ఆరోగ్య బీమా తీసుకుంటున్నారా?.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

author img

By

Published : May 21, 2023, 9:12 AM IST

health insurance plans tips
health insurance plans tips ()

Health Insurance Conditions For Coverage : అనారోగ్యం వల్ల చాలా మంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఆర్థిక ఇబ్బందుల బారిన పడకుండా ఆరోగ్య బీమా రక్షణ కల్పిస్తుంది. ప్రస్తుత రోజుల్లో ఆరోగ్య బీమా అవసరం అధికంగా ఉంటోంది. అయితే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకునేటప్పుడు నిబంధనలు, షరతులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. అవేంటో ఓ సారి చూద్దాం.

Health Insurance Conditions For Coverage : ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలించాలి. ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ వర్తించని సందర్భాలను తెలుసుకోవాలి. సమగ్ర బీమా పాలసీని ఎంచుకున్నప్పుడూ, కొన్నిసార్లు కచ్చితమైన మినహాయింపులు, తగ్గింపులు ఉండే అవకాశం ఉంది. చికిత్స మొత్తంలో కొంత మొత్తాన్ని పాలసీదారుడు చెల్లించాల్సి ఉంటుంది. మిగతా డబ్బుల్ని బీమా పాలసీ చెల్లిస్తుంది. లేదా చికిత్స ఖర్చు నిర్ణీత పరిమితికి మించినప్పుడు, ఆ పై మొత్తానికే పరిహారం ఇస్తుంది. ఉదాహరణకు మీ పాలసీలో రూ.5 వేల వరకూ పరిమితి ఉందనుకుందాం. మీ చికిత్స ఖర్చు రూ.20వేలు అయ్యింది. అప్పుడు రూ.5వేలు మీరు, రూ.15వేలు పాలసీ చెల్లిస్తుంది. అదే సమయంలో రూ.5వేల లోపు ఖర్చయినప్పుడు బీమా సంస్థ పరిహారం చెల్లించదు. ఇందులోనూ రెండు రకాలున్నాయి.

  • కచ్చితంగా: బీమా సంస్థ కొంత పరిమితి తర్వాతే చికిత్స ఖర్చును భరిస్తుంది. ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడే దీన్ని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఆ పరిమితి వరకూ పాలసీదారుడే ఖర్చును భరించాలి. అది దాటినప్పుడే బీమా సంస్థ ఖర్చులను చెల్లిస్తుంది.
  • స్వచ్ఛందంగా: ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గాలని కోరుకున్నప్పుడు పాలసీదారుడు స్వచ్ఛందంగా మినహాయింపు పరిమితిని ఎంచుకునే అవకాశం ఉంది. క్లెయింలో ఎంత భాగాన్ని పాలసీదారుడు భరించగలరో ముందే నిర్ణయించుకోవాలి. దాన్ని బట్టి, పాలసీ ప్రీమియాన్ని బీమా సంస్థ నిర్ణయిస్తుంది. ఇది పాలసీదారుల వయసును బట్టి మారుతుంది. మీ దగ్గర డబ్బు ఉంది.. ఇబ్బందేమీ లేదు అనుకున్నప్పుడు మాత్రమే ఈ మినహాయింపును ఎంచుకోండి. స్వల్ప ప్రీమియం ఆదా కోసం దీన్ని తీసుకుంటే.. తర్వాత ఆర్థికంగా భారం అయ్యే అవకాశం ఉంది.

టాపప్‌ ప్లాన్‌ తీసుకున్నారా?
టాపప్‌ పాలసీలు కొంచెం భిన్నంగా ఉంటాయి. ఒక పరిమితి వరకూ పాలసీదారుడు లేదా సమగ్ర ఆరోగ్య బీమా పాలసీ చికిత్స ఖర్చును చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అధికంగా అయ్యే మొత్తానికే టాపప్‌ పాలసీ వర్తిస్తుంది.

ఇప్పటికే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నవారు ఈ టాపప్‌ పాలసీలను ఎంచుకోవచ్చు. ఇందులోనూ టాపప్‌, సూపర్‌ టాపప్‌ అనే రకాలున్నాయి. సాధారణ టాపప్‌ పాలసీ తీసుకున్నప్పుడు పాలసీదారుడు ప్రతి క్లెయిం కోసం ముందుగా మినహాయింపు మొత్తాన్ని చెల్లించాలి. సూపర్‌ టాపప్‌ పాలసీలో ఏడాది కాలంలో మినహాయింపు పరిమితిని లెక్కించి, బీమా సంస్థలు పరిహారాన్ని చెల్లిస్తాయి.

ఉదాహరణకు..
మీరు రూ.3 లక్షల విలువైన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారని అనుకుందాం. టాపప్‌, సూపర్‌ టాపప్‌ పాలసీలు రూ.3లక్షల పైన ఖర్చయినప్పుడు వర్తించేలా తీసుకున్నారు. ఒక పాలసీ ఏడాదిలో రూ.2లక్షల విలువైన రెండు క్లెయింలు చేశారు. ఇప్పుడు మీ ప్రాథమిక పాలసీ.. మొదటిసారి క్లెయింకు రూ.2 లక్షలు పాలసీ చెల్లిస్తుంది. మరో క్లెయింకు రూ. లక్ష చెల్లిస్తుంది. ఇప్పుడు టాపప్‌ పాలసీ రూ.3లక్షల పరిమితి దాటాకే వర్తిస్తుంది. ఒకసారి రూ. 2లక్షలు, మరోసారి రూ. లక్ష ఖర్చయ్యింది. కాబట్టి, సాధారణ టాపప్‌ పాలసీ ద్వారా ఉపయోగం ఉండదు.
ఇదే ఉదాహరణలో సూపర్‌ టాపప్‌ పాలసీ ఉందనుకుంటే.. మొదటి క్లెయింకు రూ.2లక్షలు ప్రాథమిక పాలసీ చెల్లిస్తుంది. రెండోసారి రూ.లక్ష ప్రాథమిక పాలసీ భరిస్తే.. మరో రూ.లక్ష సూపర్‌టాపప్‌ పాలసీ భరిస్తుంది.

మినహాయింపుల వల్ల కొన్నిసార్లు ఆర్థిక భారం పడినప్పటికీ.. చిన్న మొత్తాలకూ ఆరోగ్య బీమా క్లెయిం చేసుకోకుండా అడ్డుకుంటుంది. ఫలితంగా నో క్లెయిం బోనస్‌ ద్వారా పాలసీ విలువ పెరిగేందుకు అవకాశం ఉంటుంది. క్లెయిం చేసుకున్నప్పుడు కొన్ని బీమా సంస్థలు అదనపు ప్రీమియాన్నీ వసూలు చేస్తుంటాయి. దీన్ని నివారించేందుకూ మినహాయింపులు ఉపయోగపడతాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.