ETV Bharat / business

షార్ట్​ టర్మ్​లో స్టాక్​ మార్కెట్లకు ఈ 5 అంశాలే కీలకం!

author img

By

Published : Oct 31, 2020, 10:15 AM IST

దేశీయ స్టాక్ మార్కెట్లు కరోనా సంక్షోభం మొదట్లో భారీ నష్టాలను నమోదుచేశాయి. క్రమంగా మళ్లీ పుంజుకొని దాదాపు పూర్వ స్థితికి చేరుకున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వివిధ కారణాల వల్ల స్వల్ప, మధ్యస్థ కాలాల్లో హెచ్చుతగ్గులను ఎదుర్కోనున్నాయి సూచీలు. సమీప భవిష్యత్తులో మార్కెట్లపై ప్రభావం చూపే అంశాలు మీకోసం..

stock marekts
మార్కెట్లు

కరోనా వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు ఎన్నడూ లేని విధంగా పడిపోయాయి. కొద్ది నెలల వ్యవధిలో క్రమంగా పుంజుకొని ఆంగ్ల అక్షరం 'వీ' ఆకారంలో రికవరీ అయ్యాయి. లాక్​డౌన్ ప్రారంభంలో వచ్చిన నష్టాలను అధిగమిస్తూ కరోనా విపత్తు ముందు స్థాయికి సూచీలు చేరుకున్నాయి.

కరోనా ప్రారంభ నష్టాల నుంచి రికవరీ అయినప్పటికీ మార్కెట్లు స్వల్ప, మధ్యస్థ కాలానికి ఇంకా హెచ్చుతగ్గుల్లోనే ఉండనున్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి.

వచ్చే నెలల్లో నిఫ్టీ, సెన్సెక్స్ గమనాన్ని ప్రభావితం చేసే ఐదు అంశాలను చూద్దాం.

1. అమెరికా ఎన్నికలు

మరికొన్ని రోజుల్లో అమెరికా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అంతర్జాతీయ మదుపర్లు వేచి చూసే ధోరణిలో పడ్డారు. అయితే ఎన్నికల అనంతరం కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముంది.

"డొనాల్డ్ ట్రంప్ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియపై అనుమానాలను వ్యక్తపరిచారు. ఆయన ఓడిపోతే ఎన్నికల ఫలితాలను వ్యతిరేకించే అవకాశం ఎక్కువగా ఉంది. ఎన్నికలు అయిన తర్వాత చాలా రోజుల వరకు ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం లేదు."

- సాక్షి గుప్తా, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ ట్రెజరీ ఎకనామిక్ రీసెర్చ్​

ఇటీవల విడుదల చేసిన మార్కెట్ అవుట్​లుక్ నివేదికలోనూ ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేసింది సామ్ కో సెక్యూరిటీస్.

"అమెరికా ఎన్నికల వ్యవస్థపై వివాదం ఎక్కువ కాలం కొనసాగితే రెండో దశ ఉపశమన ప్యాకేజీ ఇంకా ఆలస్యం అవుతుంది. దీనివల్ల మరోసారి మార్కెట్​లో ఉండాల్సిన లిక్విడిటీ తగ్గిపోవటం వల్ల అంతర్జాతీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడుతుంది. భారతదేశంలో దేశీయ మార్కెట్లలో స్వల్ప కాలంలో లాభాల స్వీకరణ జరిగి, సూచీలు సమాంతరంగా కదలవచ్చు. దీనివల్ల ఈ సంవత్సరం చివరిలోపు సూచీలు కొత్త గరిష్ఠాలను తాకే అవకాశాలు తక్కువ. దీనికి బదులు ఎక్కువ స్థాయిలో లాభాల స్వీకరణ దిగే అవకాశం ఉంది" అని నివేదిక పేర్కొంది.

2. కరోనా కేసుల పెరుగుదల

ఐరోపాలో కేసుల పెరుగుదల, దానివల్ల ఆర్థిక వృద్ధి నెమ్మదిస్తుందన్న భయాలతో గత నెల నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు జాగ్రత్త వహిస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలలో ఆంక్షలు.. దేశీయ మార్కెట్లకు ప్రధాన అవరోధంగా పరిగణిస్తారు. దీనివల్ల వినియోగదారుల పరిమిత వ్యయం, ఉద్యోగ నష్టాల భయాలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఈ పరిణామం ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడదు.

కరోనా గ్రాఫ్​ను నిర్ణయించటంలో వచ్చే మూడు నెలల కీలకంగా మారనున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కూడా అన్నారు.

3. వ్యాక్సిన్​పై ఆశలు

కరోనా వైరస్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ స్థాయికి చేరుకున్నప్పుడు అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లన్నీ మెరుగైన ప్రదర్శన చేశాయి. అయితే వ్యాక్సిన్​పై ఇంకా ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి మార్కెట్ల గమనం సాగనుంది.

"వ్యాక్సిన్ అభివృద్ధిపై తదుపరి ప్రకటనలు కొంత ఆలస్యం కానున్నాయి. టీకా అభివృద్ధిలో ఏదైనా అవరోధాలు కలిగితే ఈక్విటీ మార్కెట్లకు పెద్ద రిస్క్​గా మారనుంది" అని సాక్షి గుప్తా అభిప్రాయపడ్డారు.

4. ఆర్థిక పరిస్థితి

ఆర్థిక లోటు చేజారిపోవటం ఈక్విటీ మార్కెట్లకు పెద్ద రిస్క్​గా ఉండనుంది. ఆర్​బీఐ మంగళవారం నాడు విడుదల చేసిన నివేదికలో రాష్ట్రాల ఉమ్మడి ఆర్థిక లోటు 2020-21 ఆర్థిక సంవత్సరంలో 4 శాతానికి చేరనున్నట్లు అంచనా వేసింది. బడ్జెట్​లో దీని అంచనా 2.8 శాతం మాత్రమే. రెవెన్యూ తగ్గటం, వ్యయాలు పెరగటమే ఇందుకు కారణమని ఆర్​బీఐ తెలిపింది.

మరోవైపు ఆర్థిక వృద్ధికి సహాయపడేందుకు ఇంకో ఉపశమన ప్యాకేజీపై ప్రభుత్వం పనిచేస్తోన్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే పలు సంకేతాలు ఇచ్చారు. డిమాండ్ పెంచేందుకు తీసుకున్న ఏ చర్యలైనా మార్కెట్లపై అనుకూల ప్రభావం కనబరుస్తాయి.

5. బిహార్ ఎన్నికలు

బిహార్ ఎన్నికల ఫలితాలు దేశంలో పెట్టుబడిదారుల సెంటిమెంట్​ను ప్రభావితం చేస్తాయి. మొదటి విడత ఎన్నికలు గురువారం జరిగాయి. ప్రధాన పోటీ భాజపా సారథ్యంలోని ఎన్​డీఏ, మహాకూటమి మధ్య ఉంది.

చరిత్రను చూస్తే.. అధికారంలో ఉన్న ఎన్​డీఏకు బిహార్ ఎన్నికలలో ఎదురుదెబ్బ తగిలినా, లేక మిశ్రమ స్పందన వచ్చినా.. స్టాక్ మార్కెట్లు సానుకూలంగా స్పందించవు. ఆ ఫలితాలు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంస్కరణల అజెండాపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: 'పంట, ట్రాక్టర్ రుణాలకు చక్రవడ్డీ మాఫీ వర్తించదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.