ETV Bharat / business

వడ్డీ రేట్లు యథాతథం- ఆర్​బీఐ సమీక్ష హైలైట్స్​ ఇవే...

author img

By

Published : Aug 6, 2021, 10:09 AM IST

Updated : Aug 6, 2021, 12:10 PM IST

Shaktikanta Das
శక్తికాంత దాస్​

10:05 August 06

రెపో రేటు యథాతథం: ఆర్​బీఐ

ఆర్థిక విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ మరోసారి కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది ఆర్​బీఐ. రిజర్వు బ్యాంక్ గవర్నర్​ శక్తికాంత దాస్​ అధ్యక్షతన ఈ నెల 4 నుంచి 3 రోజులు సమావేశమైన ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ).. మూడు రోజుల సమీక్ష అనంతరం రెపో రేటును 4 శాతం, రివర్స్ రెపో రేటును 3.35 శాతం వద్ద కొనసాగించాలని నిర్ణయించింది. కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేకపోవడం వరుసగా ఇది 7వ సారి కావడం గమనార్హం.

కరోనా రెండో దశ ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థ తేరుకునే వరకు సర్దుబాటు వైఖరిని కొనసాగించనున్నట్లు శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. వృద్ధి రేటు రికవరీ కోసం.. మరిన్ని చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.

ఎంపీసీ సమీక్ష ముఖ్యాంశాలు..

  • ప్రస్తుత పరిస్థితుల్లో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టినా అది ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు 9.5 శాతంగా నమోదవ్వచ్చు. గత సమీక్షకు, ఇప్పటికీ దీంట్లో ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం.
  • ఆర్‌బీఐ ప్రకటించిన ఈ సర్దుబాటు వైఖరి విధానానికి ఎంపీసీ కమిటీలో ఏకగ్రీవ ఆమోదం లభించలేదు.
  • మే నెలలో వినియోగదారుల ధరల ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ(సీపీఐ) కలవరపరిచింది. కానీ, ప్రస్తుతం ధరల పెరుగుదలలో కాస్త స్థిరత్వం వచ్చింది.
  • స్థూలంగా మార్కెట్లో డిమాండ్‌ పుంజుకుంటుంది. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇంకా బలహీనంగానే ఉన్నాయి. సరఫరా-గిరాకీ మధ్య సమతుల్యం కోసం ఇంకా కొన్ని చర్యలు చేపట్టాల్సి ఉంది.
  • జూన్‌తో పోలిస్తే కరోనా వైరస్‌ వ్యాప్తి విషయంలో ప్రస్తుతం పరిస్థితులు కాస్త చక్కబడ్డప్పటికీ.. మూడో దశ ముప్పు ఇంకా పొంచి ఉంది.
  • వ్యాక్సిన్‌ ఉత్పత్తి, పంపిణీ వేగంగా కొనసాగుతున్నాయి. అయినప్పటికీ మూడో వేవ్‌ ముప్పుపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
  • 2021-22లో వినియోగదారుల ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 5.7 శాతంగా నమోదవ్వచ్చు. ఇది రెండో త్రైమాసికంలో 5.9 శాతంగా, మూడో త్రైమాసికంలో 5.3 శాతంగా, నాలుగో త్రైమాసికంలో 5.8 శాతంగా ఉండొచ్చని అంచనా. 2022-23 తొలి త్రైమాసికంలో ఇది 5.1 శాతానికి దిగివచ్చే అవకాశాలున్నాయి.
  • ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజాన్ని సూచించే ప్రధాన సూచీలన్నీ పురోగమిస్తున్నాయి.
  • ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావాన్ని పరిమితం చేసేందుకు ఆర్​బీఐ 100కు పైగా చర్యలు చేపట్టింది.
  • జీ-శాప్‌ 2.0 కింద ఈ నెలలో రూ.50 వేల కోట్ల విలువైన సెక్యూరిటీలను రెండు దశల్లో కొనుగోలు చేయాలని నిర్ణయం. తొలి విడత ఆగస్టు 12, రెండో విడత ఆగస్టు 26న ఉండనుంది.
  • తదుపరి ద్వైమాసిక సమీక్ష అక్టోబర్​ 6-8 మధ్య జరగనుంది.
Last Updated :Aug 6, 2021, 12:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.