ETV Bharat / business

'ఆ సంస్థలో భారీగా అక్రమాలు'.. హిండెన్‌బర్గ్‌ మరో సంచలన నివేదిక

author img

By

Published : Mar 23, 2023, 10:53 PM IST

హిండెన్‌బర్గ్‌ మరో సంచలన నివేదికను బయటపెట్టింది. ట్విట్టర్‌ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సేకు చెందిన చెల్లింపుల సంస్థ బ్లాక్‌ భారీగా అక్రమాలకు పాల్పడిందని హిండెన్‌బర్గ్‌ ఆరోపించింది. బ్లాక్‌ సంస్థలోని 40 నుంచి 75 శాతం ఖాతాలు నకిలివేనని తెలిపింది. రెండేళ్ల పాటు బ్లాక్‌ సంస్థపై పరిశోధనలు జరిపినట్లు వెల్లడించింది.

hindenburg-research-new-report-on-jack-dorsey
హిండెన్‌బర్గ్ బ్లాక్ జాక్ డోర్సే

అమెరికన్‌ షార్ట్‌ సెల్లింగ్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌.. మరో సంచలన నివేదికను బయటపెట్టింది. ఈ సారి ట్విట్టర్‌ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సేకు చెందిన చెల్లింపుల సంస్థ 'బ్లాక్‌' భారీగా అక్రమాలకు పాల్పడిందని ఆరోపించింది. అదానీ గ్రూప్‌ నివేదిక తర్వాత మరో పెద్ద నివేదికను విడుదల చేస్తానన్న హిండెన్‌బర్గ్‌.. అన్నట్లుగా 'బ్లాక్‌' సంస్థపై మరో పెద్ద నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికకు సంబంధించిన లింక్‌ను హిండెన్‌బర్గ్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో ట్వీట్ చేసింది.

బ్లాక్‌ సంస్థ తన వినియోగదారుల సంఖ్యను ఎక్కువగా చూపిందని హిండెన్​బర్గ్ తెలిపింది. ఖర్చుల వివరాలను తక్కువ చేసి చూపించిందని వెల్లడించింది. తద్వారా పెట్టుబడిదారులను మోసం చేసిందని ఆరోపించింది. బ్లాక్‌కు సంబంధించిన కీలకమైన విషయాలను తమ పరిశోధన ద్వారా గుర్తించినట్లు తన నివేదికలో పేర్కొంది. రెండేళ్ల పాటు బ్లాక్‌ సంస్థపై పరిశోధనలు జరిపినట్లు వెల్లడించింది. ఒక క్రమ పద్ధతిలో పెట్టుబడిదారుల నుంచి.. బ్లాక్‌ సంస్థ సాయం పొందిందని తెలిపింది. ఆవిష్కరణ పేరుతో వినియోగదారులను, ప్రభుత్వాన్ని సులభంగా మోసం చేయడమే బ్లాక్‌ వ్యాపారం వెనుకున్న అసలు ఉద్దేశమని వెల్లడించింది. నిబంధనలను అతిక్రమించడం, రుణాల పేరుతో దోపిడీ చేయడం, విప్లవాత్మక సాంకేతికత పేరుతో కంపెనీ గణాంకాలను పెంచి పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించడమే బ్లాక్‌ వ్యాపారం లక్ష్యమని తన నివేదికలో పేర్కొంది.

బ్లాక్‌ సంస్థలోని నలభై నుంచి డెభై ఐదు శాతం ఖాతాలు నకిలీవని హిండెన్‌బర్గ్ తెలిపింది. ఆ సంస్థ మాజీ ఉద్యోగులు తమతో ఈ విషయాన్ని వెల్లడించినట్లు పేర్కొంది. తాజాగా హిండెన్‌బర్గ్ విడుదల చేసిన నివేదిక అనంతరం.. ప్రీమార్కెట్ ట్రేడింగ్‌లో బ్లాక్ షేర్‌ ధర 18 శాతం పడిపోయింది. బ్లాక్ వినియోగదారుల్లో ఎక్కువ మంది నేరస్థులు, అక్రమ వ్యాపారాలు నిర్వహించే వారు ఉన్నారని తన నివేదికలో హిండెన్‌బర్గ్ వెల్లడించింది. కరోనా సమయంలో జాక్‌ డోర్సే, మరో సహ-వ్యవస్థాపకుడు జేమ్స్ మాకెల్వేయ్‌ సుమారు ఒక బిలియన్‌ డాలర్‌ విలువైన షేర్లను విక్రయించినట్లు పేర్కొంది. ఈ క్రమంలో బ్లాక్ సీఎఫ్‌వో అమృతా అహుజా, మేనేజర్‌ బ్రెయిన్‌ గ్రాస్సాడోనియా.. మిలియన్‌ డాలర్లు పెట్టుబడులు పెట్టినట్లు హిండెన్‌బర్గ్‌ నివేదికలో వెల్లడి చేసింది.

అదానీ గ్రూప్​పై హిండెన్​బర్గ్​ నివేదిక..
కాగా, ఇదివరకే దేశీయ స్టాక్ మార్కెట్లలో షేర్ల ధరల్లో అదానీ గ్రూప్​ అవకతవకలకు పాల్పడిందని హిండెన్​బర్గ్​ ఆరోపించింది. జనవరి 24న అదానీ గ్రూప్​పై నివేదికను విడుదల చేసింది. ఫలితంగా అదానీ షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో ఆయన తన సంపదలో సుమారు 60 శాతం మేర కోల్పోయారు. గతేడాదిలో అదానీ ప్రతి వారం సుమారు రూ.3,000 కోట్లు నష్టపోయారని M3M 'హూరూన్​ గ్లోబల్​ రిచ్​ లిస్ట్' నివేదించింది. ఫలితంగా మార్చి మధ్యలో వరకు అదానీ ఆస్తిని 53 బిలియన్​ డాలర్లని సంస్థ నిర్ధరించింది. ప్రపంచ కుబేరులు జాబితాలో అదానీ 11 స్థానాలు పడిపోయి 23వ స్థానం వద్ద ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.