ETV Bharat / business

అమెరికా ఎన్నికలు: మన ఐటీ, ఫార్మా షేర్లకు.. ఎవరైతే మేలు?

author img

By

Published : Nov 1, 2020, 8:20 AM IST

how america presidential elections will effect indian IT and pharma shares
అమెరికా ఎన్నికలు: మన ఐటీ, ఫార్మా షేర్లకు.. ఎవరైతే మేలు?

అమెరికా అధ్యక్ష ఎన్నికల నేఫథ్యంలో స్టాక్​ మార్కెట్లలో కొద్ది రోజులుగా నష్టాలు నమోదవుతున్నాయి. దీనికి తోడు వివిధ దేశాల్లో కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తుండడం.. సూచీల ఊగిసలాటకు మరో కారణంగా నిలుస్తోంది. ఈ పరిస్థితుల్లో అమెరికాపై ఆధారపడి ఉన్న దేశీయ ఐటీ, ఫార్మా రంగాల కంపెనీలపై ఎటువంటి ప్రభావం ఉంటుంది?

దేశీయ స్టాక్‌మార్కెట్లకు అమెరికా అధ్యక్ష ఎన్నికల జ్వరం పట్టుకుంది. కొద్ది రోజులుగా సూచీలకు ఎదురవుతున్న నష్టాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. వివిధ దేశాల్లో కొవిడ్‌-19 వైరస్‌ మళ్లీ విజృంభిస్తుండడం సూచీల ఊగిసలాటకు ప్రధాన కారణం. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నిక ఫలితం ఎలా ఉంటుందనే ఆందోళన మరొక కారణం. కొవిడ్‌ పరిణామాల వల్ల ఇప్పటికే దేశీయ కార్పొరేట్‌ సంస్థలకు ఆదాయాలు, లాభాలు తగ్గిపోయాయి. ఆ మేరకు స్టాక్‌మార్కెట్లో ఆయా కంపెనీల షేర్లపై ప్రభావం పడుతోంది. దీనికి అమెరికా అధ్యక్ష ఎన్నిక కూడా జతకలిసింది. ఎవరు గెలిస్తే, అమెరికాపై ఆధారపడి ఉన్న దేశీయ ఐటీ, ఫార్మా రంగాల కంపెనీలపై ఎటువంటి ప్రభావం ఉంటుందనే దిశగా జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఎవరు గెలిచినా ఈ రంగాలపై ప్రభావం తాత్కాలికమేనని కొందరు నిపుణులు విశ్లేషిస్తున్నారు.

యూబీఎస్‌ అంచనా

బైడెన్‌ గెలిస్తే ఆరోగ్య రంగానికి పెద్దపీట వేస్తారని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ అయిన యూబీఎస్‌ తాజా నివేదికలో అభిప్రాయపడింది. దీనివల్ల ఆసుపత్రులు, ఫార్మా కంపెనీలకు మేలు జరుగుతుంది. అమెరికాలో తక్కువ ధరకు నాణ్యమైన జనరిక్‌ ఔషధాల విక్రయంలో మనదేశ ఫార్మా కంపెనీలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. కాబట్టి దేశీయ ఫార్మా కంపెనీలు లాభపడతాయని, అందువల్ల ఫార్మా కంపెనీలపై పెట్టుబడులు మంచి ప్రతిఫలాన్ని ఇస్తాయని స్టాక్‌మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

'డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్ధి బైడెన్‌ అధ్యక్షుడు అయితే ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దటంపై దృష్టి పెడతారు, పర్యావరణ పరిరక్షణ, వైద్య- ఆరోగ్య సేవలకు ప్రాధాన్యం ఇస్తారు' అని యూబీఎస్‌ విశ్లేషించింది. అదే సమయంలో కార్పొరేట్లపై కఠినమైన నియంత్రణ, అధిక పన్ను భారం ఉండొచ్చనీ పేర్కొంది. అయినప్పటికీ ఆరోగ్య బీమా అమలు, మందుల ధరలపై నియంత్రణ వల్ల జనరిక్‌ ఔషధాలకు ఆదరణ పెరుగుతుందని స్థానిక ఫార్మా పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

