ETV Bharat / business

దేశంలో ఇంకెంతకాలం ఈ పెట్రో బాదుడు?

author img

By

Published : Mar 6, 2021, 10:33 AM IST

కొంతకాలంగా దేశంలో ఇంధన ధరలు భారీగా పెరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే లీటర్ పెట్రోల్ ధర రూ.100కు చేరింది. డీజిల్ ధర కూడా మండిపోతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదలే దీనికి కారణమని చెబుతున్నారు. అయితే.. ఇంకా ఎంత కాలం ఈ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయన్న దానిపై ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీనిపై ఆర్థిక నిపుణులు ఏమంటున్నారు?

WHEN WILL THE PETROL PRICES REUDUCE
దేశంలో ఇంకెంతకాలం ఈ పెట్రో బాదుడు?

దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంకా ఎంతకాలం ఈ ధరల పెరుగుదల కొనసాగుతుందోనని ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు.

తగ్గినా తగ్గలేదు..

కరోనా మహమ్మారితో ఆర్థిక వ్యవస్థ స్తంభించి పోయింది. రోడ్లపై వాహనాలు తిరగలేదు. పారిశ్రామిక డిమాండ్ కూడా పడిపోయింది. దీనివల్ల పెట్రోల్, డీజిల్ డిమాండ్ తగ్గిపోయి.. వాటి ధరలు తగ్గాయి. బ్యారెల్ ముడిచమురు ధర భారీగా పడిపోయింది. గతేడాది ఏప్రిల్​లో బ్యారెల్ ధర 20 డాలర్ల వద్దకు చేరుకుంది.

కరోనా సమయంలో ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోయింది. దాన్ని భర్తీ చేసుకునేందుకు.. పెట్రోల్, డీజిల్​పై సుంకాలను పెంచి ప్రభుత్వం సొమ్ము చేసుకుంది. దీనివల్ల ముడి చమురు తగ్గిన సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గలేదు. ఇప్పుడు అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్నప్పుడు కూడా పెంచిన పన్ను ఉపసంహరణ జరగలేదు. దీంతో అంతిమంగా వినియోగదారులపై భారం పడుతోంది.

ఎలా తగ్గాలి?

పెట్రోల్, డీజిల్​పై పన్నులు ప్రస్తుతం భారీగా ఉన్నాయి. కేంద్రం, రాష్ట్రం పన్నులు దాదాపు చెరో 30 శాతం ఉన్నాయి. పెట్రోల్ ధరలు తగించాలంటే పన్ను తగ్గించాలని చాలా వరకు ప్రజలు, నిపుణులు కోరుతున్నారు. వస్తు సేవల పన్ను(జీఎస్​టీ) పరిధిలోకి తీసుకురావాలని, దీనివల్ల అంతిమంగా 28 శాతం జీఎస్​టీ ఉండటం వల్ల.. భారీగా తగ్గుతుందని వారు అంటున్నారు. ఈక్విలైజేషన్ ఫండ్ పెట్టి ధరల నియంత్రణ చేపట్టాలని కొందరు కోరుతున్నారు. దీని ద్వారా రోజువారీ ధరల పెరుగుదల, తగ్గుదల ఉండదని వారు సూచిస్తున్నారు.

"ఈక్విలైజేషన్ ఫండ్ ద్వారా ముడి చమురు ధరలు తగ్గినపుడు.. ఆ ప్రయోజనం వినియోగదారులకు బదిలీ చేయకుండా.. ఆ ఫండ్​ నిధులు జమ చేయవచ్చు. ముడి చమురు పెరిగినప్పుడు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచకుండా.. ఈ ఫండ్ నిధులు ఉపయోగించుకోవాలి. ఈ ఫండ్ ఆధారంగా నెలకోసారి నిర్ణయం తీసుకోవచ్చు."

-నరసింహ మూర్తి, మార్కెట్ విశ్లేషకులు, ఆర్థిక నిపుణులు

రోజూ ధరల హెచ్చుతగ్గులతో వినియోగదారుడు గందరగోళానికి, అసౌకర్యానికి గురవుతున్నాడు. దీన్ని దూరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేయాలని నిపుణులు కోరుతున్నారు.

ఇంకా పెరుగుతాయా?

దేశంలో ఇంధన ధరల మంట ఇంకా కొంతకాలం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ క్షీణించిన నేపథ్యంలో ఉత్పత్తి తగ్గించాలన్న నిర్ణయంలో మార్పు చేయరాదని చమురు ఉత్పత్తి, ఎగుమతి దేశాలు ఒపెక్-ప్లస్‌ నిర్ణయించడమే ఇందుకు కారణం. ఈ మేరకు సౌదీ అరేబియా నేతృత్వంలోని ఒపెక్‌ దేశాలు, ఒపెక్‌లో సభ్యత్వం లేని రష్యా నేతృత్వంలోని దేశాల మధ్య ఈ నెల 4న ఒప్పందం కుదిరింది.

అయితే.. త్వరలో వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున ప్రభుత్వం మరింత పెంపునకు ధైర్యం చేయకపోవచ్చనేది విశ్లేషకుల అభిప్రాయం. ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంధన ధరల్లో మళ్లీ మంట తప్పదని వారు చెబుతున్నారు.

ఇవీ చదవండి:

జీఎస్​టీ విధిస్తే రూ.75కే లీటర్ పెట్రోల్​!

'పెట్రోల్​పై రూ.8.5 ఎక్సైజ్​ సుంకం తగ్గించొచ్చు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.