ETV Bharat / business

ఆరోగ్య బీమా తీసుకుంటారా?.. నగదు రహిత చికిత్స కోసం ఇదే బెటర్​!

author img

By

Published : Jun 16, 2023, 2:57 PM IST

Cashless Health Insurance : మీరు ఆరోగ్య బీమా తీసుకుందామని అనుకుంటున్నారా? అయితే నగదు రహిత చికిత్స అందించే బీమా పాలసీలను తీసుకోవడమే ఉత్తమం. ఎందుకంటే మీకు ఆపద వచ్చినప్పుడు, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు పడకుండా చికిత్స పొందడానికి వీలవుతుంది. పూర్తి వివరాల కోసం ఈ కథనం చదవండి.

Cashless Health Insurance
Cashless Health Insurance and claim process

Cashless Health Insurance : మన దేశంలో చాలా మందికి ఆరోగ్య బీమాపై సరైన అవగాహన లేదు. దీని వల్ల ఊహించని ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతుంటారు. ముఖంగా చేతిలో నగదు లేక ఏమి చేయాలో పాలుపోక సతమతమవుతుంటారు. ఇలాంటి వారి కోసమే ఇన్సూరెన్స్​ కంపెనీలు.. నగదు రహిత చికిత్స అందించే 'ఆరోగ్య బీమా పథకాల'ను అందిస్తున్నాయి. మరిన్ని పూర్తి వివరాలు మీ కోసం..

ఆరోగ్య బీమా పాలసీల్లో సాధారణంగా రెండు రకాలుగా క్లెయిమ్ చేసుకోవచ్చు.​ మొదటిది ఇన్సూరెన్స్​ కంపెనీకి చెందిన నెట్​వర్క్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకోవడం. దీని వల్ల ముఖ్యంగా పాలసీదారుడికి ఎలాంటి ఖర్చు చేయాల్సిన అవసరం ఏర్పడదు. దీన్నే నగదు రహిత చికిత్స (క్యాష్​లెస్​ ట్రీట్​మెంట్​) అంటారు. వాస్తవానికి పాలసీ విలువ మేరకు ఆసుపత్రి ఈ ఖర్చులను ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది. రెండో పద్ధతి ఏమిటంటే, పాలసీదారుడే ముందుగా వైద్య ఖర్చులు చెల్లించి, ఆ తరువాత తను చేసిన వ్యయాలను ఇన్సూరెన్స్​ కంపెనీ నుంచి పొందడం.

సాధారణంగా మొదటి పద్ధతి పాలసీదారులకు చాలా సౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే సమయానికి చేతిలో డబ్బులు లేకపోయినా, చికిత్సకు ఎలాంటి ఇబ్బంది కలగదు. కానీ రెండో విధానంలో కచ్చితంగా పాలసీదారుని వద్ద డబ్బులు ఉండాల్సి ఉంటుంది. లేదంటే అతను సత్వర చికిత్సను పొందలేడు. ఒక వేళ డబ్బులు ఉన్నా కూడా, తను చేసిన వైద్య ఖర్చులను బీమా సంస్థ నుంచి పొందేందుకు చాలా సమయం పడుతుంది.

నగదు రహిత చికిత్స కోసం ఏం చేయాలి?

