ETV Bharat / business

బంగారంలో ఇప్పుడు పెట్టుబడులు పెట్టవచ్చా?

author img

By

Published : Mar 13, 2021, 1:07 PM IST

గత కొన్ని నెలలుగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా కంటే ముందున్న స్థాయిని దాదాపు చేరుకుంది ప్రస్తుతం.. పసిడి ధర. అయితే.. ఇంకా ఎంత వరకు తగ్గే అవకాశం ఉంది? ఇప్పుడు పెట్టుబడులు పెట్టవచ్చా? గరిష్ఠ స్థాయిలో కొనుగోలు చేసిన వారు ఏం చేయాలి? దీనికి నిపుణులు చెబుతున్న సమాధానాలే ఈ కథనం.

when gold rates will increase and what are the reasons for rates decrease
బంగారంలో ఇప్పుడు పెట్టుబడులు పెట్టవచ్చా?

గతేడాది బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. అగస్టులో 10 గ్రాముల బంగారం ధర జీవనకాల గరిష్ఠమైన రూ.57 వేలకు చేరింది. అయితే గత కొన్ని నెలలుగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా కంటే ముందున్న స్థాయిని దాదాపు చేరుకుంది బంగారం ధర.

తగ్గుదలకు అనేక కారణాలు..

సాధారణంగా బంగారానికి వడ్డీ రేట్లకు విలోమ సంబంధం ఉంటుంది. అంటే వడ్డీ రేట్లు పెరిగితే బంగారం ధర తగ్గటం, వడ్డీ రేట్లు తగ్గితే బంగారం ధర పెరగటం జరుగుతుంది. గత కొంత కాలంగా వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. దీనితో అమెరికాలో బాండ్లపై రాబడి కూడా పెరుగుతోంది. ప్రాఫిట్ బుకింగ్, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు కూడా తగ్గుముఖం పట్టటం లాంటివి బంగార ధరలు దిగిరావడానికి కారణాలని నిపుణులు చెబుతున్నారు. జనవరి నుంచి మార్చి నాటికి 20 శాతం మేర బంగారానికి డిమాండ్ తగ్గింది. ప్రభుత్వం సుంకాలను కూడా తగ్గించటం కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు.

బంగారం సాధారణంగా.. భౌతిక బంగారం, పెట్టుబడి బంగారం అని రెండు రకాలుగా ఉంటుంది. అయితే భౌతిక బంగారం డిమాండ్ కొంత అటుఇటు అయినప్పటికీ… సాధారణ స్థాయిలోనే ఉటుందని నిపుణులు అంటున్నారు. సాధారణంగా ఏ మార్కెట్లలో అయినా పెరుగుదల, తగ్గుదల సాధారణమని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు బంగారం ధర పడిపోయినప్పటికీ మరికొంత కాలంలో పెరే అవకాశం ఉందని వారు అంటున్నారు.

"ప్రస్తుతం బంగారం 1700 డాలర్ల వద్ద ఉంది. ఇప్పుడు చూస్తోంది సాధారణ కరెక్షన్ మాత్రమే. ప్రస్తుతం అంతర్జాతీయంగా సూచీలు జీవనకాల గరిష్ఠాల దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఈక్విటీ మార్కెట్లు మంచి ప్రదర్శన కనబరుస్తున్నాయి. దీనితో అటువైపు పెట్టుబడులు అటువైపు మళ్లుతున్నాయి. ఇప్పుడు పెట్టుబడి డిమాండ్ వల్ల మాత్రమే ధరల్లో హెచ్చుతగ్గులు వస్తున్నాయి."

-వంశీకృష్ణ, వెల్త్ ట్రీ రీసెర్చ్ హెడ్.

ధరలు స్వల్ప కాలంలో కొంత తగ్గినప్పటికీ… దీర్ఘకాలంలో వృద్ధి ఉంటుందని నిపుణులు అంటున్నారు. ధరలు తగ్గే సైకిల్ లో ఉన్నామన్న దానిని నిపుణులు విభేదిస్తున్నారు.

"ఈ వారంలో తగ్గకపోతే దాదాపు 47,500 వరకు పెరగవచ్చు. ఈ ధర ఇంకా పెరిగితే మాత్రం ఆరు వారాల పాటు బంగారం తగ్గే అవకాశం ఉంటుంది. బేర్ మార్కెట్లోకి వచ్చిందని అంటున్నారు. 2018 అగస్టు నుంచి గత అగస్టు వరకు కరెక్షన్ ఉన్నది కేవలం 48 శాతం మాత్రమే. అది 42730, 39950 స్థాయి కంటే తగ్గే అవకాశం లేదు. కింది స్థాయికి వచ్చినట్లయితే కొనుగోలు చేసుకోవటం ఉత్తమం."

-బ్రహ్మచారి, మాజీ సారథి, ఏటీఎస్ఏ ఛాప్టర్, హైదరాబాద్.

బంగారం కొనాలా? అమ్ముకోవాలా?

ప్రస్తుత ధరలు 10 శాతం 15 శాతం తగ్గవచ్చని… పెట్టుబడి కోసం కొన్న వారు ఈ స్థాయిలో అమ్మినట్లయితే పెద్దగా లాభాలు వచ్చే పరిస్థితి లేదని నిపుణులు అంటున్నారు. ఈటీఎఫ్, సార్వత్రిక బాండ్లలో పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నారు. బంగారం ధర పెద్దగా పడిపోయే అవకాశాలు తక్కువ కాబట్టి సిప్ ద్వారా పెట్టుబడి పెట్టుకోవచ్చని అంటున్నారు.

