ETV Bharat / business

రెపో రేటు తగ్గింపునకే ఆర్​బీఐ మొగ్గు?

author img

By

Published : Aug 2, 2020, 6:15 PM IST

ఆర్​బీఐ వడ్డీ రేట్లు మరో సారి తగ్గే అవకాశం ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పరిశ్రమ వర్గాల డిమాండ్ల విషయంలో తీసుకునే నిర్ణయాలు దేశ ఆర్థిక భవిష్యత్​కు కీలకంగా మారతాయని విశ్లేషిస్తున్నారు.

repo rate cut
ఆర్​బీఐ రెపో రేటు తగ్గింపు

ఆర్​బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) ఆగస్టు 4 నుంచి 6 తేదీల్లో ద్వైమాసిక సమీక్ష నిర్వహించనుంది. కీలక వడ్డీ రేట్లపై నిర్ణయం సహా.. కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, ఏకకాలంలో రుణాల పునర్ వ్యవస్థీకరణకు పరిశ్రమ వర్గాల నుంచి పెరుగుతున్న డిమాండ్​లపై చర్చించే అవకాశాలు ఉన్నాయి.

మళ్లీ వడ్డీ రేట్లు తగ్గింపు..

ఈ సారి ఎంపీసీ సమావేశంలోనూ కీలక వడ్డీ రేట్ల కోత ఉండొచ్చని అంచనా వేస్తున్నారు నిపుణులు.

ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావాన్ని పరిమితం చేసేందుకు ఆర్​బీఐ ఇప్పటికే పలు చర్యలు తీసుకుంది. ఇందుకోసం మార్చి, మే నెలల్లో అత్యవసర సమావేశాలు నిర్వహించింది. ఈ రెండు సమావేశాల్లో 115 బేసిస్​ పాయింట్ల రెపో తగ్గించింది. ఫలితంగా ప్రస్తుతం రెపో రేటు 4 శాతంగా, రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా ఉన్నాయి.

ఈ వారం జరగనున్న సమావేశంలో మరో 25 బేసిస్ పాయింట్ల రెపో తగ్గించే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

రెపో రేటు తగ్గింపులో 72 బేసిస్ పాయింట్ల వరకు వినియోగదారులకు బ్యాంకులు బదిలీ చేసినట్లు ఎస్​బీఐ ఎకోవ్రాప్​ నివేదిక వెల్లడించింది.

రుణాల విషయంలో..

కరోనాతో నెలకొన్న సంక్షోభాన్ని అధిగమించేందుకు ఒకే సారి రుణాల పునర్ వ్యవస్థీకరణ అంశాన్ని పరిశీలించాలని సూచిస్తున్నారు నిపుణులు. దీనితోనే కంపెనీలు తిరిగి నిలదొక్కుకోగలగుతాయని అంటున్నారు. పరిశ్రమ వర్గాల నుంచి కూడా దీని కోసం భారీగా డిమాండ్ పెరిగింది.

ప్రస్తుత పరిస్థితుల్లో వడ్డీ రేట్ల తగ్గింపు ప్రభావం ఆర్థిక వృద్ధిపై స్వల్పంగానే ఉంటుందనే అంచనాలు కూడా కొంత మంది నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది.

ఇదీ చూడండి:రెపో రేటు, ఆర్థిక గణాంకాలే మార్కెట్లకు కీలకం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.