ETV Bharat / business

అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా?.. ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి!

author img

By

Published : Apr 21, 2023, 3:20 PM IST

అక్షయ తృతీయకు బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే కొనుగోలు చేసే ముందు కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి.

బంగారం కొనుగోలు జాగ్రత్తలు
gold-purchase-tips-gold-purchase-precautions

పండగలు, శుభకార్యాల వేళ భారతీయులకు బంగారం కొనుగోలు చేయడం అలవాటే. బంగారం కొనుగోలుకు అక్షయ తృతీయ, ధన త్రయోదశి వంటి మంచి రోజులను శుభప్రదంగా భావిస్తారు. ఆ రోజుల్లో పసిడి కొనుగోలు చేస్తే సిరిసంపదలు కలుగుతాయన్నది విశ్వాసం. పైగా 10-15 శాతం పోర్ట్‌ఫోలియోలో.. తమ పెట్టుబడిని బంగారంలో మదుపు చేయడం కూడా మంచిదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అక్షయ తృతీయ ఏప్రిల్‌ 22న వస్తోంది. బంగారు ఆభరణ దుకాణాలు ఇప్పటికే పలు రకాల ఆఫర్లతో ఆకట్టుకుంటున్నాయి. మీరు కూడా అక్షయ తృతీయ రోజు బంగారం కోనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే.

ధరపై లుక్కేయండి..
బంగారం కొనుగోలు చేసే ముందు మొదట దాని ధర తెలుసుకోవాలి. ఎప్పుడూ పసిడి ధర స్థిరంగా ఉండదు. తక్కువ కాలంలోనే చాలా హెచ్చుతగ్గులు ఉంటాయి. అంతర్జాతీయంగా కలిగే పలు పరిణామాల రీత్యా బంగారం ధర మారుతుంటుంది. అలాగే దేశం మొత్తం కూడా ఒకే విధంగా ఉండ‌దు. ఒక్కో నగరంలో ఒక్క విధంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి పసిడి కొనే ముందు బంగారం ధరను ఒకట్రెండు షాపుల్లో ఆరా తీయడం మంచిది. విశ్వసనీయ వెబ్‌సైట్లలో కూడా బంగారం ధర గురించి సమాచారం దొరుకుతుంది.

స్వచ్ఛతను చూడండి..
బంగారం కొనే సమయంలో తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం.. దాని స్వచ్ఛత. బంగారం నాణ్యతను క్యారెట్లలో కొలుస్తారు. 24 క్యారెట్ల బంగారాన్ని స్వచ్ఛమైన బంగారంగా చెబుతారు. ప్రస్తుతం మనం కొనే బంగారు అభరణాలు 22 క్యారెట్లవి. కనుక ధర చేసే సమయంలో 22 క్యారెట్ల బంగారాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఒకవేళ 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారమే కావాలనుకుంటే.. కాయిన్లు, బార్ల రూపంలో కొనుగోలు చేయాలి.

హాల్ మార్కింగ్ తప్పనిసరి..
ఆభ‌ర‌ణాల‌ను పూర్తిగా బంగారంతోనే త‌యారు చేయ‌డం సాధ్యం కాని పని. అందువ‌ల్ల బంగారంతో ఇత‌ర లోహాల‌ను క‌లిపి ఆభ‌ర‌ణాల‌ను త‌యారు చేస్తారు. ఈ లోహాలు ఎంత వ‌ర‌కు క‌లిపారనే విషయం దానిపై ఆ న‌గ స్వచ్ఛతపై ఆధారపడి ఉంటుంది. గుర్తు బంగారు ఆభ‌ర‌ణాల స్వచ్ఛతను హాల్‌మార్క్ తెలియ‌జేస్తుంది. వినియోగదారుడు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు మోసపోకుండా భారత ప్రభుత్వం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(BIS)ను ఏర్పాటు చేసింది. మీరు కొనే బంగారు ఆభరణం కచ్చితంగా బీఐఎస్ హాల్ మార్క్‌ కలిగి ఉండాలి. పసిడి ఆభరణాలను ఏప్రిల్‌ 1 నుంచి.. 6 అంకెల హెచ్‌యూఐడీ (హాల్‌మార్క్‌ యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌)తో విక్రయించడాన్ని బీఐఎస్‌ తప్పనిసరి చేసింది. ఒకవేళ మీకు బంగారు హాల్‌మార్క్‌పై మీకేమైన ఫిర్యాదులు ఉంటే నేరుగా బీఐఎస్‌ను సంప్రదించొచ్చు.

