ETV Bharat / business

18 ఏళ్ల కనిష్ఠం నుంచి కోలుకున్న చమురు ధర

author img

By

Published : Mar 31, 2020, 1:15 PM IST

OIL-MARKET
చమురు ధర

వరుసగా పతనమవుతున్న చమురు ధరలు నేడు భారీగా పుంజుకున్నాయి. కరోనా వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ప్రపంచ దేశాలు ఉద్దీపన చర్యలు చేపట్టడం వల్ల ఇంధన మార్కెట్లు కోలుకున్నాయి.

చమురు ధరలు సోమవారం రికార్డు పతనం తర్వాత నేడు భారీగా పెరిగాయి. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ చమురు ధర బ్యారెల్ కు 7.3 శాతం బలపడి 21.5 డాలర్లకు చేరుకుంది. బ్రెంట్ క్రూడ్ ధర 3.3 శాతం పెరిగి 23.5 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

కరోనా వైరస్ కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వాలు ఉద్దీపన చర్యలు చేపట్టడం వల్ల మదుపరుల సెంటిమెంటు బలపడింది. పెట్టుబడిదారులకు అందుబాటు ధరల్లోకి చమురు దిగిరావటం, అమెరికాలో 2 ట్రిలియన్ల డాలర్ల ప్యాకేజీ ఆమోదం లభించటమూ సహకరించాయి.

పుతిన్​కు ట్రంప్ ఫోన్..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య సోమవారం ఫోన్ కాల్ ద్వారా చమురు ధరలపై చర్చ జరిగింది. సౌదీతో రష్యా చర్చలు జరపడంపై ఇద్దరి మధ్య సమాలోచనలు జరిగి ఉండవచ్చని ఆక్సికార్ప్ గ్లోబల్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ స్టీఫెన్ ఇన్నెస్ అభిప్రాయపడ్డారు. లేదా ఈ విపత్కర పరిస్థితుల్లో రష్యాపై ఆంక్షలు సడలించే దిశగా చర్చించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

రష్యా, సౌదీలు విభేదాలు పక్కనబెడితే సానుకూల పరిస్థితులు ఏర్పడుతాయని ఇన్నెస్ స్పష్టం చేశారు. అయితే పూర్తి స్థాయిలో మెరుగవుతుందని చెప్పలేమన్నారు.

సౌదీ-రష్యా మధ్య పోరు..

వైరస్ వ్యాప్తిని నివారించడానికి ప్రపంచమంతటా లాక్ డౌన్ అమలవుతోంది. ప్రపంచ జనాభాలో 40 శాతం మంది ఇళ్లకే పరిమితమయ్యారు. ఫలితంగా ఇంధన డిమాండ్ తగ్గటం వల్ల చమురు మార్కెట్లు పడిపోయాయి.

వైరస్ వల్ల దెబ్బతిన్న ఇంధన మార్కెట్లకు మద్దతుగా ఉత్పత్తిని తగ్గించే విషయంలో ప్రధాన ఉత్పత్తిదారులు సౌదీ అరేబియా, రష్యా మధ్య ధరల యుద్ధం ప్రారంభమైంది. ఈ కారణంగా కరోనాతో మునిగిపోయిన చమురు మార్కెట్లు మరింత సంక్షోభంలో కూరుకుపోయాయి.

మార్కెట్ వాటాను పెంచుకునే దిశగా సౌదీ రోజుకు 600,000 బ్యారెళ్లు అదనంగా ఎగుమతి చేయనున్నట్లు సోమవారం ప్రకటించింది. మే నెల వరకు రికార్డు స్థాయిలో ఈ మొత్తం 10.6 మిలియన్ బ్యారెళ్లకు పెంచుతున్నట్లు స్పష్టం చేసింది.

18 ఏళ్ల కనిష్ఠానికి..

ఈ పరిణామాల మధ్య సోమవారం చమురు భారీగా పతనమైంది. అంతర్జాతీయంగా చమురు ధరలు 18 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయాయి. డబ్ల్యూటీఐ చమురు బ్యారెల్ ధర 20 డాలర్లకు దిగువకు చేరింది. ప్రపంచ దేశాల నిల్వలు పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడం వల్ల చమురు ధర మరింత దిగజారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇదీ చూడండి: కొనసాగుతున్న రష్యా, సౌదీ చమురు యుద్ధం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.