన్​పీఎస్​లో పెట్టుబడులు పెట్టడం ఒక మంచి ఎంపిక అవుతుంది. అయితే మీ వ్యక్తిగత ఆర్థిక నిపుణులను సంప్రదించిన తరువాతనే ఈ పెట్టుబడుల విషయంలో ఒక నిర్ణయానికి రావడం మంచిది.
Last Updated : Jun 23, 2023, 1:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.