"గత ఐదేళ్ల డాటాను చూసినట్లయితే షేర్ మార్కెట్ల కంటే బంగారంపై ఎక్కువ రాబడి వచ్చింది. బంగారం 14.7 శాతం రిటర్న్స్ ఇస్తే.. ఈక్విటీ 14 శాతం ఇచ్చాయి. 20 ఏళ్లు, 30 ఏళ్ల దీర్ఘ కాలంలో కూడా మంచి రాబడిని ఇచ్చాయి. 1970లో ఒకవేయి బంగారంలోపెడితే.. దాని విలువ 21వేలుగా ఉంది. గత ఒక సంవత్సరం నుంచి ఈక్విటీ మార్కెట్లు మంచి రాబడి ఇచ్చాయి కానీ గత ఐదు సంవత్సరాలు చూసుకుంటే బంగారం మంచి రాబడిని ఇచ్చింది."

-బ్రహ్మచారి, మాజీ సారథి, ఏటీఎస్ఏ ఛాప్టర్, హైదరాబాద్.

బంగారం ఎప్పటికైనా సురక్షితమైన పెట్టుబడే. సంక్షోభం తలెత్తినప్పుడు బంగారం ఒక ఆస్థిగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇందులో ద్రవ్యలభ్యత కూడా ఎక్కువగా ఉంటుంది. బంగారంలో వచ్చే నష్టాలు చాలా తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

బంగారం రూ.57వేల స్థాయిలో కొన్న వారు కొందరు కంగారు పడుతున్నారు. దీర్ఘకాలం దృష్ట్యా ప్రభావం తక్కువేనని వారు విశ్లేషకులు అంటున్నారు. ఆ సమయంలో కొనుగోలు చేసిన వారు చిన్న మొత్తంలోనైనా బంగారం కొనుగోలు చేయటం ద్వారా సరాసరి తగ్గిపోతుందని సూచిస్తున్నారు.

ఇంకా ఎంత వరకు తగ్గవచ్చు.?

గరిష్ఠంగా రూ.3,000 వరకు మాత్రమే తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో ప్యాకేజీ ప్రకటన వెలువడే అవకాశాలున్న దృష్ట్యా మరింత తగ్గే అవకాశం ఉందని వారు అంటున్నారు.

"అంతర్జాతీయ మార్కెట్ లో 1550 డాలర్లకు మార్కెట్ ఇంకా కరెక్ట్ ఇయినా 1550 డాలర్ల వరకు రావొచ్చు. ప్రస్తుతం 1700 డాలర్ల వద్ద ఉంది. ఇంకా రెండు మూడు వేలు వరకు తగ్గవచ్చు. అమెరికాలో 1.9 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉంది. ఇది వస్తే ద్రవ్యలభ్యత మార్కెట్ లో పెరిగి ఈక్విటీ మార్కెట్ లో పెట్టుబడులు పెరిగి.. బంగారంలో కొంత ప్రతికూలతలు ఉండే అవకాశం ఉంది. దీర్ఘకాలంలో ఇంకా పెరిగే అవకాశం ఉంది."

-వంశీకృష్ణ, వెల్త్ ట్రీ రీసెర్చ్ హెడ్.

ఈక్విటీలో పెరిగితే బంగారం పడిపోతుందన్న అపోహ ఉందని… అయితే 2008లో ఈక్విటీ బంగారం రెండూ పెరిగాయని నిపుణులు చెబుతున్నారు. పాజిటీవ్ సెంటిమెంట్ ఉన్నప్పుడు వేగంగా ధర పెరగకపోయినప్పటికీ.. మొత్తంగా డైరెక్షన్ మాత్రం ఎగువ వైపే ఉంటుందని వారు అంటున్నారు.

మళ్లీ ఎప్పుడు గరిష్ఠాలను తాకుతుంది?

2023 సెప్టెంబర్ వరకు 57వేల స్థాయిని మళ్లీ తాకే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. డాలర్ పడిపోవటం ఇతరత్రా కారణాల వల్ల 2030 నాటికి తులం బంగారం ధర లక్షా 10వేలు ఉంటుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేసింది.

"2023 సెప్టెంబర్ నాటికి 57వేల స్థాయిని దాటే అవకాశం ఉంది. 2023 ఆగస్టు సెప్టెంబర్ తర్వాత మళ్లీ 62, 63వేల స్థాయిని చూడవచ్చు. గ్లోబల్ గా కూడా అంతర్జాతీయ బంగారం కూడా 220 మొన్నటి హై స్థాయిని క్రాస్ చేస్తుంది. 2030 నాటికి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా ప్రకారం లక్షా 10వేలు ఉంటుంది. 2030 తర్వాత కరెక్టీవ్ ఫేస్ ఉంటుంది. 20-25 శాతం కరెక్షన్ ఉంటుంది."

-బ్రహ్మచారి, మాజీ సారథి, ఏటీఎస్ఏ ఛాప్టర్, హైదరాబాద్.

పెళ్లిళ్లు పర్వదినాల సమయంలో వచ్చే డిమాండ్ ప్రభావం ధరలపై ఉండదని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో పెట్టుబడి డిమాండ్, డాలర్ ప్రదర్శన ధరలకు కారణమని వారు అంటున్నారు.

ఇదీ చూడండి: త్వరలో రూ.44,000 దిగువకు మేలిమి బంగారం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.