ETV Bharat / business

గోల్డ్ ఈటీఎఫ్​తో మీ పెట్టుబడులు సేఫ్​.. కొనుగోలు, అమ్మకాలు చాలా ఈజీ గురూ

author img

By

Published : Feb 10, 2023, 6:28 PM IST

gold etf funds and investments in india
gold etf funds and investments in india

శుభకార్యం, పండగలు ఏదైనా సరే బంగారం గురించే ఆలోచన. ఆభరణాల రూపంలోనూ.. పెట్టుబడిగానూ దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే మదుపు సాధనంగా ప్రపంచమంతా నమ్మే నమ్మకమైన మదుపు సాధనం ఇది. ఇటీవలి కాలంలో దీని ధర పెరుగుతోండటంతో చాలామంది ఎంతోకొంత మొత్తాన్ని పసిడిలో మదుపు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో చిన్న మొత్తంతోనూ ఇందులో పెట్టుబడి పెట్టేందుకు వీలు కల్పించే గోల్డ్‌ ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్ల (గోల్డ్‌ ఈటీఎఫ్‌) తెలుసుకుందాం.

వైవిధ్యమైన పెట్టుబడులు ఎప్పుడూ శ్రేయస్కరం. ఇందులో బంగారం ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. చాలామంది బంగారాన్ని నేరుగా కొనేందుకే ఇష్టపడతారు. శుభకార్యాలు, ఇతర అవసరాలకు ఇది తప్పదు. కొన్ని అంచనాల ప్రకారం దేశంలో 27వేల టన్నుల పసిడి ఉంది. ప్రస్తుతం వేగవంతమైన ఆర్థికీకరణను దృష్టిలో ఉంచుకొని, పెట్టుబడిదారుల్లో క్రమంగా మార్పు కనిపిస్తోంది. ఆభరణాలు, నాణేలు రూపంలోనే కాకుండా పెట్టుబడి దృష్టితో గోల్డ్‌ ఈటీఎఫ్‌ల రూపంలో ఇందులో మదుపు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పేరులో ఉన్నట్లే.. ఇవి మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు నిర్వహించే పథకాలు. బంగారం ధరలను ట్రాక్‌ చేసే నిష్క్రియా పథకాలు. ఇక్కడ గోల్డ్‌ ఈటీఎఫ్‌ యూనిట్‌ ధర బంగారం ఒక గ్రాము లేదా నిర్ణీత మొత్తానికి సరిపోయే విధంగా సర్దుబాటు ఉంటుంది. ఎలక్ట్రానిక్‌ రూపంలో కొనుగోలు, అమ్మకాలు సులభంగా నిర్వహించే సౌలభ్యాన్ని అందిస్తాయి.

స్వచ్ఛత: బంగారాన్ని నేరుగా కొనుగోలు చేసినప్పుడు కొన్నిసార్లు స్వచ్ఛత విషయంలో అనుమానాలుంటాయి. గోల్డ్‌ ఈటీఎఫ్‌ ప్రతి యూనిట్‌ 99% లేదా అంతకంటే ఎక్కువ స్వచ్ఛతతో ఉన్న బంగారం ధరకు మద్దతునిస్తుంది. కాబట్టి, స్వచ్ఛత విషయంలో ఆందోళన అవసరం లేదు.

ఖర్చులు: బంగారాన్ని కొనుగోలు చేసినప్పుడు నిల్వ చేసుకోవడం పెద్ద సమస్య. లాకర్‌ వంటివాటిని ఎంచుకున్నప్పుడు అదనంగా కొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది. తయారీ, తరుగు ఇలా పలు ఇతర అంశాలూ ఉంటాయి. ఈటీఎఫ్‌లలో ఇలాంటి ఇబ్బందులు తక్కువ. బంగారం డీమ్యాట్‌ రూపంలో ఉంటుంది కాబట్టి, భద్రత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
సులభంగా: గోల్డ్‌ ఈటీఎఫ్‌లను సులభంగా కొనుగోలు చేయొచ్చు. స్టాక్‌ ఎక్స్ఛేంజీల పనివేళలో ఎప్పుడైనా యూనిట్లను కొనుగోలు చేయొచ్చు. విక్రయించవచ్చు.

సిప్‌ ద్వారా: ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు పెట్టకుండా నెలనెలా క్రమానుగత పద్ధతిలోనూ ఇందులో మదుపు చేయొచ్చు. డీమ్యాట్‌ ఖాతా లేని వారు గోల్డ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్లను ఎంచుకొని, సిప్‌ను ప్రారంభించవచ్చు.

పారదర్శకత: గోల్డ్‌ ఈటీఎఫ్‌ల ప్రయోజనాల్లో పారదర్శకతను ప్రధానంగా చెప్పొచ్చు. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ గోల్డ్‌ యూనిట్లు ఆ ధరనే ప్రతిబింబిస్తాయి. కొనుగోలు, విక్రయాల్లో సులభంగా ధర తెలిసిపోతుంది. బంగారాన్ని అమ్మాలనుకున్నప్పుడు ధర విషయంలో వ్యత్యాసం ఉంటుందన్న సంగతి తెలిసిందే.

పన్ను ప్రభావం: మూడేళ్లకు మించిన గోల్డ్‌ ఈటీఎఫ్‌లను కొనసాగించినప్పుడు దీర్ఘకాలిక మూలధన లాభంగా పేర్కొంటారు. ద్రవ్యోల్బణ సూచీకి సర్దుబాటు చేసి, వచ్చిన లాభంపై 20 శాతం పన్ను చెల్లించాలి. మూడేళ్లకన్నా తక్కువ వ్యవధిలో విక్రయిస్తే స్వల్పకాలిక మూలధన లాభం నిబంధనలు వర్తిస్తాయి. పోర్ట్‌ఫోలియోలో బంగారాన్ని చేర్చాలనుకునే వారు.. గోల్డ్‌ ఈటీఎఫ్‌లను పరిశీలించవచ్చు. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో దీన్ని ఒక నమ్మకమైన ఆస్తిగా చూడొచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.