ETV Bharat / business

మదుపు బాటలో.. తొలి అడుగులు..

author img

By

Published : Jun 4, 2021, 11:52 AM IST

తొలి సంపాదన ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది. ఇలాంటి సంతోషకరమైన సమయంలోనే పెట్టుబడులూ ప్రారంభిస్తే.. దీర్ఘకాలంలో అది గొప్ప నేస్తంగా మిగిలిపోతుంది. ఇప్పుడు చాలామంది యువత స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇలా మదుపు చేసే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Things to know before investing
పెట్టుబడుల ముందు తెలుసుకోవాల్సిన విషయాలు

కొంతమంది డబ్బును దాచుకోవడం అంటే.. నగదు రూపంలో లేదా పొదుపు ఖాతాలో అలాగే అట్టిపెట్టడం అనుకుంటారు. ఖర్చులను తగ్గించుకొని, వీలైనంత మొత్తాన్ని పక్కన పెట్టడం మంచి అలవాటే. కానీ, ఆ మొత్తం పెరిగేందుకు అవకాశాన్ని ఇవ్వాలి. అందుకే, ప్రతి రూపాయీ మరో రూపాయిని సంపాదించేలా కష్టపెట్టాలి.

పోర్ట్‌ఫోలియో ఇలా..

కొత్తగా మార్కెట్లో పెట్టుబడుల మార్కెట్లోకి అడుగు పెట్టిన వారు.. తమ పెట్టుబడుల జాబితాలో వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి. ఇందులో కొన్ని సురక్షితమైన పెట్టుబడులు ఉంటే.. మరికొన్ని వృద్ధి ఆధారిత పథకాలు ఉండాలి. షేర్లు, మ్యూచువల్‌ ఫండ్లు, బాండ్లు, డిపాజిట్లు, బంగారంలాంటివన్నీ మీ పోర్ట్‌ఫోలియోలో ఉండాలి. ఒకే పథకంపై ఎక్కువగా ఆధారపడటం ఎప్పుడూ క్షేమం కాదు.

మార్కెట్‌ పోకడలను అర్థం చేసుకోవాలి

ఒక పథకం గురించి పూర్తిగా అవగాహన చేసుకోవాలి. అప్పుడే మన లక్ష్యాలకు అది సరిపోతుందా లేదా అనేది తెలుస్తుంది. షేర్లలో నేరుగా మదుపు చేయాలంటే.. మీకు తగిన సమయం ఉండాలి. మార్కెట్‌ పోకడలను అర్థం చేసుకోవాలి. ఒక కంపెనీ షేరు ఎందుకు పెరుగుతోంది.. ఎందుకు పడిపోతోంది. ఆర్థిక వ్యవస్థ పనితీరు.. ఇలా అనేక అంశాలు తెలిసి ఉండాలి. ఎవరో చెప్పారని.. షేర్లను ఎంచుకుంటే.. చాలాసార్లు నష్టాన్ని మిగిల్చే అవకాశం ఉంది.

మీ పెట్టుబడి వ్యూహాన్ని నిర్ణయించుకునే ముందు.. నష్టభయాన్ని భరించే సామర్థ్యాన్ని అంచనా వేసుకోండి. అప్పుడే షేర్లలో మదుపు చేయాలా.. లేకపోతే.. ఇండెక్స్‌ ఈటీఎఫ్‌లలాంటి ఎంచుకోవాలా అన్నదీ తెలుస్తుంది.

సంపదను సృష్టించాలంటే.. పెట్టుబడులు తప్పనిసరి. అయితే, ఎప్పుడు మదుపును ప్రారంభిస్తున్నామన్నదీ కీలకమే. చిన్న వయసు నుంచే మదుపు చేస్తే.. దీర్ఘకాలంలో మంచి నిధి సొంతం అవుతుంది. భావోద్వేగాలకు తావీయకూడదు. చిన్న మొత్తంతోనైనా.. విభిన్న పెట్టుబడులను ఎంచుకొని, వీలైనంత కాలం కొనసాగించండి. అప్పుడే విజయవంతమైన మదుపరిగా మారతారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.