ETV Bharat / business

మూడు సంస్థలుగా వేదాంతా వ్యాపారాల విభజన..!

author img

By

Published : Nov 18, 2021, 5:25 AM IST

వేదాంతా వ్యాపారాలను పునర్‌వ్యవస్థీకరించే దిశగా ఆలోచిస్తున్నట్లు ఆ సంస్థల ఛైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ తెలిపారు. అల్యూమినియం, ఇనుము- ఉక్కు, చమరు-గ్యాస్‌ వ్యాపారాలను ప్రత్యేక సంస్థలుగా విడదీసి స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదుచేసే ఉద్దేశంతో ఉన్నామన్నారు.

Vedanta
వేదాంతా

వేదాంతా లిమిటెడ్‌ తన వ్యాపారాలను పునర్‌వ్యవస్థీకరించే దిశగా అడుగులు వేస్తోంది. అల్యూమినియం, ఇనుము- ఉక్కు, చమరు-గ్యాస్‌ వ్యాపారాలను ప్రత్యేక సంస్థలుగా విడదీసి స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదుచేసే ఉద్దేశంలో ఉంది. పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళిక కింద.. ఈ మూడు వ్యాపారాలను సమాంతరంగా నిర్వహించనున్నట్లు వేదాంతా గ్రూపు ఛైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ తెలిపారు.

"ఈ మూడు వ్యాపారాలకు వృద్ధి పరంగా అపార అవకాశాలున్నాయి. వీటి పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికపై కసరత్తు చేస్తున్నాం. దీని వల్ల వృద్ధికి అవకాశాలు ఏర్పడటమే కాకుండా.. వాటాదార్ల పెట్టుబడి విలువ పెరుగుతుంద’ని ఆయన చెప్పారు. ఈ ప్రణాళికకు ఆమోదముద్రపడి, అమల్లోకి వస్తే.. వేదాంతా వాటాదార్లకు వేదాంతాతో పాటు ఆ మూడు కంపెనీల షేర్లు అంటే 4 కంపెనీల షేర్లనూ కలిగి ఉంటారని" ఆయన తెలిపారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న విధానం. భారత్‌లో కూడా చూస్తే.. హిందాల్కో, టాటా స్టీల్‌ ప్రత్యేక సంస్థలుగానే ఉన్నాయి. మేం కూడా ఆ మాదిరే చేయనున్నామ"ని అగర్వాల్‌ అన్నారు.

గ్రూపు పునర్‌వ్యవస్థీకరణకు ఉన్న అవకాశాలను మదింపు చేసి సిఫారసు చేసేందుకు డైరెక్టర్లతో ఓ కమిటీని బోర్డు ఏర్పాటు చేసిందని తెలిపారు. కంపెనీల విభజన ఫలానా సమయంలోగా పూర్తి చేయాలన్న లక్ష్యమేమీ పెట్టుకోలేదని, అయితే సాధ్యమైనంత త్వరగానే పూర్తి చేస్తామని తెలిపారు. 2015లో అదానీ గ్రూపు కూడా ఇదే మాదిరి వ్యాపారాలను ప్రత్యేక సంస్థలుగా విభజించిన సంగతి తెలిసిందే.

'వివిధ వ్యాపార విభాగాల స్వభావం, పరిమాణం, సామర్థ్య అవకాశాలు లాంటి వాటిని పరిగణనలోకి తీసుకుని కార్పొరేట్‌ వ్యవస్థపై పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించాలని బోర్డు డైరెక్టర్లు నిర్ణయించారు. విభజన, వ్యూహాత్మక భాగస్వాములు, విక్రయానికి సంబంధించి అవకాశాలను, ప్రత్యామ్నాయాలను పరిశీలించనున్నార’ని వేదాంతా గ్రూపు ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. కార్పొరేట్‌ వ్యవస్థలో సరళీకరణ, వాటాదార్ల పెట్టుబడి విలువ పెంపు, వ్యాపారావకాశాల సృష్టి, విపణుల్లో ఉన్న అవకాశాలను మరింతగా అందిపుచ్చుకోవడం, దీర్ఘకాలిక వృద్ధి, వ్యూహాత్మక భాగస్వామ్యాలను పెంపొందించుకోవడం కోసం వ్యాపారాల విభజన దిశగా యోచన చేస్తున్నామని పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.