ETV Bharat / business

భారత్​లో అత్యంత సంపన్నుడిగా అదానీ.. టాప్‌-100లో 30% సంపద వారిద్దరి వద్దే!

author img

By

Published : Nov 29, 2022, 6:15 PM IST

forbes rich list
forbes rich list

భారత్‌లో కుబేరుల సంపద రోజురోజుకూ పెరుగుతోంది. దేశంలో టాప్‌-100 కుబేరుల సంపద 25 బిలియన్‌ డాలర్ల మేర పెరిగిందని ఫోర్బ్స్‌ వెల్లడించింది.

ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, రూపాయి క్షీణత, ఉద్యోగ కోతలు, మాంద్యం భయాలు.. ఇటీవల కాలంలో తరచూ వినిపిస్తున్న మాటలివీ. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. అదే సమయంలో భారత్‌లో కుబేరుల సంపద రోజురోజుకూ పెరుగుతోంది. దేశంలో టాప్‌-100 సంపన్నుల మొత్తం సంపద విలువ 800 బిలియయన్‌ డాలర్లకు (రూ.62 లక్షల కోట్లుపైనే) చేరింది. ఈ ఒక్క ఏడాదిలోనే వీరి సంపద 25 బిలియన్‌ డాలర్లు మేర పెరిగిందని ఫోర్బ్స్‌ వెల్లడించింది. ఈ మేరకు టాప్‌-100 జాబితాను వెలువరించింది. ఈ జాబితాలో అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ అగ్రస్థానంలో నిలవగా.. ముకేశ్‌ అంబానీ రెండోస్థానంలో నిలిచారు. నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుణీ నాయర్‌ తొలిసారి ఈ జాబితాలో చోటు దక్కించుకోగా.. పేటీఎం సీఈఓ విజయ్‌ శేఖర్‌ శర్మ తన స్థానాన్ని కోల్పోయారు.

అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ సంపద మొత్తం 150 బిలియన్‌ డాలర్లు (రూ. 1,211,460.11 కోట్లు)గా ఫోర్బ్స్‌ పేర్కొంది. టాప్‌-100 కుబేరుల మొత్తం సంపద విలువ పెరగడంలో అదానీ పాత్ర కీలకమని తెలిపింది. ఆయన సంపద ఈ ఒక్క ఏడాదిలోనే రెట్టింపైందని ఫోర్బ్స్‌ వెల్లడించింది. ఈ జాబితాలో ముకేశ్‌ అంబానీ రెండో స్థానంలో నిలిచారు. ఆయన మొత్తం సంపద 88 బిలియన్‌ డాలర్లు (రూ.710,723.26 కోట్లు)గా ఉందని ఫోర్బ్స్‌ పేర్కొంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆయన సంపద 5 శాతం మేర తగ్గినట్లు తెలిపింది. టాప్‌-100 మొత్తం సంపదలో అదానీ, అంబానీ వాటానే దాదాపు 30 శాతంగా ఉండటం గమనార్హం.

ఇక ఈ జాబితాలో నైకా ఫ్యాషన్స్‌ వ్యవస్థాపకురాలు ఫల్గుణీ నాయర్‌ తొలిసారి చోటు దక్కించుకున్నారు. వేదాంత ఫ్యాషన్స్‌ వ్యవస్థాపకుడు రవి మోదీ, మెట్రో బ్రాండ్‌ వ్యవస్థాపకుడు రఫిక్‌ మాలిక్‌ సైతం తొలిసారి ఈ జాబితాలో చోటు సాధించారు. రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా మరణంతో ఆయన భార్య రేఖ ఝున్‌ఝున్‌వాలా పేరు ఈ జాబితాలో చేరింది. వీరితో పాటు ఆనంద్‌ మహీంద్రా, బర్దేశ్‌ షా, జాయ్‌ అలుక్కాస్‌ వంటి వారు తిరిగి ఈ జాబితాలో చోటు సాధించారు. పేటీఎం షేర్లు పడిపోయిన నేపథ్యంలో పేటీఎం సీఈఓ విజయ్‌ శేఖర్‌ శర్మ ఈ జాబితాలో చోటు కోల్పోయారు.

భారత్‌లో కుబేరుల సంపద
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.