ETV Bharat / business

ఇప్పటికే ఇన్​స్టాల్​ చేసిన చైనా యాప్​లు పనిచేస్తాయా?

author img

By

Published : Jun 30, 2020, 4:26 PM IST

Updated : Jun 30, 2020, 4:48 PM IST

చైనాకు చెందిన 59 యాప్​లపై భారత ప్రభుత్వం నిషేధం విధించడం వల్ల వాటి భవితవ్యంపై కీలక చర్చ నడుస్తోంది. ఇప్పటికే కొన్నియాప్​లను యాపిల్​, గూగుల్​ తమ ప్లే స్టోర్​ల నుంచి తొలగించాయి. మరికొన్ని మాత్రం అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటిపై నిషేధం ఎలా అమలు అవుతుంది? ఇప్పటికే ఇన్​స్టాల్​ చేసుకున్నవారు యాప్​లను వినియోగించుకోవచ్చా? సంస్థలకు మరో అవకాశం ఉందా? అనే అంశాలను ఓసారి చూద్దాం.

when ban applied on chinese apps?
ఇప్పటికే ఇన్​స్టాల్​ చేసిన చైనా యాప్​లు పనిచేస్తాయా?

సాధారణంగా యాప్​ల వల్ల యూజర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగినా.. దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ప్రభుత్వం భావించినా వాటిపై పాక్షికంగా లేదా పూర్తిగా నిషేధం విధించొచ్చు. ఇప్పటికే ఈ తరహా పద్ధతులను అమెరికా, ఇండోనేసియా, బంగ్లాదేశ్, చైనా​ వంటి దేశాలు అవలంబించాయి. తాజాగా భారత్​ కూడా చైనాకు చెందిన 59 యాప్​లపై వేటు వేసింది. ఫలితంగా ప్లేస్టోర్​, యాపిల్​ స్టోర్​లలో ఈ జాబితాలోని యాప్​లు అందుబాటులో ఉండవు. మరి ఇప్పటికే ఇన్​స్టాల్​ చేసుకున్న యూజర్లకు కంపెనీలు సేవలు అందిస్తాయా? నిషేధం ఎలా అమలవుతుంది? కంపెనీలు మూతపడటమేనా? అనేది చర్చనీయాంశంగా మారింది.

ఇలా అమలు...

నిషేధిత జాబితాలోని యాప్‌లను యాక్సెస్‌ చేసే అవకాశాన్ని నిలిపేయాలని ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు, టెలికాం సర్వీస్​ ప్రొవైడర్లకు ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుంది. ఇంటర్నెట్‌ అవసరం లేని క్యామ్‌స్కానర్‌లాంటి యాప్‌లు ఇప్పటికే డౌన్‌లోడ్‌ అయి ఉంటే పని చేసే అవకాశం ఉంది. అయితే కొత్తగా వాటిని డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఉండదు. ఇప్పటికే డౌన్‌లోడ్‌ అయి ఉన్నా.. ఇంటర్నెట్‌ అవసరమయ్యే టిక్‌టాక్‌, హలో, యూసీ న్యూస్‌ వంటి యాప్‌లు పని చేయవు.

మరిన్ని పెరిగే అవకాశం...

ఇప్పటికే 59 యాప్​లపై నిషేధం విధించిన భారత ప్రభుత్వం.. మరికొన్నింటిపై సమీక్ష జరుపుతోంది. మరిన్ని యాప్​లు నిషేధిత జాబితాలో చేరతాయని సమాచారం. ప్రభుత్వం నిషేధం అమలుపై ఇంటర్నెట్​ సర్వీస్​ ప్రొవైడర్లకు ఆదేశాలు ఇచ్చిన తర్వాత రోజు నుంచి యాప్​ డేటాను నిలిపివేస్తారు. వాటిని గూగుల్​ ప్లే స్టోర్​, ఐ స్టోర్​లోనూ తొలగిస్తారు. అప్డేట్​ ఆప్షన్​ కూడా ఉండదు. ఫలితంగా కొత్త ఫీడ్​ చూడలేరు. యాప్​ ఫోన్​లో ఉన్నంతవరకు పాత వీడియోలు కనిపిస్తాయి.

ఈ దేశాలు నిషేధం...

టిక్​టాక్​.. పిల్లల్లో లైంగిక హింసను ప్రేరేపిస్తోందని గతంలో అమెరికాలో కేసు నమోదైంది. అందులో 13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల ఖాతా గురించి పలు ప్రశ్నలు అడిగింది న్యాయస్థానం. అయితే వాటిలో లోపాలు గమనించిన కోర్టు.. 2019 ఫిబ్రవరిలో టిక్​టాక్​కు 5.7 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. అగ్రరాజ్యంతో పాటు ఇండోనేసియా కొన్నిరోజులు, బంగ్లాదేశ్‌లో పూర్తిగా టిక్‌టాక్‌ను బ్యాన్​ చేశారు.

దేశ భద్రత పేరుతో గూగుల్​, ఫేస్​బుక్​ యాప్​లను నిషేధించింది చైనా. ఇక దుబాయ్​లో వాట్సాప్​తో కాల్స్​ చేయడానికి అనుమతి లేదు. కేవలం చాట్​ చేసుకునే వీలుంది.

కమిటీ నిర్ణయం...

సమాచార భద్రత, గోప్యత విషయంలో భారతీయ చట్టాలకు లోబడి ఉన్నట్లు తెలిపిన టిక్​టాక్​ సంస్థ.. భారతీయ వినియోగదారులకు సంబంధించిన సమాచారాన్ని విదేశీ ప్రభుత్వాలతో పంచుకోవట్లేదని చెప్పింది. అయితే యాప్​నకు సంబంధించిన వివరాలను తెలియజేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి టిక్​టాక్​కు ఆహ్వానం అందిందని... దానిపై వివరణకు ఇస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

ఈ నిషేధం విషయంపై కంపెనీల వివరణలను పరిశీలించడానికి సమాచార మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శిని ఛైర్మన్​గా, ఇతర మంత్రిత్వ శాఖల ప్రతినిధులను సభ్యులుగా ఉంచి కమిటీ వేయనుంది కేంద్రం. సంస్థలన్నీ ఈ కమిటీ ముందు వివరాలు సమర్పించనున్నాయి. అనంతరం నిషేధాన్ని కొనసాగించాలా? తొలగించాలా? అనేది కమిటీ నిర్ణయిస్తుంది.

యాపిల్​ నివేదికే కారణమా..?

నిషేధం విధించిన ఈ చైనా యాప్​లలో డేటా సురక్షితం కాదని గతంలో యాపిల్​ ఓ నివేదిక ద్వారా తమకు తెలిపిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వీటిని పరిశీలించిన అనంతరం సర్వర్​లు సింగపూర్​లో ఉన్నాయని, డేటా చైనాకు వెళ్లదని పేర్కొంటూ యాప్​ యాజమాన్యాల వాదనలను ఖండించింది హోం మంత్రిత్వశాఖ.

ఇదీ చూడండి:

Last Updated :Jun 30, 2020, 4:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.