క్రెడిట్ కార్డ్​ ఈఎంఐతో లాభమా, నష్టమా?

author img

By

Published : Sep 13, 2022, 3:23 PM IST

credit card emi good or bad

Credit card EMI good or bad : ఈఎంఐలుగా మార్చుకొన్న క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై ఎలాంటి రివార్డ్ పాయింట్‌లు లేదా అదనపు తగ్గింపులు ఉండవు. అలాంటప్పుడు కోల్పోతున్న ప్రయోజనాల విలువను.. ఈఎంఐ మార్గాన్ని ఎంచుకోకుంటే వచ్చే లబ్ధిని సరిపోల్చుకోవాలి. ఒకవేళ ఈఎంఐ లేకుండా వచ్చే ఆఫర్‌లపై మీరు ఎక్కువ ఆదా చేసుకోగలరేమో పరిశీలించుకోవాలి.

Is credit card EMI good : చాలా మంది క్రెడిట్‌ కార్డు ద్వారా చేసే చెల్లింపులను ఈఎంఐల కిందకు మార్చుకుంటారు. ఫలితంగా కొంత ఆర్థిక భారాన్ని తగ్గించుకుంటారు. ముందుగా చెల్లించే బదులు కొన్ని నెలల పాటు వాయిదాల రూపంలో బకాయిలను చెల్లించే వెసులుబాటు ఉండడమే దీనికి కారణం. పూర్తి లేదా పాక్షిక బిల్లును ఈఎంఐలుగా మార్చుకోవచ్చు. జేబుపై భారం లేకుండా పెద్ద పెద్ద కొనుగోళ్లు చేయొచ్చు. ఇది సౌకర్యవంతమైన మార్గమైనప్పటికీ.. తప్పనిసరిగా పరిగణించవలసిన కొన్ని అంశాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..

ఛార్జీలను సరిపోల్చుకోవాలి: క్రెడిట్ కార్డు ఈఎంఐలు వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు, ప్రీపేమెంట్ / ఫోర్‌క్లోజర్ మొదలైన నిర్దిష్ట ఛార్జీలకు లోబడి ఉంటాయి. ప్రాసెసింగ్ ఫీజు 0-3 శాతం వరకు ఉంటుంది. ఇది ఒకసారి మాత్రమే చెల్లించాలి. కాలపరిమితికి ముందే పూర్తిగా లేదా పాక్షికంగా రుణం చెల్లించాలనుకుంటే ముందస్తు చెల్లింపు ఛార్జీలు వర్తిస్తాయి. ఈఎంఐలపై కూడా వడ్డీ ఉంటుంది. ఇవన్నీ కార్డు జారీ చేసే సంస్థలు, కార్డు రకాన్ని బట్టి మారుతూ ఉంటాయి. మీకు ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ కార్డులు ఉంటే.. వాటి మధ్య ఛార్జీలను సరిపోల్చుకోవాలి. దేంట్లో తక్కువ రుసుములు ఉంటే వాటిని ఈఎంఐ చెల్లింపులకు ఎంచుకోవాలి.

అనువైన కాలపరిమితిని ఎంచుకోవాలి:
సాధారణంగా, క్రెడిట్ కార్డు జారీ చేసేవారు రుణ కాలపరిమితి ఎక్కువ ఉంటే తక్కువ వడ్డీ రేటును అందిస్తారు. అయితే, సుదీర్ఘ కాలపరిమితిని ఎంచుకునేటప్పుడు.. ముందుగా ఆ వ్యవధిలో చెల్లించే వడ్డీ మొత్తాన్ని లెక్కించాలి.

ఉదాహరణకు..
మీరు రూ.10,000 క్రెడిట్‌ కార్డు బిల్లును ఈఎంఐగా మార్చుకున్నారనుకుందాం. ఇక్కడ 3 నెలల కాలవ్యవధికి వడ్డీ రేటు 20 శాతం. అదే 12 నెలలకు ఇది 18 శాతం. అప్పుడు మీరు దిగువన తెలిపిన విధంగా బిల్లు చెల్లించాల్సి ఉంటుంది.

  • 3 నెలల ప్లాన్‌పై చెల్లించే వడ్డీ : రూ.335; నెలకు రూ.3,445 ఈఎంఐ చెల్లించాలి.
  • 12 నెలల ప్లాన్‌పై చెల్లించే వడ్డీ: రూ.1,002; నెలకు రూ.917 ఈఎంఐ చెల్లించాలి.

అందుకే కాలపరిమితిని మీ వెసులుబాటుకు అనుగుణంగా ఎంచుకోవాలి. తక్కువ వడ్డీ రేటు వల్ల మీకు డబ్బు ఆదా అవుతుంది అనుకుంటే పొరపాటే. కానీ, పైన తెలిపినట్లు నెలకు రూ.3,445 ఈఎంఐ చెల్లించే సామర్థ్యం లేకపోతే.. దీర్ఘకాల కాలపరిమితిని ఎంచుకోక తప్పదు.

రివార్డు/రాయితీ ప్రయోజనాల విలువ: సాధారణంగా ఈఎంఐలుగా మార్చుకొన్న లావాదేవీలపై ఎలాంటి రివార్డ్ పాయింట్‌లు లేదా అదనపు తగ్గింపులు ఉండవు. అలాంటప్పుడు కోల్పోతున్న ప్రయోజనాల విలువను.. ఈఎంఐ మార్గాన్ని ఎంచుకోకుంటే వచ్చే లబ్ధిని సరిపోల్చుకోవాలి. ఒకవేళ ఈఎంఐ లేకుండా వచ్చే ఆఫర్‌లపై మీరు ఎక్కువ ఆదా చేసుకోగలరేమో పరిశీలించుకోవాలి. అయితే, కొన్ని సంస్థలు వాయిదాలుగా మార్చుకున్నప్పటికీ.. క్యాష్‌బ్యాక్/రివార్డ్‌లను అందిస్తున్నాయి. ఒకటి కంటే ఎక్కువ కార్డులు ఉన్నట్లయితే, ఈఎంఐ ఎంపికతో పాటు ఇతర రివార్డ్‌లు, ప్రయోజనాలను అందించే కార్డును ఎంచుకోవాలి.

క్రెడిట్‌ పరిమితి తగ్గుతుంది:
Credit card EMI credit limit : మీరు క్రెడిట్ కార్డు బిల్లును ఈఎంఐ కిందకు మార్చుకుంటే.. అంత మొత్తంలో మీ క్రెడిట్‌ పరిమితి తగ్గుతుంది. అయితే, వాయిదాలను చెల్లిస్తూ ఉంటే ఇది మళ్లీ పెరుగుతుంది. అందుకే ఈఎంఐలు పూర్తయ్యే వరకు తక్కువ క్రెడిట్ పరిమితితో సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది.

నిస్సందేహంగా, క్రెడిట్‌ కార్డులు అందించే అనేక ప్రయోజనాల్లో ఈఎంఐ ఆప్షన్‌ అత్యుత్తమైనదని చెప్పొచ్చు. చేతిలో తగినంత నగదు లేనప్పుడు వాయిదాల మార్గం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతినెలా కొంత మొత్తం చెల్లించడం వల్ల ఎగవేత ముప్పు తప్పుతుంది. అయితే, పైన పేర్కొన్న అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ మార్గాన్ని ఎంచుకోవాలి. అప్పుడే అందే ప్రయోజనాలు మరింత మెరుగవుతాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.