ఆహార వ్యర్థాలే ఈ అంకుర సంస్థకు పెట్టుబడి

author img

By

Published : Sep 12, 2021, 8:39 AM IST

food wastage turn into treasure

మిగిలిన, పాడయిన ఆహార పదార్థాలను(Food Waste) మనం ఏం చేస్తాం? చెత్త బుట్టలో వేసి, బయట పారబోస్తాం. ఇలా కొన్ని లక్షల ఇళ్లతో పాటు ఆహార తయారీ(Food Processing) పరిశ్రమల నుంచి కూడా కలిపి రోజూ కొన్ని వేల టన్నుల ఆహార వ్యర్థాలు పోగుపడుతున్నాయని అంచనా. అన్ని చోట్లా ఇది పెద్ద సమస్యే. అయితే, ఈ వ్యర్థాలను ఆదాయం ఆర్జించే వనరుగా మలుచుకుంది.. సింగపూర్‌ కేంద్రంగా పనిచేస్తున్న అంకుర సంస్థ ఇన్సెక్టా. ఈ సంస్థకు ఆహార వ్యర్థాలే పెట్టుబడి.

సింగపూర్‌కు చెందిన మహిళా రైతు చావ్‌ కై-నింగ్‌ తన కీటకాలు సరిగా తిన్నాయా? లేదా అనే ధ్యాసతోనే ఉంటుంది. అదేమిటి? కీటకాలను ఎవరైనా పెంచుకుంటారా? అని సందేహమా.. అదే ఇక్కడ వ్యాపార రహస్యం. సింగపూర్‌ వ్యాప్తంగా 2020లో దాదాపు 6,65,000 మెట్రిక్‌ టన్నుల ఆహార పదార్థాలు వృథా(Food Waste) అయితే, అందులో 19శాతం మాత్రమే పునర్వినియోగం అయ్యింది.. ఈ సామాజిక సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రారంభమైన సంస్థే ఇన్సెక్టా. దీని సహ వ్యవస్థాపకులు, చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసరే చావ్‌ కూ-నింగ్‌

ఏం చేస్తారంటే..?

ఆహార వ్యర్థాలను(Food Waste) బ్లాక్‌ సోల్జర్‌ ఫ్లైస్‌ అనే ఒక రకం ఈగలకు ఆహారంగా వేస్తారు. దాదాపు 8 టన్నులకు పైగా ఆహార వ్యర్థాలను ఇందుకు వినియోగిస్తారు. ఈ కీటకాలకు ఎలాంటి ఆహారాన్నైనా అరిగించుకునే శక్తి ఉంటుంది. వీటి గుడ్ల నుంచి వచ్చిన కోట్ల కొద్దీ లార్వాలే ఇక్కడ ప్రధానం. ఇవి ఒక్కోటి తన శరీర బరువులో 8 రెట్ల వరకు ఆహారాన్ని తీసుకుంటాయి. ఇలా అవి తమ శరీరాన్ని పెంచుకుంటాయి. ఈ లార్వాలు 10 నుంచి 14 రోజుల్లో ఈగలుగా మారతాయి. ఈ లోపు వీటి నుంచి కిటోసాన్‌, మెలానిన్‌, ప్రోబయాటిక్స్‌ లాంటివి ఉత్పత్తి చేయడమే ఈ సంస్థ చేసే పని.

ఔషధాలు, సౌందర్య ఉత్పత్తుల్లో వినియోగం

ఈ ఉత్పత్తుల్లో చిటోసాన్‌ను(చెక్కర లాంటి పదార్థం)(Chitosan) ఔషధాలు, సౌందర్య ఉత్పత్తుల్లో వాడతారు. ఆహారాన్ని ప్యాక్‌ చేసేందుకు వినియోగించే యాంటీ మైక్రోబయల్‌ ఫిల్మ్‌ తయారీలో, గాయాలకు డ్రెస్సింగ్‌లో, కొలెస్ట్రాల్‌-బరువు తగ్గేందుకు చిటోసాన్‌ను వినియోగిస్తుంటారు. సాధారణంగా దీనిని రొయ్యలు, పీతలు తదితర వాటి నుంచి సేకరిస్తారు. ఈ చిటోసాన్‌ మార్కెట్‌ విలువ దాదాపు 11 బిలియన్‌ డాలర్లు(సుమారు రూ.80,000 కోట్లు)గా ఉంది. మెలానిన్‌ను ఆర్గానిక్‌ సెమీ కండక్టర్లలో ఉపయోగిస్తారు. ఆ తర్వాత ఈ లార్వాలను ప్రోటీన్‌, ప్రోబయోటిక్స్‌గా మార్చి, పశువులకు ఆహారాన్ని తయారు చేస్తారు. ఇది పశువులకు ఎంతో శక్తినిచ్చే ఆహారం అవుతుంది. ముఖ్యంగా కోళ్ల పరిశ్రమలో దీన్ని వినియోగిస్తారు. రోజుకు 500 కిలోల చిటోసాన్‌ తయారు చేసేందుకు ఇన్సెక్టా ప్రయత్నిస్తోంది. సింగపూర్‌కు చెందిన రెండు సంస్థలతో దీనికి సంబంధించి ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. మనదేశంలోనూ ఇలాంటి సంస్థలు ఏర్పాటైతే ఎంతో మేలు కలుగుతుందని పరిశ్రమ నిపుణులు పేర్కొంటున్నారు.

ఇదీ చూడండి: కస్టమ్స్​ సుంకం తగ్గింపు.. దిగిరానున్న వంట నూనె ధరలు!

ఇదీ చూడండి: Tesla India: 'ముందు భారత్​లో తయారీ ప్రారంభించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.