వీసా నిబంధనలతో ఐటీకి ఇబ్బంది

ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌ మళ్లీ గెలిస్తే విధానపరమైన మార్పులు పెద్దగా ఉండవు. దాదాపుగా ప్రస్తుత విధానాలే కొనసాగుతాయి. మన ఐటీ రంగం అమెరికాపై అధికంగా ఆధారపడి ఉన్న విషయం తెలిసిందే. అమెరికా నుంచి అవుట్‌సోర్సింగ్‌ ప్రాజెక్టులు మన ఐటీకి ఎంతో అవసరం. కానీ ట్రంప్‌ పదవీ కాలంలో వీసా ఆంక్షలు అమలు చేయటంతో ఐటీ కంపెనీలకు కొంత ఇబ్బంది ఎదురైంది.

అమెరికా కంపెనీలు అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలనే డిమాండ్‌తో ట్రంప్‌ ముందుకు సాగుతున్నారు. కాబట్టి ఐటీ రంగంపై ట్రంప్‌ తిరిగి ఎన్నిక ప్రభావం ఉంటుందని స్థానిక స్టాక్‌మార్కెట్‌ నిపుణుల విశ్లేషణ. కాకపోతే అమెరికా ఆర్థిక వ్యవస్థ కోలుకుంటే బీఎస్‌ఎఫ్‌ఐ (బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, బీమా) రంగాల నుంచి ఐటీ కంపెనీలకు పెద్దఎత్తున ప్రాజెక్టులు లభిస్తాయి. అటువంటి పరిస్థితుల్లో అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనప్పటికీ మనదేశానికి చెందిన ఐటీ కంపెనీలకు ఇబ్బంది ఉండదని, కాబట్టి స్టాక్‌మార్కెట్లో ఐటీ కంపెనీలకు ఆకర్షణ కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.

అధికంగా ఎగుమతులు

మనదేశం నుంచి నమోదయ్యే ఎగుమతుల్లో ఐటీ, ఫార్మా రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. దేశీయ ఐటీ పరిశ్రమ వార్షిక టర్నోవరు దాదాపు 190 బిలియన్‌ డాలర్లు (1 బిలియన్‌ డాలర్లు= రూ.7,500 కోట్లు). కాగా, ఇందులో 150 బిలియన్‌ డాలర్ల మేరకు ఎగుమతుల వాటా ఉంటుంది. ఐటీ ఎగుమతుల్లో మెజారిటీ వాటా అమెరికాదే అనే విషయం తెలిసిందే. మరోపక్క, మనదేశం నుంచి ఏటా ఫార్మా ఎగుమతులు 20 బిలియన్‌ డాలర్లకు పైగానే ఉండబోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ రెండు రంగాలకు చెందిన స్టాక్‌మార్కెట్లో నమోదై ఉన్న కంపెనీలపై మదుపరులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.

అమెరికా అధ్యక్ష ఎన్నిక తర్వాత అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయి, విధాన పరమైన మార్పులు ఏ మేరకు రావచ్చు.. వాటి ప్రభావం మన కంపెనీలపై ఏవిధంగా ఉంటుంది అనే కోణంతో తమదైన అంచనాలు వేస్తున్నారు. ముందు జాగ్రత్తగా ఈ రంగాలకు చెందిన కంపెనీలపై తమ పెట్టుబడులను కొంతమేరకు వెనక్కి తీసుకుంటున్న మదుపరులు కూడా కనిపిస్తున్నారు. ఎన్నికల తర్వాత పరిస్థితులను బట్టి ఈ రంగాలకు చెందిన కంపెనీలపై మళ్లీ పెట్టుబడులు పెట్టవచ్చనే ఆలోచన చేస్తున్నారు.

ఇదీ చూడండి:షార్ట్​ టర్మ్​లో స్టాక్​ మార్కెట్లకు ఈ 5 అంశాలే కీలకం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.