ETV Bharat / business

నెలాఖరుకు అప్పులు చేయాల్సి వస్తోందా?

author img

By

Published : Jun 15, 2021, 12:14 PM IST

చాలా మంది నెల జీతం రాగానే ఉదారంగా ఖర్చు చేసి రాజులా గడుపుతారు.. నెలాఖరు వచ్చే సరికి మళ్లీ అప్పు కోసం చూస్తారు. ఇలాంటి పరిస్థితి రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఖర్చులను ఎలా ప్లాన్​ చేసుకోవాలి?

Financial plan to reduce expenses
ఖర్చులు తగ్గించే ఆర్థిక ప్రణాళిక

ఉద్యోగం చేస్తున్న చాలా మందికి వేతనమే ఆధారం. చాలా తక్కువ మందికి మాత్రమే ఇతర ఆదాయ వనరులు ఉంటాయి. ఫోన్ బిల్లు నుంచి మొదలుకుని ఇంటి అద్దె వరకు చాలా బిల్లులు వేతనంతోనే చెల్లించాల్సి ఉంటుంది. చాలా మంది ఖాతాలో జీతం ఇలా రాగానే అలా అయిపోతుంది. అందువల్ల నెలాఖరులో ఖర్చులకు డబ్బులు ఉండవు. దీనితో క్రెడిట్ కార్డును ఉపయోగిస్తుంటారు. దీనివల్ల అప్పులు పెరిగి వాటిని చెల్లించడం.. మళ్లీ వాటికోసం కొత్త అప్పులు. ఇలా సైకిల్​ కొనసాగుతుంది. ఇలాంటి పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బడ్జెట్ తయారీ

నెలవారీ ఖర్చుకు బడ్జెట్ తయారు చేసుకోవటమనేది చాలా ముఖ్యమైన అంశం. ఇది మొత్తం వ్యక్తిగత ఆర్థిక అంశాలను కూడా సరైన విధంగా ఉండేలా చూస్తుంది. దీనివల్ల వివిధ విషయాల్లో ఖర్చులను నిర్ణయించుకుని దానికి తగ్గట్లు వ్యయం చేయవచ్చు.

ఆహారం, అద్దె, బిల్లులు తదితర తప్పనిసరి ఖర్చులకు కావాల్సిన మొత్తాన్ని ముందే ఓ పక్కకు పెట్టుకోవాలి. ఇందుకు 50/30/20 రూల్​ను ప్రామాణికంగా తీసుకోవాలి.

ఏమిటి ఈ రూల్​..

50 శాతం ఆదాయం నిత్యావసరాలకు, 30 శాతం తన ఇష్టాలపై, 20 శాతం పెట్టుబడుల లేదా సేవింగ్స్ కోసం ఉపయోగించుకోవాలని ఈ సూత్రం చెబుతుంది.

రుణ చెల్లింపులు, ఇంట్లోకి కావాల్సిన సరుకులు, పిల్లల చదువులకు సంబంధించిన ఫీజులు, ప్రయాణ ఖర్చులు లాంటి తప్పించలేని ఖర్చులను నిత్యావసరాల్లోకి చేర్చవచ్చు.

సినిమా, షాపింగ్, వీకెండ్ ఖర్చులు, బయట తినటం లాంటివి ఇష్టాల విభాగంలో చేర్చవచ్చు. ఇవి మౌలికంగా జీవిన శైలి ఖర్చులు, వీటిని తగ్గించుకోవచ్చు లేదా తప్పించుకోవచ్చు. వీటిని ఎంత నియంత్రిస్తే అంత మెరుగ్గా వ్యక్తిగత ఆర్థిక పరిస్థితి ఉంటుంది.

ఎక్కువ ఖర్చు పెట్టకండి

అవసరం ఉన్న దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టటం ఆర్థిక సమస్యలకు ప్రధాన కారణం. ఈ విషయంలో జాగ్రత్త వహించినట్లయితే చాలా వరకు ఇబ్బందులను దూరం చేసుకోవచ్చు.

అత్యవసర నిధి

అనుకోకుండా కొన్నిసార్లు ఆస్పత్రులు, ఇతరత్ర కారణాలతో డబ్బు అవసరం రావచ్చు. ఇలాంటి సమయాల్లో అత్యవసర నిధి ఉపయోగపడుతుంది. ఆర్థిక ప్రణాళికలో అత్యవసర నిధి ఉండేలా చూసుకోవాలి. నెలవారీగా కొంత మొత్తం ఈ నిధికి జమ చేసుకుంటూ ఉండాలి. లిక్విడ్ ఫండ్లు, రికరింగ్ డిపాజిట్లు దీనికోసం సరిపోతాయి.

ప్రాధాన్యతలను గుర్తించాలి

ప్రాధాన్యత క్రమంలో బడ్జెట్​ను తయారు చేసుకోవాలి. ప్రాధాన్యతను గుర్తించనట్లయితే తక్కువ అవసరం ఉన్న వాటిపై ఎక్కువ ఖర్చు పెట్టి.. ఎక్కువ అవసరం ఉన్న వాటిపై తక్కువ ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది.

ఆహారం, బిల్లులు, అద్దె వ్యయాలు లాంటివి తప్పకుండా ఉంటాయి. అదే సమయంలో ఏసీ, ఫ్రిడ్జ్​ లాంటివి తప్పనిసరి కాకపోవచ్చు. అంతేకాకుండా ఉపకరణాలు లాంటి వాటి కోసం దీర్ఘకాల ప్రణాళిక వేసుకోవాలని వ్యక్తిగత ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

సమీక్ష

వ్యయాలను తరచూ సమీక్షించుకుంటూ ఉండాలి. వారం వారీగా రివ్యూ చేసుకోవటం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల చేసే ఖర్చులపై స్పష్టత ఉంటుంది. ఉదాహరణకు ఒక నెలలో రెస్టారెంట్లకు ఎక్కువ ఖర్చు చేసినట్లయితే.. రాబోయే నెలలో ఆ ఖర్చును తగ్గించుకోవచ్చు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.