ETV Bharat / business

హోమ్ ​లోన్ భారాన్ని తొందరగా తగ్గించుకోండిలా..

author img

By

Published : Feb 10, 2023, 12:00 PM IST

మరోసారి పావుశాతం రెపో రేటు పెరగడం వల్ల గృహరుణాలు భారంగా మారిపోయాయి. నెలవారీ వాయిదాలు పెరగడం, వ్యవధి ఏళ్లకు ఏళ్లు పెరిగిపోవడంలాంటివి రుణ గ్రహీతలకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రుణాన్ని తొందరగా తీర్చేందుకు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు. ఇంటిరుణ భారం తొందరగా దించుకునేందుకు అనుసరించాల్సిన మార్గాలను తెలుసుకుందాం.

Steps to follow to pay off your home loan quickly
హోమ్​లోన్స్​

గత ఏడాది మేలో రెపో రేటు 4.0శాతంగా ఉంది. తాజా పెంపుతో కలిసి 2.50 శాతం పెరిగి 6.50 శాతానికి చేరుకుంది. అంటే మేలో మీరు 6.5శాతం వద్ద తీసుకున్న రెపో ఆధారిత గృహరుణం ఇప్పుడు 9.0శాతానికి చేరుకుంది. పెరిగిన వడ్డీతో లెక్కిస్తే 20 ఏళ్ల వ్యవధికి తీసుకున్న మీ గృహరుణం 30ఏళ్లకూ తీరకపోవచ్చు. కొన్నిసార్లు మీ ఈఎంఐలూ పెరిగేందుకు అవకాశం ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రుణ భారాన్ని దించుకునేందుకు ముందస్తు చెల్లింపు అనేది ఒక శక్తిమంతమైన సాధనంగా చెప్పుకోవచ్చు.

దీనికోసం పాటించాల్సిన కొన్ని అంశాల విషయానికి వస్తే..
మీ ఈఎంఐని పెంచుకోండి
ఇంటి రుణానికి చెల్లిస్తున్న వాయిదా మొత్తాలను ఏడాదికోసారి మీ వీలును బట్టి 5-10 శాతం వరకూ పెంచుకునేందుకు ప్రయత్నించండి. ఆదాయం పెరిగినప్పుడు ఈ విషయంపై దృష్టి పెట్టండి. ఇది సులభంగా సాధించగలిగిన అంశమే. దీనివల్ల మీ రుణ వ్యవధి కొన్నేళ్లపాటు తగ్గుతుంది. ఇలా ఏటా మీ ఆదాయం, ఇతర ఖర్చులను బట్టి ఈఎంఐని పెంచే ప్రయత్నం చేయండి. పెరుగుతున్న వడ్డీ రేట్లను ఎదుర్కొనేందుకు ఈఎంఐ పెంపును ఒక మార్గంగా చెప్పొచ్చు. సాధారణంగా రుణం అసలును పాక్షికంగా చెల్లించాలంటే కనీసం ఒక ఈఎంఐని జమ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీ ఈఎంఐ రూ.50,000 అనుకుందాం.. అప్పుడు కనీస చెల్లింపు ఇదే మొత్తం ఉంటుంది. కొంతమంది రుణదాతలు రెట్టింపు ఈఎంఐ మొత్తాన్ని అడిగే అవకాశం ఉంటుంది. అంటే పాక్షిక చెల్లింపు రూ.1,00,000 చేయాలన్నమాట. ఇలా చెల్లించడం అన్నిసార్లూ కుదరక పోవచ్చు. కాబట్టి, ఈఎంఐని పెంచుకుంటే ప్రతి నెలా ముందస్తు చెల్లింపులాగా పనిచేయడం ప్రారంభిస్తుందన్నమాట. ఉదాహరణకు మీ ఈఎంఐ రూ.25,000 అనుకుందాం. దీన్ని రూ.30వేలు చేస్తే రుణం అసలు తొందరగా తీరుతుంది. ఫలితంగా వడ్డీ భారమూ గణనీయంగా తగ్గేందుకు అవకాశం లభిస్తుంది.

