ETV Bharat / business

కీలక వడ్డీ రేట్లు మరోసారి యథాతథమే!

author img

By

Published : Aug 1, 2021, 4:46 PM IST

NO Change in Repo rate
రెపో రేటు పెంపుపై అంచనాలు

ఆర్​బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ద్వైమాసిక సమీక్ష నిర్ణయాలు ఈ వారమే వెలువడనున్నాయి. ధరల పెరుగుదల.. పారిశ్రామిక రంగం ఇంకా ఉపందుకోకపోవడం వంటి పరిస్థితుల్లో కీలక వడ్డీ రేట్లపై కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది? ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఆర్​బీఐ ఎలాంటి వ్యూహాలను అమలు చేయొచ్చు? అనే అంశాలపై నిపుణుల విశ్లేషణలు ఇలా ఉన్నాయి.

కరోనా ప్రభావంతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు అర్​బీఐ ఏడాది కాలంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. ఇందులో భాగంగా కీలక వడ్డీ రేట్లను చివరగా.. గత ఏడాది మేలో అత్యల్ప స్థాయికి (రెపో రేటు 4 శాతం, రివర్స్​ రెపో రేటు 3.35 శాతం) తగ్గించింది. కరోనా భయాల నేపథ్యంలో తదుపరి సమావేశాల్లోనూ అవే వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ వస్తోంది.

ఈ వారం ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమీక్ష నిర్వహించి.. ప్రస్తుత పరిస్థితులకు తగ్గ నిర్ణయాలను తీసుకోనుంది. అయితే ఈసారి కూడా కీలక వడ్డీ రేట్ల విషయంలో.. యథాతథ స్థితినే కొనసాగించేందుకు కమిటీ మొగ్గు చూపొచ్చని ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు.

ఆగస్టు 4న ఆర్​బీఐ ఎంపీసీ సమావేశం ప్రారంభమవనుంది. మూడు రోజుల సమీక్ష అనంతరం ఆగస్టు 6న వడ్డీ రేట్లు సహా ఇతర నిర్ణయాలను ప్రకటించనుంది ఆర్​బీఐ.

"ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం అంచనాలకన్నా ఎక్కువగా ఉంది. కరోనా తగ్గిన అనంతరం పారిశ్రామికోత్పత్తి భారీగా పెరుగుతుందని ఆశించినా.. ఇంకా నెమ్మదిగానే వృద్ధి నమోదవుతోంది. మే నెలతో పోల్చితే జూన్​లో జీఎస్​టీ వసూళ్లు తగ్గాయి. ట్రావెల్, టూరిజం, ఆతిథ్య, ఈవెంట్ మేనేంజ్మెంట్ రంగాలు ఇంకా తేరుకోలేదు. ఎఫ్ఎంసీజీ, రియల్ ఎస్టేట్ కాస్త కోలుకున్నాయి. అయితే కరోనా ప్రభావం పూర్తిగా తగ్గక పోవడం, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా తేరుకునే వరకు ఆర్​బీఐ కీలక వడ్డీ రేట్లను పెంచకపోవచ్చు. ద్రవ్యోల్బణం పెరిగినా.. సర్ధుబాటు వైఖరి కొనసాగిస్తుందని భావిస్తున్నాం."

- నరసింహ మూర్తి, ఆర్థిక విశ్లేషకులు, నరహింహ మూర్తి అండ్ కంపెనీ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.