ETV Bharat / business

నిమిషానికి 9వేల ఫుడ్‌ ఆర్డర్లు.. 1229 బిర్యానీల డెలివరీ

author img

By

Published : Jan 2, 2022, 5:58 AM IST

Updated : Jan 2, 2022, 6:56 AM IST

Swiggy Orders New Year: న్యూఇయర్‌ వేళ ఫుడ్‌ డెలివరీ యాప్‌ల పంట పండింది. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో స్విగ్గీ యాప్‌కు ఏకంగా నిమిషానికి 9వేల ఆర్డర్లు వచ్చాయట. జొమాటోలోనూ నిమిషానికి 8వేల మందికి పైగా ఆహారం ఆర్డర్‌ చేసుకున్నట్లు ఆయా యాప్‌లు వెల్లడించాయి.

New Year 2022
New Year 2022

Swiggy Orders New Year: కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న వేళ ఈసారి కూడా కొత్త సంవత్సరం వేడుకలు కాస్త కళతప్పాయి. అటు ఒమిక్రాన్‌ భయం.. ఇటు ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో చాలా మంది ఇళ్లకే పరిమితమై నూతన ఏడాదిని ఆహ్వానించారు. అయితే న్యూఇయర్‌ వేళ ఇంటి భోజనానికి కాస్త విరామమిచ్చి.. ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్లు పెట్టుకున్నారు. దీంతో ఫుడ్‌ డెలివరీ యాప్‌ల పంట పండింది. శుక్రవారం రాత్రి నుంచే ఫుడ్‌ ఆర్డర్లకు గిరాకీ పెరిగింది. అర్ధరాత్రి సమయంలో స్విగ్గీ యాప్‌కు ఏకంగా నిమిషానికి 9వేల డెలివరీలు వచ్చాయట. జొమాటోలోనూ నిమిషానికి 8వేల మందికి పైగా ఆహారం ఆర్డర్‌ చేసుకున్నట్లు ఆయా యాప్‌లు వెల్లడించాయి.

నూతన సంవత్సరాన్ని స్వాగతించిన వేళ.. తమకు 20లక్షలకు పైగా ఫుడ్‌ ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. ఫుడ్ ఆర్డర్లలో గతేడాది సాధించిన సొంత రికార్డును బద్దలుకొట్టినట్లు తెలిపింది. గతేడాది న్యూఇయర్‌ సందర్భంగా స్విగ్గీకి నిమిషానికి 5500 ఆర్డర్లు రాగా.. ఈ ఏడాది ఏకంగా 9049 ఆర్డర్లు వచ్చినట్లు పేర్కొంది. ఇక నిమిషానికి 1229 బిర్యానీలను డెలివరీ చేసినట్లు తెలిపింది. స్విగ్గీలో చికెన్‌ బిర్యానీ, బటర్‌ నాన్‌, మసాలా దోశ, పన్నీర్‌ బటర్‌ మసాలా, చికెన్ ఫ్రైడ్ రైస్‌కు అత్యధిక ఆర్డర్లు వచ్చినట్లు చెప్పింది. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు కూడా నిన్న రాత్రి మంచి గిరాకీ వచ్చిందట.

Zomato Orders New Year: మరో డెలివరీ యాప్‌ జొమాటోలోనూ ఆర్డర్ల జోరు పెరిగింది. నూతన సంవత్సరం వేళ ఈ యాప్‌ నుంచి కూడా 20లక్షలకు పైగా మంది ఆహారాన్ని ఆర్డర్ చేసుకున్నారు. నిమిషానికి 8000లకు పైగా ఆర్డర్లు వచ్చినట్లు జొమాటో తెలిపింది. ఒక రోజులో 20లక్షలకు పైగా ఆర్డర్లు రావడం ఇదే తొలిసారి అని జొమాటో సీఈఓ దీపిందర్‌ గోయల్ ట్విటర్‌ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. మొత్తంగా రూ.91కోట్లకు పైగా విలువైన ఆహారాన్ని డెలివరీ చేసినట్లు పేర్కొన్నారు.

స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్‌ డెలివరీ యాప్స్‌ ఇకపై నేరుగా కస్టమర్‌ నుంచే 5 శాతం జీఎస్టీని వసూలు చేయనున్నాయి. గతంలో జీఎస్టీని రెస్టారెంట్ల నుంచి వసూలు చేసేవి. జనవరి 1 నుంచి కొత్త నిబంధన అమల్లోకి రానుంది. అయితే, వినియోగదారులపై ఎలాంటి భారం పడబోదు. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసేటప్పుడు ఆహారానికి గానూ గతంలో రెస్టారెంట్లు ఐదు శాతం చొప్పున జీఎస్టీని వసూలు చేసేవి.

ఇదీ చూడండి: కార్ల విక్రయాల్లో టాటా మోటార్స్​ జోరు- మారుతీ, హ్యుందాయ్​​ బేజారు​

Last Updated : Jan 2, 2022, 6:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.