తయారీ రుసుములు..
త‌యారీ రుసుములు.. దుకాణాదారుడు, ఆభరణం డిజైన్, తయారుచేసే వ్యక్తుల ఆధారంగా మారుతూ ఉంటుంది. బంగారాన్ని కాయిన్ రూపంలో కొనుగోలు చేసిన తరువాత.. దాన్ని ఆభరణంగా తయారు చేసేందుకు 8 నుంచి 16 శాతం వ‌ర‌కు తయారీ ఛార్జీలు విధిస్తారు. ఇది కొంచెం తరుగు రూపంలోను మరికొంచెం తయారీ రుసుము గానూ.. మీ నుంచి వసూలు చేస్తారు. బంగారం ఆభరణంలో తయారు చేసే సమయంలో కొంత బంగారం వృథా అవుతుంది. దీన్నే వేస్టేజ్​ లేదా తరుగు అంటారు. ఆభరణం తయారీకి వసూలు చేసే మొత్తాన్ని మజూరీగా పిలుస్తారు. ఇది ఆభరణాన్ని బట్టి ఇది మారుతుంటుంది.

కొనుగోలుకు మార్గాలు..
బంగారం ఆభరణాల కొనేందుకు పలు మార్గాలు ఉన్నాయి. సాధారణంగా బ్రాండెడ్ ఆభరణాల షోరూమ్‌లో గానీ లేదంటే స్థానిక స్వర్ణకారుడి వద్ద నుంచి ప్రజలు బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తుంటారు. అయితే, బంగారాన్ని బార్ల రూపంలో, కాయిన్ల రూపంలో కొనుగోలు చేయాలనుకుంటే.. ఇందుకు కొన్ని వెబ్‌సైట్స్‌, ఎంఎంటీసీ వంటి మరికొన్ని మార్గాలు ఉన్నాయి. బ్యాంకులను సంప్రదించి కూడా గోల్డ్ కాయిన్‌ కొనుగోలు చేయవచ్చు. 24 క్యారెట్ల వేరు వేరు విలువ కలిగిన గోల్డ్ కాయిన్లను చాలా బ్యాంకులు విక్రయిస్తున్నాయి.

విక్రయించడానికి వీలుగా..
బంగారు ఆభరణాలను కొనుగోలు సమయంలో తయారీ ఛార్జీలు, ప్రాఫిట్ మార్జిన్, జీఎస్టీ వంటివి వ‌ర్తిస్తాయి. తిరిగి అమ్మేటప్పుడు మాత్రం ఇవేవే తిరిగి రావనేది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. పైగా పాత బంగారానికి తరుగు రూపంలో కొంత త‌గ్గించే అవ‌కాశం కూడా ఉంటుంది. సాధార‌ణంగా రాళ్లు ఉన్న ఆభ‌ర‌ణాల‌లో ఎక్కువ తరుగు ఉంటుంది. కాబట్టి రాళ్లు ఎక్కువ‌గా లేని ఆభ‌రణాల‌ను కొనుగోలు చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి. పెట్టుబడికి బంగారాన్ని కొనుగోలు చేసేవారు కాయిన్లు, బార్ల రూపంలో కొనడం మంచిది. గోల్డ్‌ ఈటీఎఫ్‌లు, సార్వభౌమ పసిడి పథకాలు వంటి ద్వారా డిజిట‌ల్‌గా బంగారం కొనడాన్ని పరిశీలించాలి. అక్షయ తృతీయ సందర్భంగా కొన్ని పెద్ద పెద్ద షోరూంలు ఇప్పటికే ఆఫర్లు ప్రకటించాయి. బంగారం కొనుగోలు చేసే ముందు ఆ ఆఫర్లు అన్నింటిని ఒకసారి పరిశీలించడం మంచింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.