ETV Bharat / business

Amazon Future Deal: అమెజాన్‌, ఫ్యూచర్‌ గ్రూప్‌కు సుప్రీం కీలక సూచన

author img

By

Published : Feb 23, 2022, 8:55 PM IST

Amazon Future Deal: అమెజాన్‌ - ఫ్యూచర్‌ గ్రూప్‌లకు సంబంధించిన డీల్​ వ్యవహారంలో ఇరుపక్షాలకు సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. నేషనల్‌ లా అప్పీలేట్‌ ట్రైబ్యునల్​ను ఆశ్రయించాలని చెప్పింది. ఈ డీల్‌ కాంపీటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఈ కేసును సత్వరం తేల్చాల్సిందిగా ఎన్​సీఎల్​ఏటీను కోరాలని రెండు కంపెనీలకు ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

Amazon Future Deal
అమెజాన్‌, ఫ్యూచర్‌ డీల్​

Amazon Future Deal: అమెజాన్‌- ఫ్యూచర్‌ గ్రూప్‌ వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. ఇరు పక్షాలూ నేషనల్‌ లా అప్పీలేట్‌ ట్రైబ్యునల్​ను ఆశ్రయించాలని పేర్కొంది. ఈ డీల్‌ చెల్లుబాటు కాదంటూ కాంపీటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను త్వరగా తేల్చాల్సిందిగా ఎన్​సీఎల్​ఏటీను కోరాలని తన సూచనల్లో పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న, జస్టిస్‌ హిమా కోహ్లీ ధర్మాసనం స్పష్టంచేసింది. తదుపరి విచారణను మార్చి 9కి బెంచ్‌ వాయిదా వేసింది.

ఫ్యూచర్‌ రిటైల్‌ను.. రిలయన్స్‌ రిటైల్‌లో విలీనం చేసేందుకు సంబంధించి రూ.24,500 కోట్ల విలువైన డీల్‌పై మధ్యవర్తిత్వానికి వెళ్లకుండా స్టే ఇవ్వాలన్న ఫ్యూచర్‌ గ్రూప్‌ విజ్ఞాపనపై దిల్లీ హైకోర్టు గతంలో విచారణ జరిపింది. ఫ్యూచర్‌ గ్రూప్‌కు అనుకూలంగా మధ్యవర్తిత్వంపై స్టే విధించింది. దీన్ని సవాల్‌ చేస్తూ అమెజాన్‌ సుప్రీంను ఆశ్రయించింది. దీనిపై బుధవారం జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. మరోవైపు అమెజాన్‌-ఫ్యూచర్‌ గ్రూప్‌ ఒప్పందం చెల్లుబాటు కాదంటూ డిసెంబర్‌ 17న సీసీఐ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ అమెజాన్‌ ఎన్​సీఎల్​ఏటీను సైతం ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దాఖలైన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ ఎన్​సీఎల్​ఏటీ ముందు దాఖలైన పిటిషన్‌కు అనుసంధానమై ఉంది కాబట్టి రెండు పార్టీలూ ఈ అంశాన్ని వీలైనంత త్వరగా తేల్చాలని ఎన్​సీఎల్​ఏటీను కోరాలని బెంచ్‌ సూచించింది. తదుపరి విచారణను మార్చి 9కి వాయిదా వేసింది.

నేపథ్యమిదీ..

అమెజాన్‌, ఫ్యూచర్‌ కూపన్‌ సంస్థల మధ్య 2019లో జరిగిన ఒప్పందంలోని హక్కులను వినియోగించి ఫ్యూచర్‌-రిలయన్స్‌ ఒప్పందాన్ని అమెజాన్‌ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అమెజాన్‌-ఫ్యూచర్‌ కూపన్ల ఒప్పందాన్ని కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) డిసెంబరు 17న రద్దు చేసింది. తమ అనుమతులు కోరడానికి ముందు అమెజాన్‌ కొంత సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టిందని తెలిపింది. దీంతో ఆ ఒప్పందాన్ని రద్దు చేస్తూ అమెజాన్‌పై రూ.202 కోట్ల అపరాధ రుసుమును సైతం సీసీఐ విధించింది. దీంతో మధ్యవర్తిత్వ ప్రక్రియ ముందుకు వెళ్లకుండా అంతర్జాతీయ మధ్యవర్తిత్వ ట్రైబ్యునల్‌కు ఆదేశాలు జారీ చేయాలని ఫ్యూచర్‌ గ్రూప్‌ దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఫ్యూచర్‌ గ్రూప్‌నకు అనుకూలంగా తీర్పు వెలువడింది. జనవరి 5-8 మధ్య జరగాల్సిన మధ్యవర్తిత్వ ప్రక్రియను సింగపూర్‌ ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ నిలిపివేసింది. దీన్ని సవాల్‌ చేస్తూ జనవరి 5న అమెజాన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఇదీ చూడండి:

మార్కెట్లోకి సరికొత్తగా 'మారుతీ బాలెనో'- ధరెంతంటే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.