ETV Bharat / business

పన్ను ఆదాకు ఉత్తమ పెట్టుబడులు ఇవే..

author img

By

Published : May 7, 2021, 1:01 PM IST

ఆదాయపు పన్ను చట్టం.. ఇది కేవలం పన్ను చెల్లింపుల గురించి మాత్రమే కాకుండా పన్ను ఎలా ఆదా చేసుకోవచ్చు అనే విషయం కూడా చెబుతుంది. అయితే ఈ విషయంలో చాలా మందికి వివిధ రకాల సందేహాలు ఉంటాయి. ఆ సందేహాలన్నింటికి సమాధానాలతో పాటు.. పన్ను ఆదా చేసే పెట్టుబడుల గురించి పూర్తి వివరాలతో ఓ ప్రత్యేక కథనం మీకోసం.

Best Tax Saving Investments
పన్ను ప్రయోజనాలు అందించే స్కీమ్​లు

మ్యూచువల్ ఫండ్లు, ఈక్విటీ, పీపీఎఫ్​, ఫిక్స్​డ్​ డిపాజిట్​ వంటి సాధనాల్లో చాలా మంది పెట్టుబడులు పెడుతుంటారు. ఇందులో కొన్ని పన్ను ప్రయోజనాలు కలిగించే పెట్టుబడులు కూడా ఉంటాయి. ఇలాంటి పెట్టుబడుల వల్ల పన్ను ఆదాతో పాటు.. తరచూ పెట్టుబడి పెట్టడం అలవాటవుతుంది. దీర్ఘకాలంలో వీటి ద్వారా మంచి ప్రయోజనాలు కూడా ఉంటాయి.

పన్ను ప్రయోజనాలు కలిగించే పెట్టుబడుల గురించి తెలుసుకుందాం.

ఫిక్స్​డ్ డిపాజిట్లు

ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80సీ ప్రకారం రూ.1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. వీటిని బ్యాంకులు అందిస్తాయి. రిటర్న్స్​ కి గ్యారంటీ ఉంటుంది. పన్ను ప్రయోజనాలకు సంబంధించినంత వరకు ఎఫ్​డీ వ్యవధి 5 సంవత్సరాలుగా ఉంది.

సాధారణ పొదుపు ఖాతా కంటే ఎక్కువ వడ్డీని ఇవి అందిస్తుంటాయి. ఐదు సంవత్సరాల కన్నా తక్కువ వ్యవధి ఉన్న ఎఫ్​డీలకు పన్ను ప్రయోజనాలు ఉండవు. వాటిలో మెచ్యూరిటీకి ముందే కొంత ఫైన్ చెల్లించి విత్ డ్రా చేసుకోవచ్చు. కానీ పన్ను ప్రయోజనాలు అందించే ఎఫ్​డీల విషయంలో మెచ్యూరిటీకి ముందే పెట్టుబడి ఉపసంహరణకు అవకాశం లేదు.

ప్రస్తుతం వీటిపై బ్యాంకులు 5.40 శాతం వరకు వడ్డీ ఇస్తున్నాయి. మెచ్యూరిటీకి ముందే విత్​డ్రా చేసుకునే బదులు ఎఫ్​డీపై రుణం తీసుకోవటాన్ని పరిశీలించవచ్చు.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్​)

పన్ను ప్రయోజనాలు పొందేందుకు ఎక్కువ మంది పబ్లిక్​ ప్రావిడెండ్​ ఫండ్​కు ప్రాధాన్యత ఇస్తుంటారు. వీటిలో సౌర్వభౌమ గ్యారంటీ ఉన్నందున ఎలాంటి రిస్కు ఉండదు. దీనిలో త్రైమాసికాల వారీగా వడ్డీ సమీక్షకు అవకాశం ఉంది. ప్రస్తుతం పీపీఎఫ్​పై వడ్డీ రేటు 7.1గా ఉంది.

ఇది 15 సంవత్సరాల గడువుతో వచ్చినప్పటికీ.. మధ్యలో కొంత పెట్టుబడిని వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. పిల్లల ఉన్నత చదువు, రిటైర్మెంట్ ప్లానింగ్ లాంటి దీర్ఘకాల లక్ష్యాల కోసం పెట్టుబడి పెట్టాలనుకునే వారు పీపీఎఫ్​ను ఎంచుకోవచ్చని వ్యక్తిగత ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్​ఎస్​సీ)

ఐదు సంవత్సరాల నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్​లు చాలా పాపులల్​. ఏదైనా పోస్టల్​ బ్యాంకు ద్వారా నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్​లో పెట్టుబడి పెట్టవచ్చు. వీటిపై 6.8 శాతం వడ్డీ లభిస్తుంది. ఎన్ఎస్​సీలో వడ్డీ కాంపౌండ్ అవుతుంది. మెచ్యురిటీ సమయంలో పూర్తి మొత్తం ఒకే సారి పొందవచ్చు.

