ETV Bharat / business

'రూ.4 లక్షల కోట్ల వ్యవసాయ ఎగుమతులు.. పెరిగిన రైతుల ఆదాయం!'

author img

By

Published : Jul 18, 2022, 3:04 AM IST

Updated : Jul 18, 2022, 6:30 AM IST

ఎస్‌బీఐ
ఎస్‌బీఐ

SBI research: దేశంలో రైతుల ఆర్థిక పరిస్థితి ఇటీవలి కొన్నేళ్లలో మెరుగుపడిందని ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక తెలిపింది. 2017-18తో పోలిస్తే 2021-22 లో రైతుల ఆదాయం సగటున 1.3 - 1.7 రెట్ల మేర పెరిగినట్లు వెల్లడించింది.

SBI research: దేశంలో అన్నదాతల ఆర్థిక పరిస్థితి ఇటీవలి కొన్నేళ్లలో మెరుగుపడిందని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) రీసెర్చ్‌ నివేదిక వెల్లడించింది. 2017-18తో పోలిస్తే 2021-22 లో రైతుల ఆదాయం సగటున 1.3 - 1.7 రెట్ల మేర పెరిగినట్లు తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో మన వ్యవసాయ ఎగుమతులు రూ.4 లక్షల కోట్ల మేర జరిగాయని వెల్లడించింది. ప్రత్యేకించి కొన్ని రాష్ట్రాల్లో నిర్దిష్ట పంటలు సాగు చేసే రైతులకు రాబడి, రెట్టింపు కంటే ఎక్కువయిందని నివేదించింది. మహారాష్ట్రలో సోయాబీన్‌, కర్ణాటకలో పత్తి సాగు చేసేవారిని ఇందుకు ఉదాహరణగా పేర్కొంది.

ఈ నివేదికలోని ముఖ్యాంశాలివీ..

* 2017-18లో దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 14.2%గా ఉన్న వ్యవసాయ రంగ వాటా.. 2021-22లో 18.8 శాతానికి పెరిగింది. కొవిడ్‌ రెండోదశ ఉద్ధృతి కారణంగా పారిశ్రామిక, సేవారంగాల వాటా జీడీపీలో తగ్గడమూ, సాగు రంగం వాటా బాగా పెరిగినట్లు కనిపించడానికి ఓ కారణమే.

* మెజారిటీ రాష్ట్రాల్లో రైతుల వ్యవసాయేతర/అనుబంధ ఆదాయంలో 1.4 నుంచి 1.8 రెట్ల వరకు పెరుగుదల నమోదైంది.

* 2020-21లో దేశ ఆర్థిక వ్యవస్థ 6.6% కుంచించుకుపోగా.. వ్యవసాయ రంగంలో వృద్ధి కొనసాగింది. 2021-22లోనూ రైతుల ఆదాయాల్లో వృద్ధి కొనసాగింది. గత ఆర్థిక సంవత్సరం వ్యవసాయ ఎగుమతుల విలువ 5 వేల కోట్ల డాలర్ల (సుమారు రూ.4 లక్షల కోట్ల)కు చేరింది.

* విధానాల పరంగా ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుతో పాటు ప్రజల ఆహారపు అలవాట్లలో మార్పులు.. ముఖ్యంగా పోషకాహారంపై శ్రద్ధ పెరగడం, పంట మార్పిడిపై అన్నదాతలు ఆసక్తి చూపడం వంటి అంశాలు సాగురంగ అభ్యున్నతికి దోహదపడ్డాయి.

* 2014 నుంచి ఇప్పటివరకు చూస్తే కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)లు 1.5 రెట్ల నుంచి 2.3 రెట్ల వరకు పెరిగాయి. రైతుల ఆదాయం పెరిగేందుకు అది మరో ప్రధాన కారణం.

* 2014-2022 మార్చి మధ్య అర్హులైన 3.7 కోట్ల మంది రైతుల్లో సగం మందికే రుణమాఫీ సొమ్ము అందింది. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం 90% మందికి పైగా దక్కింది.

* ఇప్పటివరకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డు (కేసీసీ) పథకంతో పెద్దసంఖ్యలో రైతులు వడ్డీ రాయితీతో కూడిన రుణాలు పొందారు. గ్రామీణ కుటుంబాల కార్యకలాపాలన్నింటికీ దోహదపడేలా బహుళ ప్రయోజనకర రుణాలు అందించేందుకు జీవనోపాధి రుణ కార్డులను అందజేసే దిశగా కేంద్రం ఆలోచించాలి.

* ఆహార పంటలు సాగు చేసేవారితో పోలిస్తే.. వాణిజ్య పంటలు వేసే రైతుల ఆదాయం ఎక్కువగా పెరిగిందని ఎస్‌బీఐ ముఖ్య ఆర్థికవేత్త సౌమ్య ఘోష్‌ తెలిపారు.

ఇవీ చదవండి: 'పెరుగుతున్న గిరాకీ.. ఎంఎన్​సీల చూపు భారత్​ వైపు.. 2030 నాటికి అలా..'

సామాన్యుడిపై మరో పిడుగు.. నిత్యావసర ధరలు పైపైకి.. పాలు, పెరుగు సహా..

Last Updated :Jul 18, 2022, 6:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.