ETV Bharat / business

పసిడిపై పెట్టుబడులకు ఇదే సరైన సమయమా?

author img

By

Published : Apr 12, 2021, 3:03 PM IST

Which is the best time to Invest on Gold
బంగారంపై పెట్టుబడులకు సరైన సమయం ఏది

కొవిడ్​ సంక్షోభం వల్ల బంగారం ధర గత సంవత్సరం విపరీతంగా పెరిగింది. 2020 ఆగస్టులో ఏకంగా జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. అప్పటి నుంచి మళ్లీ తగ్గుతూ వచ్చింది. అయితే ఏప్రిల్ ప్రారంభం నుంచి ధర మళ్లీ పెరుగుతోంది. మరి పసిడిపై పెట్టుబడికి ఈ సమయం అనువైనదేనా? రానున్న రోజుల్లో పసిడి ధరలు ఎలా ఉండనున్నాయి? నిపుణులు ఏమంటున్నారు?

కరోనా వల్ల గత సంవత్సరం ఆర్థిక పరిస్థితి దెబ్బతినటం, స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయి పతనాన్ని నమోదు చేయడం వంటి కారణాలతో సురక్షిత పెట్టుబడి సాధనం అయిన బంగారం ధర అమాంతం పెరిగింది. ఆగస్టులో పది గ్రాముల బంగారం ధర జీవనకాల గరిష్ఠ స్థాయికి (రూ. 57వేలకు) చేరింది. అయితే ఆ తర్వాత నుంచి ధర తగ్గుతూ వచ్చింది. భారత్​ సహా ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితులు మెరుగవటం సహా ఈక్విటీ మార్కెట్లు మంచి రాబడులను ఇవ్వడం వల్ల బంగారంపై పెట్టుబడుల ఉపసంహరణకు మొగ్గు చూపారు మదుపరులు.

ఈ నెల ప్రారంభం నుంచి బంగారం ధర మరోసారి పెరుగుతూ వస్తోంది. మార్చి 31 గణాంకాల ప్రకారం.. హైదరాబాద్​లో తులం (10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి) బంగారం ధర రూ.45,500 వద్ద ఉండేది. ఇప్పుడు దాదాపు రూ.48వేల స్థాయికి చేరుకుంది. రానున్న రోజుల్లో బంగారం ధర ఇంకా పెరిగే అవకాశాలున్నాయని పసిడిపై పెట్టుబడులు పెట్టాలనుకుంటే.. అందుకు ఇది సరైన సమయమేనని నిపుణులు చెబుతున్నారు.

ఎందుకు ఇది సరైన సమయం?

సాధారణంగా ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి ఉన్నప్పుడు బంగారం ధర పెరుగుతుంది. ప్రస్తుతం అన్ని దేశాల్లో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీనితో కొన్ని దేశాలు, దేశలోని పలు నగరాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇది ఆర్థిక వ్యవస్థ నెమ్మదించేందుకు కారణం కావచ్చనే అంచనాలున్నాయి.

చాలా దేశాలు, ముఖ్యంగా అమెరికా, భారీ ఉపశమన ప్యాకేజీ ప్రకటించాయి. దీని వల్ల ప్రజల చేతిలో డబ్బు ఉంది. ఫలితంగా.. వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. సాధారణంగా ధరల పెరుగుదల ఉన్నప్పుడు బంగారం కూడా ప్రియమవుతుంది.

కరోనా కేసులు పెరగటం, ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో కొనసాగొచ్చనే అంచనాల నేపథ్యంలో.. బంగారం ధర మరింత పెరగొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. కాబట్టి పెట్టుబడుల కోసం, ఆభరణాల కోసం బంగారం కొనుగోలు చేయాలనుకుంటే ఇప్పుడు సరైన సమయమని విశ్లేషకులు చెబుతున్నారు.

లాక్​డౌన్ భయాల ప్రభావం తక్కువే..

చాలా రాష్ట్రాలు కరోనా ఉద్ధృతి దృష్ట్యా జనసంచారంపై ఆంక్షలు విధిస్తున్నాయి. అంతేకాకుండా లాక్​డౌన్ భయాలు కూడా ఉన్నాయి. అయితే.. ఇవేవీ బంగారం ధరను అంతగా ప్రభావితం చేయకపోవచ్చంటున్నారు నిపుణులు.

''పెట్టుబడితో పాటు ఆభరణాలకు ప్రస్తుత ధరలు మంచి స్థాయి. డిసెంబర్ వరకు 10 గ్రాముల బంగారం ధర రూ.50వేలకు చేరుతుందని అంచనా వేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ప్రకటించిన ఉపశమన ప్యాకేజీల వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ప్యాకేజీల కోసం పన్నులు పెంచే అవకాశం కూడా ఉంది. అమెరికా లాంటి దేశాల్లో నగదు ఎక్కువగా ముద్రిస్తున్నారు. కరోనా కేసులు కూడా పెరగటం వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఈ కారణాలతో బంగారం ధర పెరుగుతుందని ఆశిస్తున్నాం."

- సతీశ్​ అగర్వాల్, ఎండీ, కుందన్ జ్యువెల్లర్స్ (హైదరాబాద్​)

రూపాయి క్షిణిస్తే పసిడి పరుగు!

అంతర్జాతీయ మార్కెట్లతో పోల్చితే దేశీయంగా బంగారం ధర పెరుగుదల ఎక్కువగా ఉంది. ఇందుకు కారణం డాలరుతో పోల్చితే రూపాయి విలువ క్షీణిస్తుండటమే. అంతర్జాతీయంగా చూస్తే ఔన్స్ బంగారం ధర 2,075 డాలర్ల నుంచి 1,650 డాలర్ల స్థాయికి పడిపోయింది. కొన్ని రోజులుగా రికవరీ అవుతూ.. ప్రస్తుతం 1,700 డాలర్ల స్థాయిలో ఉంది.

ఇదీ చదవండి:చిన్నారులకు నేర్పుదాం ఈ పొదుపు పాఠాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.