ETV Bharat / business

ఫిన్‌టెక్‌ భాగస్వామ్యంతో బ్యాంకుల రుణాలు!

author img

By

Published : Jun 27, 2022, 7:30 AM IST

fintech companies
fintech companies

Finance ministry on fintech: ఫిన్‌టెక్‌ సంస్థలతో కలిసి రుణాలు ఇచ్చే (కో-లెండింగ్‌) అవకాశాలను పరిశీలించాల్సిందిగా ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆర్థిక శాఖ ఆదేశించింది. రుణ వృద్ధి కోసం సాంకేతికత వినియోగం, డేటా అనలిటిక్స్‌పై దృష్టి పెట్టాల్సిందిగా సూచించింది.

Finance ministry on fintech: వ్యాపార విస్తరణ కోసం ఫిన్‌టెక్‌ సంస్థలతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు వాటితో కలిసి రుణాలు ఇచ్చే (కో-లెండింగ్‌) అవకాశాలను పరిశీలించాల్సిందిగా ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆర్థిక శాఖ ఆదేశించింది. రుణ వృద్ధి కోసం సాంకేతికత వినియోగం, డేటా అనలిటిక్స్‌పై దృష్టి పెట్టాల్సిందిగా సూచించింది. ఇటీవల ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు సమీక్ష అనంతరం ఆర్థిక శాఖ ఈ ఆదేశాలు ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మోసాల నియంత్రణకు సైబర్‌ భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయాల్సిందిగా ఆదేశించింది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంతో పాటు అంతర్జాతీయ పరిణామాల వల్ల సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో, ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి ఉత్పత్తి రంగాలకు రుణాలు మంజూరు చేయాల్సిందిగా సూచించినట్లు తెలుస్తోంది.

  • ఆర్‌బీఐ తాజా గణాంకాల ప్రకారం.. ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణాల వృద్ధి 2021 మార్చిలో 3.6 శాతం కాగా, 2022 మార్చి చివరకు 7.8 శాతానికి పెరిగాయి. బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర స్థూల అడ్వాన్సులు 26 శాతం పెరిగి రూ.1,35,240 కోట్లుగా నమోదయ్యాయి. డిపాజిట్లు 16.26 శాతం పెరిగి రూ.2,02,294 కోట్లకు చేరాయి. ఎస్‌బీఐ 10.27 శాతం, యూనియన్‌ బ్యాంక్‌ 9.66 శాతం మేర రుణాల వృద్ధి నమోదు చేశాయి.
  • డిపాజిట్ల విషయానికొస్తే యూనియన్‌ బ్యాంక్‌ 11.99 శాతం (రూ.10,32,102 కోట్లు), ఇండియన్‌ బ్యాంక్‌ 10 శాతం (రూ.5,84,661 కోట్లు) చొప్పున వృద్ధి చెందాయి.
  • నికర నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏలు) పరిష్కార ప్రక్రియలను వేగవంతం చేయాలని, మొండి బకాయిల వసూళ్లపై దృష్టి పెట్టాల్సిందిగా బ్యాంకులను ఆదేశించినట్లు సమాచారం. రూ.100 కోట్ల పైబడిన ఎన్‌పీఏలపై బ్యాంకుల అధిపతులతో ఆర్థిక శాఖ సమీక్షించింది.
  • వరుసగా రెండో ఆర్థిక సంవత్సరంలోనూ ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభాలు నమోదుచేశాయి. 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభం 2020-21లో రూ.31,820 కోట్లుగా ఉండగా.. 2021-22లో రెట్టింపై రూ.66,539 కోట్లకు పెరిగింది. అంతకు ముందు 2015-16 నుంచి 2019-20 మధ్య వరుసగా అయిదేళ్ల పాటు నష్టాలు మూటగట్టుకున్నాయి. 2016-17లో రూ.11,389 కోట్లు, 2015-16లో రూ.17,993 కోట్లు, 2019-20లో రూ.25,941 కోట్లు, 2018-19లో రూ.66,636 కోట్లు, 2017-18లో అత్యధికంగా రూ.85,370 కోట్ల చొప్పున నష్టాలు చవిచూశాయి.

ఇదీ చదవండి: నెలకు రూ.లక్ష రావాలంటే.. ఎక్కడ పెట్టుబడి పెట్టాలి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.