ETV Bharat / business

Russia-Ukraine conflict: భారీగా పెరగనున్న ఎలక్ట్రానిక్‌ వస్తువుల ధరలు!

author img

By

Published : Mar 4, 2022, 7:00 PM IST

Russia-Ukraine conflict: రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భీకరపోరు ప్రపంచ దేశాలతో పాటు అంతర్జాతీయ వాణిజ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచం.. ఈ యుద్ధంతో మళ్లీ ఆందోళన చెందుతోంది. ఇప్పటికే యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు గరిష్ట స్థాయికి చేరాయి. అటు ఎలక్ట్రానిక్స్‌ వస్తువుల ధరలు సైతం భారీగా పెరగనున్నాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. సెమీకండక్టర్ల తయారీకి కీలకమైన నియాన్‌, పల్లాడియం ఉత్పత్తిలో సింహాభాగం రష్యా, ఉక్రెయిన్‌ నుంచే ఎగుమతి అవుతుండటం ఈ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేయనుంది.

chip shortage
చిప్​ షార్టేజ్​

Russia-Ukraine conflict: కరోనా కారణంగా తీవ్రంగా ప్రభావితమైన రంగాల్లో ఎలక్ట్రానిక్స్‌ ఒకటి. ఇప్పటికే సెమీకండక్టర్ల కొరతతో అల్లాడుతున్న ఈ రంగం ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంతో మారోమారు గడ్డు పరిస్థితిని ఎదుర్కోబోతోంది. సెమీకండక్టర్‌ చిప్స్‌ తయారీలో కీలక ముడి వస్తువులుగా ఉన్న పల్లాడియం, నియాన్‌ ఎగుమతిలో ఉక్రెయిన్‌- రష్యాలే సింహా భాగాన్ని ఆక్రమించాయి. ప్రపంచ దేశాలకు ఎగుమతవుతున్న పల్లాడియంలో 44 శాతం ఒక్క రష్యా నుంచే సరఫరా అవుతోంది. ఇటు ఉక్రెయిన్‌ సైతం 70 శాతం మేర నియాన్‌ను ప్రపంచ దేశాలకు అందిస్తోంది. ప్రస్తుతం ఈ రెండు దేశాలు యుద్ధంలో నిమగ్నం కావడం కారణంగా పల్లాడియం, నియాన్‌ ఎగుమతిపై తీవ్ర ప్రభావం పడనుంది. ఇప్పటికే సెమీకండక్టర్ల కొరత టెక్‌ రంగాన్ని వేధిస్తుండగా ప్రస్తుత యుద్ధం దానిని మరింత చిక్కుల్లోకి నెడుతోంది.

నియాన్, పల్లాడియం సరఫరాలో అంతరాయం ఏర్పడితే సెమీకండక్టర్ల ఆధారంగా నడిచే ఆటోమెుబైల్‌ రంగం, స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌ సహా అన్ని ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్‌పై ప్రభావం పడనుంది. 2014- 15 రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సమయంలో నియాన్ ధరలు విపరీతంగా పెరగడంతో సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింది.

ప్రస్తుత రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ఇలానే కొనసాగితే ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి సంస్థలు చైనా, అమెరికా, కెనడాను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఆ దేశాల్లోని పల్లాడియం, నియాన్‌ ప్రపంచ అవసరాలకు ఏమాత్రం సరిపోదు. ఫలితంగా సెమీకండక్టర్ల ఉత్పత్తి నెమ్మదించి ఎలక్ట్రానిక్‌ వస్తువుల ధరలు భారీగా పెరిగే ప్రమాదముందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇదీ చూడండి:

ఎన్నికల తర్వాత 'పెట్రో' మోత- రూ.12 పెంపు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.