  • ఆసుపత్రిలో చేరాల్సివచ్చినప్పుడు, మీ సమీపంలోని నెట్​వర్క్​ ఆసుపత్రికి వెళ్లండి. మీరు అక్కడ చేరిన విషయం వెంటనే మీ బీమా సంస్థకు తెలియజేయండి. ముఖ్యంగా ఆసుపత్రికి వెళ్లేటప్పుడే మీ ఆరోగ్య బీమా గుర్తింపు కార్డు లేదా మీ ఆరోగ్య బీమా పాలసీ పత్రాన్ని తీసుకువెళ్లండి. దీనితోపాటు ప్రభుత్వం జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డు కూడా తప్పనిసరిగా తీసుకెళ్లండి.
  • సాధారణంగా ప్రతి హాస్పిటల్​లో బీమా పాలసీలకు సంబంధించిన ప్రత్యేక విభాగం ఉంటుంది. వారే మీ క్లెయిమ్​ ప్రక్రియలో సహకారం అందిస్తారు.
  • కొన్ని ఆసుపత్రుల్లో ఇన్సూరెన్స్​ కంపెనీకి సంబంధించిన లేదా థర్డ్​ పార్టీ అడ్మిన్​​స్ట్రేటర్ (టీపీఏ) ప్రతినిధులు కూడా ఉంటారు. వీరు కూడా మీ క్లెయిమ్​ ప్రోసెస్​లో సహకారం అందిస్తారు.
  • మీరు బీమా సంస్థకు.. మెడికల్​ రిపోర్టులతో పాటు అవసరమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడు అన్ని పత్రాలను, వివరాలను పరిశీలించి.. బీమా సంస్థ ప్రాథమిక ఆమోదాన్ని పంపిస్తుంది.
  • హాస్పిటల్​లో చికిత్స కొనసాగుతూ ఉంటే.. బీమా సంస్థ దశలవారీగా ఆమోదాలను పంపిస్తూ ఉంటుంది. చికిత్స పూర్తయి, ఇంటికి వెళ్లే సమయంలో మొత్తం ఖర్చును ఆసుపత్రికి చెల్లిస్తుంది.
  • కొన్నిసార్లు పాలసీదారులు.. ఇన్సూరెన్స్​ పాలసీ ఉన్నప్పటికీ, సొంతంగా కొంత మొత్తాన్ని చెల్లించాల్సి రావచ్చు.

ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోండి!

  • నగదు రహిత చికిత్స పొందాలంటే.. కింది విషయాలు కచ్చితంగా గుర్తించుకోండి.
  • నెట్​వర్క్​ ఆసుపత్రుల్లో మాత్రమే క్యాష్​ లెస్​ ట్రీట్​మెంట్​ ఇస్తారని గుర్తించుకోండి.
  • పాలసీ గది అద్దె, ఇతర చికిత్సల కొరకు ఎంత మేరకు చెల్లిస్తారో ముందుగానే చూసుకోవాలి.
  • సాధారణంగా గది అద్దె ఎంత మేరకు చెల్లిస్తారో.. బీమా పాలసీలోనే కచ్చితంగా రాసి ఉంటుంది. అందువల్ల ఆసుపత్రిలో గది తీసుకునేటప్పుడు కచ్చితంగా.. పాలసీలో పేర్కొన్న గది అద్దెకు సరిపోయే విధంగా గదులను తీసుకోండి. ఒక వేళ గది అద్దె అధికంగా ఉంటే, దాని తగ్గట్టుగా మీరు మీ సొంత సొమ్ము ఖర్చు చేయాల్సి ఉంటుంది.
  • మరీ ముఖ్యంగా గది అద్దె మనం చెల్లించినప్పటికీ, గది అద్దెతో ముడిపడిన ఇతర, అదనపు ఖర్చులు కూడా మనమే భరించాల్సి వస్తుందని గుర్తుంచుకోండి.
  • మీరు బీమా పాలసీకి అనుబంధంగా తీసుకున్న రైడర్లు, టాప్​అప్​ పాలసీల గురించి కూడా ఆసుపత్రులకు తెలియజేయాల్సి ఉంటుంది. ఎందుకంటే, మీ హాస్పిటల్ బిల్లు.. ప్రాథమిక పాలసీకి మించినట్లయితే.. టాప్​అప్ మీకు చాలా ఉపయోగపడుతుంది. అందుకోసమే.. మీరు హెల్త్ పాలసీ తీసుకునే ముందే అన్ని విషయాలు చాలా జాగ్రత్త పరిశీలించి తీసుకోవడం ఉత్తమం.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.