స్వల్పకాల ఆర్థిక లక్ష్యాలకు, అల్పాదాయ పెట్టుబడిదారులు ఎన్ఎస్​సీను ఉపయోగించుకోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

ఈక్విటీ లింక్డ్​ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్​ఎస్​ఎస్​)

ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ ద్వారా కూడా సెక్షన్ 80 సీ కింద పన్ను ప్రయోజనం పొందవచ్చు. ఇది పూర్తి ఈక్విటీ ఆధారిత మ్యుచువల్ ఫండ్ పథకం. ఇందులో కనీసం 80 శాతం ఈక్విటీలో పెట్టుబడి ఉంటుంది.

ఈఎల్ఎస్ఎస్ పెట్టుబడి కనీసం మూడు సంవత్సరాల లాక్​ఇన్ పీరియడ్ ఉంటుంది. దీర్ఘకాలంలో ఇతర పెట్టుబడులతో పోలిస్తే.. ఈఎల్ఎస్​ఎస్ పెట్టుబడి ద్వారా మంచి రాబడి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. వీటిలో సిప్ ద్వారా కూడా మదుపు చేయవచ్చు.

యునిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు..

యునిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు(యులిప్)లు పెట్టుబడితో పాటు బీమాను అందిస్తాయి. వీటిని లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు అందిస్తుంటాయి. కనీసం ఐదు సంవత్సరాల పాటు పెట్టుబడిని కొనసాగించాల్సి ఉంటుంది. మార్కెట్ గమనానికి అనుగుణంగా రిటర్న్ లను అందిస్తాయి.

సమర్థవంతంగా పన్ను ప్రయోజనాలు పొందేందుకు స్టాక్స్, బాండ్ల మధ్య పెట్టుబడిని మార్పిడి చేసుకోవచ్చు. యులిప్​లు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ.. ప్రీమియం చెల్లించకుంటే ప్రయోజనాలపై ప్రభావం పడే అవకాశం ఉంటుందన్నది గుర్తుంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

సుకన్య సమృద్ధి యోజన

సుకన్య సమృద్ధి యోజన(ఎస్ఎస్​వై)ఇది ఆడపిల్లలకు సంబంధించిన పథకం. దీనిపై ప్రస్తుతం 7.6 శాతం వడ్డీ లభిస్తుంది. వార్షిక ప్రాతిపదికన అసలుపై వడ్డీ జమ అవుతుంది. సుకన్య సమృద్ధి యోజన ఖాతాను పోస్టాఫీసుల్లో లేదా బ్యాంకుల్లో ఆడపిల్లల తల్లిదండ్రులు, చట్టపరమైన సంరక్షకులు తెరవవచ్చు.

తపాలా కార్యాలయాల్లో కానీ, వాణిజ్య బ్యాంకుల్లో కానీ వెయ్యి రూపాయల కనీస జమతో దీన్ని ప్రారంభించుకోవచ్చు. పుట్టినప్పటి నుంచి పదేళ్లలోపు ఎప్పుడైనా సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు తెరవవచ్చు. ఒక వార్షిక సంవత్సరంలో గరిష్టంగా రూ. లక్షన్నర వరకు జమ చేసుకునేందుకు వీలు ఉంటుంది.

అమ్మాయికి 21 సంవత్సరాలు నిండిత తర్వాత లేదా పెళ్లి అయినప్పుడు(18 సంవత్సరాల వయస్సు వచ్చిన అనంతరం) ఈ ఖాతా వ్యవధి(మెచ్యూరిటీ) ముగుస్తుంది. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ ప్రకారం వార్షికంగా రూ. 1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. వడ్డీ మీద కూడ పన్ను ప్రయోజనాలు వర్తిస్తాయి.

సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్

60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సున్న వారికే ఈ పథకం. 55-60 ఏళ్ల మధ్య నున్న వారు వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించిన సమయంలో కూడా ఈ పథకంలో చేరవచ్చు. నెలవారీగా కనీసం రూ.1000 మదుపు చేయాలి.

5 సంవత్సరాల వ్యవధితో పెట్టుబడి పెట్టవచ్చు. మరో మూడు సంవత్సరాలు పెంచుకునేందుకు వీలు ఉంటుంది. ఈ పథకంలో 7.4 శాతం వడ్డీ లభిస్తుంది. త్రైమాసికానికి ఓ సారి వడ్డీ జమ అవుతుంది. ఎఫ్​డీ , పొదుపు ఖాతా కంటే ఎక్కువ వడ్డీని ఇది అందిస్తుంది. వార్షికంగా రూ.1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. వడ్డీకి మాత్రం పన్ను ప్రయోజనాలు వర్తించవు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.