5 శాతం చెల్లిస్తే..
వాయిదాలను పెంచుకోవడానికి ఇబ్బంది అనుకున్న వారు.. రుణ అసలులో ఏడాదికి 5 శాతం చెల్లించే ప్రయత్నం చేయొచ్చు. ఇలా చేయడం వల్ల 20 ఏళ్ల రుణాన్ని 12 ఏళ్లలోనే తిరిగి చెల్లించేందుకు వీలవుతుంది. మీ ఆర్థిక పరిస్థితిని బట్టి ఇంతకు అధికంగానూ చెల్లించేయొచ్చు. ఏడాదికి 5 శాతం తిరిగి చెల్లించడం వల్ల అంత ఇబ్బందులు ఉండవు అని చెప్పొచ్చు. ఇలా చేయడం వల్ల మీ ఈఎంఐలు మరింత ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి. రుణ మొత్తం 66 శాతం ఈఎంఐల ద్వారా, మిగిలింది ముందస్తు చెల్లింపు ద్వారా తీర్చేయొచ్చు. తీసుకున్న రుణంలో 5 శాతం కాకుండా, మిగిలిన అసలులో 5 శాతం చెల్లించడం వల్ల మున్ముందు ఈ భారం అంత అధికంగా ఉండదు. దీనివల్ల మీరు భవిష్యత్‌ ఆర్థిక లక్ష్యాల కోసం అధికంగా పొదుపు చేసేందుకు వీలవుతుంది.

ఇతర ఏ రుణాలతో పోల్చినా గృహరుణం వడ్డీ తక్కువే. కాబట్టి, దీన్ని తీర్చడంలో తొందరపాటు పనికిరాదు. ప్రతీదీ ఒక వ్యూహం ప్రకారం జరగాలి. పన్ను మినహాయింపులను లెక్కలోకి తీసుకుంటే.. నికర వడ్డీ 7 శాతం వరకే ఉంటుంది. మార్కెట్లో దీర్ఘకాలం పెట్టుబడి పెట్టడం వల్ల 10 శాతం వరకూ రాబడిని పొందే వీలుంది. రెపో రేట్లు పెరుగుతున్నప్పుడు మీ రుణం ప్రారంభంలో వడ్డీ భారాన్ని తగ్గించేందుకు ముందస్తు చెల్లింపులు ఉపయోగపడతాయి. వ్యవధి గడిచే కొద్దీ ముందస్తు చెల్లింపుల అవసరం తగ్గుతుంది. అప్పుడు అధిక రాబడిని అందించే పథకాల్లో మదుపు చేయొచ్చు. ఈ విధంగా రుణం తొందరగా తీర్చడంతోపాటు, సంపదను సృష్టించేందుకూ వీలవుతుంది.

వ్యవధి పెరగకుండా..
రుణాన్ని ఎన్నేళ్లలో తీర్చాలనుకుంటున్నారు అనేది ప్రధానంగా గమనించాల్సిన అంశం. ఉదాహరణకు 20 ఏళ్ల వ్యవధికి రుణం తీసుకొని, 10 ఏళ్లలో చెల్లించారనుకుందాం. కానీ, రేట్ల పెంపు వల్ల మీ వ్యవధి 25 ఏళ్లకు వెళ్లిందనుకుందాం. ఇలాంటి సందర్భాల్లో కనీసం 10 శాతం ఈఎంఐ పెంపు, ముందస్తు చెల్లింపుల ద్వారా వ్యవధి పెరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. దీనివల్ల మీ రుణ భారం తగ్గుతుంది. ఇతర లక్ష్యాలను సాధించేందుకు మార్గాన్ని సులభం చేస్తుంది.
మీ బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ నుంచి గృహరుణానికి సంబంధించిన వివరాలు తీసుకోండి. వడ్డీ రేటు ఎంత? ఈఎంఐ ఎంత చెల్లిస్తున్నారు, ఇంకా ఎన్నేళ్ల వ్యవధి మిగిలి ఉంది లాంటివి తెలుసుకోండి. దీనివల్ల మీరు ఏం చేయాలన్న విషయంలో స్పష్టత వస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.