ETV Bharat / business

'ఏడాదికి 85 కోట్ల 'స్పుత్నిక్​-వి' డోసుల ఉత్పత్తి'

author img

By

Published : Apr 13, 2021, 11:18 AM IST

'స్పుత్నిక్​-వి' టీకా అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చిన 60వ దేశంగా భారత్ నిలిచినట్లు రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్​మెంట్ ఫండ్ (ఆర్​డీఐఎఫ్​) పేర్కొంది. భారత్​లో సంవత్సరానికి 85 కోట్లకుపైగా టీకా డోసులను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.

స్పుత్నిక్​ వి టీకా

రష్యాకు చెందిన కరోనా వ్యాక్సిన్​ 'స్పుత్నిక్​-వి'కు భారత్ అత్యవసర వినియోగ అనుమతులు ఇవ్వడంపై రష్యా డైరెక్ట్​ ఇన్వెస్ట్​మెంట్ ఫండ్ (ఆర్​డీఐఎఫ్​) హర్షం వ్యక్తం చేసింది. స్పుత్నిక్​-వి టీకాకు అనుమతినిచ్చిన 60వ దేశంగా భారత్ నిలిచినట్లు తెలిపింది.

24 గంటల్లోపే ఆమోదం..

దేశీయ ఫార్మా దిగ్గజం డాక్టర్​ రెడ్డీస్​తో కలిసి.. 'స్పుత్నిక్​-వి' టీకాపై క్లినికల్ పరీక్షలు నిర్వహిస్తోంది ఆర్​డీఐఎఫ్​​. ఈ నేపథ్యంలో ఇటీవలే అత్యవసర వినియోగ అనుమతులకు డాక్టర్​ రెడ్డీస్​ దరఖాస్తు చేసుకుంది. ఈ విషయంపై సోమవారం భేటీ అయిన నిపుణుల కమిటీ డీసీజీఐకు సిఫార్సు చేసింది. నిపుణుల కమిటీ సిఫార్సు చేసిన 24 గంటల్లోపే డీసీజీఐ 'స్పుత్నిక్-వి' టీకా అత్యవసర వినియోగానికి ఆమోద ముద్ర వేసింది.

ఏడాదికి 85 కోట్ల డోసుల ఉత్పత్తి..

స్పుత్నిక్-వి టీకా సామర్థ్యం 91.6 శాతంగా ఉన్నట్లు ప్రముఖ మెడికల్ జర్నల్​ ది లాన్సెట్ జర్నల్​ ప్రచురించిందని.. ఆర్​డీఐఎఫ్​ సీఈఓ కిరిల్​ డిమిత్రివ్​ పేర్కొన్నారు. డాక్టర్​ రెడ్డీస్​తో పాటు భారత్​లో ఈ టీకాను.. హెటిరో, గ్లాండ్​ ఫార్మా, స్టెలీస్​ బయో ఫార్మా, పనాసియా బయోటెక్, విర్చోవ్​ బయోటెక్ వంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఏడాదికి 85 కోట్లకుపైగా డోసులను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.

ధర ఎంత?

'స్పుత్నిక్-వి' టీకా తీసుకోవడం ద్వారా ఎలాంటి అలర్జీలు రాకపోవడం సానుకూల విషయమని ఆర్​డీఐఎఫ్​ వర్గాలు తెలిపాయి. దీని ధర 10 డాలర్లలోపే (ఒక డోసుకు) ఉండొచ్చని పేర్కొన్నాయి.

ఇదీ చదవండి:రష్యా వ్యాక్సిన్​ అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.