స్మార్ట్​ఫోన్లతో వ్యక్తిగత ధ్రువీకరణ: ఉడాయ్​ సీఈఓ

author img

By

Published : Nov 24, 2021, 6:09 PM IST

UIDAI

స్మార్ట్​ఫోన్​లను యూనివర్సల్ ఆథెంటికేటర్‌గా(వ్యక్తిగత ధ్రువీకరణ) ఉపయోగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ-ఉడాయ్​) సీఈఓ సౌరభ్​ గార్గ్ తెలిపారు. ప్రస్తుతం 80 కోట్ల స్మార్ట్‌ఫోన్లను ప్రామాణికత కోసం ఉపయోగించవచ్చని ఆయన వెల్లడించారు.

స్మార్ట్‌ఫోన్లను.. యూనివర్సల్ ఆథెంటికేటర్‌గా(వ్యక్తిగత ధ్రువీకరణ) ఉపయోగించాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ-ఉడాయ్​)(UIDAI news) భావిస్తున్నట్లు సీఈఓ సౌరభ్​ గార్గ్ తెలిపారు. ప్రస్తుతం వేలిముద్రలు, ఐరిస్​(కళ్లు) వన్-టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) ప్రామాణకత కోసం ఉపయోగిస్తున్నారని తెలిపిన​ గార్గ్(UIDAI CEO Saurabh Garg)​.. దీని పరిధిని మరింత విస్తరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఓ సదస్సులో వెల్లడించారు.

"స్మార్ట్‌ఫోన్​ను యూనివర్సల్​ ఆథెంటికేటర్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలోనే దీన్ని అందుబాటులో తీసుకురాగలమని ఆశిస్తున్నాం. వినియోగాదారులు ఉన్నచోట నుంచే గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయడానికి ఇది సహాయపడుతుంది" అని గార్గ్ పేర్కొన్నారు.

ప్రస్తుతం ఉన్న మొత్తం 120 కోట్ల మొబైల్ కనెక్షన్‌లలో 80 కోట్ల స్మార్ట్‌ఫోన్లను ప్రామాణికంగా ఉపయోగించవచ్చని గార్గ్​ తెలిపారు. అయితే స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించడం ద్వారా గుర్తింపు ప్రక్రియ ఎలా పూర్తవుతుందన్న దానిపై వివరణ ఇవ్వలేదు. ప్రాధికార సంస్థకు.. గోప్యత, సమాచార భద్రత ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ఆధార్ నంబరు.. విశ్వవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ప్రామాణికతకు ఏకైక గుర్తింపుగా మారే అవకాశముందన్నారు.

ప్రస్తుతం దేశ జనాభాలో 99.5 శాతం మందికి అంటే 130 కోట్ల మందికి ఆధార్​ కార్డులు ఉన్నాయన్నారు. మిగిలిన 0.5 శాతం మందికి కూడా ఆధార్​ పంపిణీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని గార్క్​ తెలిపారు.

ఇదీ చూడండి: Star Health IPO: స్టార్​హెల్త్​ ఐపీఓ తేదీ ఖరారు- వివరాలివే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.