ETV Bharat / business

అదానీ 'ఎంట్రీ'తో రాధిక, ప్రణయ్ రాజీనామా.. ట్రేడింగ్​లో దూసుకెళ్లిన NDTV షేరు

author img

By

Published : Nov 30, 2022, 1:27 PM IST

ఎన్​డీటీవీ ప్రమోటర్ గ్రూప్ ఆర్ఆర్​పీఆర్​కు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ రాజీనామా చేశారు. వారి స్థానంలో ముగ్గురు కొత్త డైరెక్టర్లను అదానీ గ్రూప్​నకు చెందిన ఆర్ఆర్​పీఆర్ బోర్డు నియమించింది. ఈ పరిణామాల మధ్య ట్రేడింగ్​లో ఎన్​డీటీవీ షేరు దూసుకెళ్లింది.

adani-group-ndtv-takeover
adani-group-ndtv-takeover

ప్రముఖ వార్తా సంస్థ న్యూదిల్లీ టెలివిజన్(ఎన్​డీటీవీ) ప్రమోటర్ గ్రూప్ అయిన 'ఆర్ఆర్​పీఆర్​'కు ఎన్​డీటీవీ వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్, ఆయన భార్య రాధికా రాయ్​ రాజీనామా చేశారు. స్టాక్ మార్కెట్ ఫైలింగ్​ ద్వారా ఈ విషయం వెల్లడైంది. వీరి స్థానంలో సుదీప్త భట్టాచార్య, సంజయ్ పుగాలియా, సెంథిల్ సినియా చెంగల్​వరయన్​ను డైరెక్టర్లుగా నియమించేందుకు ఆర్ఆర్​పీఆర్ బోర్డు మంగళవారం ఆమోదం తెలిపింది.

ఆర్ఆర్​పీఆర్​ సంస్థను అదానీ గ్రూప్ ఇప్పటికే టేకోవర్ చేసుకుంది. ఎన్​డీటీవీలో ఆర్ఆర్​పీఆర్​కు 29.18 శాతం, ప్రణయ్, రాధిక వద్ద 32.26 శాతం వాటాలు ఉన్నాయి. ప్రణయ్ రాయ్ ప్రస్తుతం.. ఎన్​డీటీవీ ఛైర్​పర్సన్​గా ఉన్నారు. రాధికా రాయ్.. ఛానల్​కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్​గా వ్యవహరిస్తున్నారు. అయితే, న్యూస్ ఛానల్ బోర్డు నుంచి మాత్రం వీరిద్దరూ తప్పుకోలేదు.

షేరు రయ్ రయ్
మరోవైపు, స్టాక్ మార్కెట్​లో ఎన్​డీటీవీ షేరు జోరు కొనసాగుతోంది. బుధవారం మరో 5 శాతం ఎగబాకి.. అప్పర్ సర్క్యూట్​ను తాకింది. ప్రస్తుతం బీఎస్​ఈలో కంపెనీ షేరు విలువ రూ.447.50కు చేరగా.. ఎన్​ఎస్​ఈలో రూ.446.30గా ఉంది. ఐదు రోజుల్లో ఎన్​డీటీవీ షేరు 24.74 శాతం వృద్ధి సాధించింది.

ఎన్​డీటీవీ ప్రమోటర్‌ కంపెనీ అయిన ఆర్ఆర్​పీఆర్ హోల్డింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు విశ్వప్రధాన్‌ కమర్షియల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.403.85 కోట్లు రుణం ఇచ్చింది. తర్వాతి కాలంలో వీసీపీఎల్ యాజమాన్యం చేతులు మారి.. అదానీ గ్రూప్‌నకు చెందిన సంస్థ దాన్ని కొనుగోలు చేసింది. ముందస్తుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం.. రుణాన్ని 29.18 శాతం వాటాగా మార్చుకొని ఎన్​డీటీవీలో అదానీ గ్రూప్‌ వాటాలు పొందింది. దీనికి అదనంగా 26 శాతం వాటా కొనుగోలు కోసం ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఈ ఆఫర్‌ పూర్తయితే ఎన్​డీటీవీలో మెజార్టీ వాటాదారుగా అదానీ గ్రూప్ అవతరిస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.