ETV Bharat / business

ఏప్రిల్-జూన్​ మధ్య గృహ విక్రయాలు 67% డౌన్​

author img

By

Published : Jul 10, 2020, 1:12 PM IST

గృహ విక్రయాలపై కరోనా లాక్​డౌన్​ ప్రభావం తీవ్రంగా పడింది. దేశవ్యాప్తంగా 9 ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాలు ఏప్రిల్-జూన్ మధ్య 67 శాతం తగ్గినట్లు ఓ సర్వేలో తెలిసింది.

corona impact on house sales
ఇళ్ల విక్రయాలపై కరోనా పడగ

కరోనా వైరస్​ కట్టడిలో భాగంగా విధించిన లాక్​డౌన్​తో స్థిరాస్తి రంగం తీవ్రంగా కుదేలైంది. లాక్​డౌన్ కారణంగా ఏప్రిల్-జూన్ మధ్య దేశవ్యాప్తంగా 9 ప్రధాన నగరాల్లో గృహ విక్రయాలు 67 శాతం తగ్గాయని రియల్టీ విశ్లేషణ సంస్థ ప్రాప్​ఇక్విటీ నివేదికలో వెల్లడైంది.

ఈ నివేదిక ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య 9 నగరాల్లో కేవలం 21,294 గృహాలు విక్రయమయ్యాయి. 2019 ఇదే సమయంలో 64,378 యూనిట్లు అమ్ముడయ్యాయి.

ప్రముఖ రియల్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ ఇటీవల విడుదల చేసిన ఓ సర్వేలో దేశవ్యాప్తంగా 7 ప్రధాన నగరాల్లో 2020 ఏప్రిల్-జూన్​ మధ్య ఇళ్ల అమ్మకాలు ఏకంగా 81 శాతం తగ్గినట్లు తెలిసింది. గడిచిన మూడు నెలల్లో ఏడు నగరాల్లో 12,740 యూనిట్లు మాత్రమే విక్రయమైనట్లు అనరాక్​ వెల్లడించింది.

ఏప్రిల్-జూన్ మధ్య విక్రయాలు (ప్రాప్​ఇక్విటీ ప్రకారం)..

  • నోయిడా మినహా మిగతా ఎనిమిది ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాలు భారీగా తగ్గాయి.
  • గరుగ్రామ్​లో గృహ అమ్మకాలు అత్యధికంగా 79 శాతం తగ్గాయి. మూడు నెలల్లో 361 యూనిట్లు మాత్రమే విక్రయమయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో ఇక్కడ 1,707 ఇళ్లు అమ్ముడయ్యాయి.
  • ఇళ్ల విక్రయాల్లో 75 శాతం క్షీణతతో కోల్​కతా రెండో స్థానంలో ఉంది. మూడు నెలల్లో ఇక్కడ 1,046 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2019 ఇదే సమయంలో ఈ సంఖ్య 4,152 యూనిట్లుగా ఉంది.
  • హైదరాబాద్​, చెన్నైలో ఇళ్ల విక్రయాలు 74 శాతం తగ్గి 996 యూనిట్లకు పరిమితమయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో ఈ నగరాల్లో 1,522 యూనిట్లు విక్రయమయ్యాయి.
  • బెంగళూరులో మూడు నెలల్లో 73 క్షీణతతో 2,818 యూనిట్లు విక్రయమయ్యాయి. 2019లో ఇక్కడ 10,583 గృహాలు అమ్ముడవ్వడం గమనార్హం.
  • మహారాష్ట్రలో ఇళ్ల విక్రయాలు అత్యధికంగా ముంబయిలో 63 శాతం తగ్గాయి. మూడు నెలల్లో ఇక్కడ 2,206 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఠాణె, పుణెలో డిమాండ్ వరుసగా 56 శాతం (5,999 యూనిట్లకు), 70 శాతం (5,169 యూనిట్లకు) తగ్గింది.
  • అన్ని నగరాల్లో విక్రయాలు క్షీణించినప్పటికీ నోయిడాలో మాత్రం అనూహ్యంగా గత మూడు నెలల్లో ఇళ్ల విక్రయాలు 5 శాతం పెరిగాయి. ఈ సమయంలో మొత్తం 1,177 యూనిట్లు అమ్మడయ్యాయి.

ఇదీ చూడండి:'ఆర్థిక వృద్ధి' ఆశల మొలకలు అప్పుడేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.