ETV Bharat / business

పద్దు 2021-22: 'వాహనరంగానికీ కావాలి ఉపశమనం'

author img

By

Published : Jan 27, 2021, 7:06 AM IST

డిసెంబరు త్రైమాసికంలో మాత్రం వాహన అమ్మకాలు సానుకూలమయ్యాయి. ఈ వృద్ధి కొనసాగాలన్నా.. భారత్‌ను విద్యుత్తు వాహనాల తయారీ కేంద్రంగా మార్చాలన్నా, బడ్జెట్‌లో కీలక చర్యలు అవసరమని 45 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న వాహన రంగం కోరుకుంటోంది.

union budget should help automobile industry
వాహనం నడవాలంటే.. బడ్జెట్‌లో కేటాయింపులు ఉండాలి

కొవిడ్‌ కారణంగా దెబ్బతిన్న గిరాకీని పెంచేందుకు అవసరమైన చర్యలను వచ్చే బడ్జెట్‌లో ప్రవేశ పెట్టాల్సి ఉంది. కొవిడ్‌ ముందునుంచే డీలాపడిన వాహన రంగానికీ ఉపశమనం అవసరమే. డిసెంబరు త్రైమాసికంలో మాత్రం వాహన అమ్మకాలు సానుకూలమయ్యాయి. ఈ వృద్ధి కొనసాగాలన్నా.. భారత్‌ను విద్యుత్తు వాహనాల తయారీ కేంద్రంగా మార్చాలన్నా, బడ్జెట్‌లో కీలక చర్యలు అవసరమని 45 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న వాహన రంగం కోరుకుంటోంది.

పన్నుపోటు: వాహనాలపై 28 శాతం జీఎస్‌టీ, వాహన రకాన్ని బట్టి అదనంగా 1-22 శాతం వరకు సెస్‌ ఉంటోంది. పూర్తిగా నిర్మితమైన వాహనం గా దిగుమతి చేసుకునే వాహనాలపై కస్టమ్స్‌ సుంకం 60-100 శాతం మేర ఉంది.

  • వాహన రంగానికి చేయూతనిచ్చే రిటైల్‌ రుణ సంస్థలు అధిక మొండి బకాయిలతో ఇబ్బంది పడుతున్నాయి. వాణిజ్య వాహనాల విక్రయాలకు మద్దతునిచ్చే ఎన్‌బీఎఫ్‌సీ రంగానికి నిధుల లభ్యత పెరిగితే మినహా కోలుకోని పరిస్థితి ఉంది.
  • 2020 అక్టోబరు 1 నుంచి అమలవుతున్న 0.1 శాతం మేర మూలం వద్ద పన్ను వసూళ్ల వల్ల వాహన రంగంపై భారీ ఆర్థిక భారం పడుతోంది.
  • 2018-19లో దేశీయంగా 2.56 కోట్ల వాహనాలు విక్రయమవ్వగా, 2019-20లో అవి 18 శాతం తగ్గి 2.09 కోట్లకు పరిమితమయ్యాయి. 2020-21 ప్రథమార్ధంలో అమ్మకాలు అంతక్రితం ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 38 శాతం క్షీణించాయి. కొవిడ్‌ భయంతో వ్యక్తిగత/కుటుంబ రవాణా కోసం అధికులు కొనుగోళ్లకు రావడంతో అక్టోబరు-డిసెంబరులో సానుకూలతలు కనిపించాయి.

ఇవి కావాలి..

  • జీఎస్‌టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలి.
  • 15 ఏళ్లకు పైబడిన పాత వాణిజ్య వాహనాలు మార్చుకుని కొత్తవి కొనేందుకు’ స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా తుక్కు విధానం రూపొందించాలి.
  • ఆదాయపు పన్ను చెల్లించేవారు తమ వాహనాలపై తరుగుదలను క్లెయిము చేసుకోవడానికి వీలు కల్పించాలి.
  • ఫేమ్‌ 2 విధానంలో వ్యక్తిగత విద్యుత్తు వాహన కొనుగోలుదార్లకూ ప్రోత్సాహకాలు ఇవ్వాలి.
  • విలాసవంత కార్లపై అధిక పన్నుల వల్ల మొత్తం వాహన విపణిలో వీటి వాటా 1 శాతం కంటే పెరగడం లేదు.వీటిని తగ్గించాలి.
  • ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు అమలు చేయాలి.
  • 25 శాతం కార్పొరేట్‌ పన్నును అన్ని యాజమాన్య, భాగస్వామ్య కంపెనీలకూ వర్తింపజేస్తే.. వాహన డీలర్లకు ప్రయోజనం కలుగుతుంది.

ఇదీ చూడండి: 2021లో భారత్​దే​ అగ్రస్థానం- చైనాదే 2020!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.